శబరిమలలో మహిళలపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం
- స్పష్టత ఇవ్వాల్సిందిగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళాభక్తులను అనుమతించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 'ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించడంలేదు? అనుమతి ఇస్తారా? లేదా? త్వరితగతిన స్పంష్టం చేయండి' అంటూ ఆలయ నిర్వాహకులైన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేయాలని కోర్టు పేర్కొంది.
శబరిమలకు మహిళల నిరాకరణపై ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ దాఖలుచేసిన పిటిషన్ ను సోమవారం విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదావేసింది. గతంలో ఇదే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన కేరళ హైకోర్టు.. మహిళల నిషేధాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు ఆలయప్రవేశం లేదన్న నిబంధన ఏళ్లుగా కొనసాగుతూవస్తోంది.