
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కోవిడ్ నిబంధనలకు కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు మినహాయింపు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మినహాయింపులపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు స్పందించింది. పాజిటివిటీ రేటు కేరళలో 10% పైగానే ఉన్నా బక్రీద్ కోసం కోవిడ్ నిబంధనలకు మినహాయింపు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఈ పిటిషన్‌పై వెంటనే స్పందించాలని కేరళ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
తాజాగా మంగళవారం కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వ్యాపారుల ఒత్తిడితో సడలింపులు ఇవ్వడమేమిటని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. పౌరులు జీవించే హక్కుకు భగం కలిగించినట్టేనని న్యాయస్థానం పేర్కొంది. పౌరులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 21వ తేదీన బక్రీద్ పర్వదినం ఉండడంతో కేరళ ప్రభుత్వం మూడు రోజులు సడలింపులు ఇచ్చింది.
18 నుంచి 20వ తేదీ వరకు టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, జ్యువెల్లరీ, ఫ్యాన్సీ స్టోర్ తదితర అన్ని దుకాణాలు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని కేరళ సీఎం విజయన్ ప్రకటించారు. కోవిడ్ కేసుల ఆధారంగా నిర్ధారించిన ఏ, బీ, సీ కేటగిరీ ప్రాంతాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న డీ కేటగిరీ ప్రాంతంలో 19న మాత్రమే ఈ మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ముందుకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment