cm vijayan
-
నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్ సంచలన ఆరోపణలు
తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తనపై భౌతిక దాడి చేయించి గాయపరిచేందుకు కుట్ర పన్నారన్నారు. ఢిల్లీ వెళ్లేందుకుగాను తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న గవర్నర్ వాహనాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తల వాహనాలు ఢీ కొన్నాయి. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం కోపంగా కారు నుంచి బయటికి వచ్చిన గవర్నర్ ఈ ఘటన వెనుక సీఎం విజయన్ కుట్ర ఉందని ఆరోపించడం సంచలనం రేపింది. ‘ఒకవేళ సీఎం కాన్వాయ్ వెళ్తుంటే మధ్యలో వేరే వాళ్ల కార్లు రావడానికైనా అనుమతిస్తారా..? సీఎం కారు సమీపంలోకి మరో కారును రానిస్తారా..? కానీ నా విషయంలో ఏం జరిగింది..? ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నా కాన్వాయ్ వెళ్లే దారిలో కారల్లో వచ్చి నల్ల జెండాలు ప్రదర్శించారు. నా కారును ఇరువైపుల నుంచి వారి కార్లతో ఢీ కొట్టారు. ఇదంతా జరుగుతుండగా పోలీసులు వారిని కార్లలోపలికి నెట్టారు. దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చేయించింది కచ్చితంగా సీఎం విజయనే. గూండాలను పంపి నాపై దాడికి కుట్ర పన్నారు. తిరువనంతపరం రోడ్లు గుండాల ఆధీనంలోకి వెళ్లాయి. ఒకవేళ సీఎం నాతో విభేదించాలనుకుంటే విభేదించవచ్చు.నాపై దాడి చేయాల్సిన అవసరం లేదు. కేరళలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి’ అని గవర్నర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీచదవండి..రాహుల్‌పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..? -
‘బక్రీద్’ మినహాయింపులపై కేరళకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా కోవిడ్ నిబంధనలకు కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు మినహాయింపు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మినహాయింపులపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు స్పందించింది. పాజిటివిటీ రేటు కేరళలో 10% పైగానే ఉన్నా బక్రీద్ కోసం కోవిడ్ నిబంధనలకు మినహాయింపు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. ఈ పిటిషన్‌పై వెంటనే స్పందించాలని కేరళ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తాజాగా మంగళవారం కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వ్యాపారుల ఒత్తిడితో సడలింపులు ఇవ్వడమేమిటని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. పౌరులు జీవించే హక్కుకు భగం కలిగించినట్టేనని న్యాయస్థానం పేర్కొంది. పౌరులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 21వ తేదీన బక్రీద్ పర్వదినం ఉండడంతో కేరళ ప్రభుత్వం మూడు రోజులు సడలింపులు ఇచ్చింది. 18 నుంచి 20వ తేదీ వరకు టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, జ్యువెల్లరీ, ఫ్యాన్సీ స్టోర్ తదితర అన్ని దుకాణాలు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని కేరళ సీఎం విజయన్ ప్రకటించారు. కోవిడ్ కేసుల ఆధారంగా నిర్ధారించిన ఏ, బీ, సీ కేటగిరీ ప్రాంతాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న డీ కేటగిరీ ప్రాంతంలో 19న మాత్రమే ఈ మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ముందుకు వచ్చింది. -
‘కేరళ బంగారం’ కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హోం శాఖ పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకుని, మరింత మెరుగైన దర్యాప్తు జరపాలంటూ కేరళ సీఎం విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన మరుసటి రోజే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం గల్ఫ్ నుంచి తిరువనంతపురం వచ్చిన ఓ విమానంలో దౌత్యపరమైన సామగ్రి పేరుతో ఉన్న బ్యాగులో సుమారు 30 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. -
రణరంగంగా కేరళ
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో 266 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ పి. సదాశివం ముఖ్యమంత్రి విజయన్ను ఆదేశించారు. తాజా హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని విజయన్ ఆరోపించారు. మరోవైపు, శబరిమల ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత గర్భగుడిని శుద్ధిచేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీజేపీ కార్యకర్తలకు కత్తిపోట్లు.. త్రిసూర్‌లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, పాలక్కడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్స్ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పాలక్కడ్‌లో సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు, దాని ముందు నిలిపిన వాహనాల్ని ధ్వంసం చేశారు. కన్నూర్ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. మీడియాపై దాడికి నిరసనగా తిరువనంతపురంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యక్రమాలను బహిష్కరించాలని కేరళ మీడియా వర్కింగ్ యూనియన్ నిర్ణయించింది. హర్తాళ్ వల్ల దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. గురువారం కాంగ్రెస్ ‘బ్లాక్ డే’గా పాటించింది. పాతనంతిట్టా జిల్లాలోని పాండలమ్లో సీపీఎం కార్యకర్తలు తమ కార్యాలయ భవనం పైనుంచి రాళ్లు రువ్వడంతో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఉన్నితాన్ చనిపోయారు. బుధవారం సాయంత్రం శబరిమల కర్మ సమితి చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 9 మందిని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నితాన్ గుండెపోటుతో మరణించాడని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. చెన్నైలో కేరళ సీఎం దిష్టిబొమ్మ దహనం సాక్షి, చెన్నై: శబరిమల ఆందోళనలు చెన్నైకీ విస్తరించాయి. పల్లవరంలో బీజేపీ కార్యకర్తలు కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ విమర్శించారు. హింస వెనక బీజేపీ, ఆరెస్సెస్: విజయన్ హర్తాళ్ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్ తప్పుబట్టారు. ఢిల్లీలో కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్న అయ్యప్ప ధర్మ సంరక్షక సమితి సభ్యులు -
కేరళ వరదలు : దుబాయ్‌ను అలా చూడలేం..
తిరువనంతపురం : వరదలతో ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళకు దుబాయ్ ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. దుబాయ్‌ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని, భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు దుబాయ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని విజయన్ వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంతవరకూ దుబాయ్ కేరళకు వరద సాయాన్ని తన సొంతంగా ప్రతిపాదించిందని, వారి దేశ నిర్మాణంలో భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు ఇతోధిక సాయం చేశారని ఆ దేశ పాలకులు గుర్తెరిగిన క్రమంలో దుబాయ్‌ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని విజయన్ స్పష్టం చేశారు. అబుదాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సాయంపై ప్రతిపాదించారని సీఎం విజయన్ చెప్పారు. కాగా, 2004లో ఏర్పాటైన విపత్తు సాయం విధానానికి అనుగుణంగా భారత్ వ్యవహరిస్తుందని, అప్పటి నుంచి విదేశ సాయాన్ని తిరస్కరిస్తూ వస్తున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: యూఏఈ సాయానికి కేంద్రం నో!) -
రెండేళ్ల పోరాటం.. దిగొచ్చిన ప్రభుత్వం!
అది ఉద్యోగమైనా.. ఉన్నత పదవులైనా.. చివరకు న్యాయం కోసం చేసే పోరాటమైనా.. ఎదుటివారు దిగిరావాల్సిందే. మనది ప్రజాస్వామ్యమే అయినప్పటికీ న్యాయం కోసం అడుగడుగునా పోరాటాలు దేశంలో సాధారణమే. అందుకే ఇలాంటి పోరాటాలను ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. ఓ యువకుడి విషయంలో కూడా ప్రభుత్వం తన పాతవైఖరినే ప్రదర్శించింది. అయితే ఆ యువకుడు మాత్రం పట్టుదలగా పోరాడాడు. రోజులు.. వారాలు.. నెలలు కాదు, ఏకంగా రెండేళ్లపాటు పోరాటాన్ని కొనసాగించాడు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వమే దిగొచ్చింది. వివరాల్లోకెళ్తే... సాక్షి, స్కూల్ ఎడిషన్ అన్యాయంపై చేసే పోరాటానికి అలుపు ఉండకూడదనేది మొదటి లక్షణంగా చెబుతారు. అందుకే కేరళకు చెందిన శ్రీజిత్.. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర సచివాలయం ముందు పోరాటాన్ని ప్రారంభించాడు. ఓ దోపిడీ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీజిత్ సోదరుడు శ్రీజీవ్‌ను 2014, మేలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అతను పోలీస్ కస్టడీలో మరణించాడు. శ్రీజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వాదించారు. కానీ శ్రీజిత్ మాత్రం అంగీకరించలేదు. తన సోదరుడిని పోలీసులే చంపారని, దీనికి బాధ్యులైన ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇదే డిమాండ్‌తో తిరువనంతపురంలోని సెక్రటేరియట్ దగ్గరికి వెళ్లడం, రోజంతా అక్కడ కూర్చోవడం.. న్యాయం చేయాలని డిమాండ్ చేయడం.. అలా 765 రోజులపాటు పోరాడి, చివరకు అనుకున్నది సాధించాడు. ఈ నెల 14న సీఎం పినరయి విజయన్ శ్రీజిత్‌ను కలిసి మరోసారి సీబీఐకి లేఖరాస్తానని హామీ ఇచ్చారు. దీంతో అతను తన నిరసనను విరమించుకున్నాడు. -
నా రంగు కాషాయమైతే కాదు
-
నా రంగు కాషాయమైతే కాదు
► కమల్ హాసన్ వెల్లడి ► కేరళ సీఎం విజయన్‌తో భేటీ తమిళ సినిమా(చెన్నై)/ తిరువనంతపురం : రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన ప్రముఖ నటుడు కమల్ హాసన్(52) బీజేపీతో జట్టుకట్టేది లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఆయన అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లో కమల్ కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై విజయన్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. విజయన్‌తో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు కమల్ హాసన్ తెలిపారు. తమిళనాడులో బీజేపీతో జట్టు కట్టనున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ గత 40 ఏళ్లుగా నేను సినిమాల్లో పనిచేస్తున్నాను. ఒక విషయమైతే నేను స్పష్టంగా చెప్పగలను. నా రంగు కాషాయం(బీజేపీ) మాత్రం కాదు’ అని పేర్కొన్నారు. వామపక్ష నాయకులను తన హీరోలుగా అభివర్ణించిన కమల్..తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలని కమల్ డిమాండ్ చేశారు. విజయన్ నేతృత్వంలో కేరళ అభివృద్ధిలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతోందని ప్రశంసించారు. తన కేరళ పర్యటనను రాజకీయ వైజ్ఞానిక యాత్రగా కమల్ హాసన్ అభివర్ణించారు. మరోవైపు ఈ భేటీపై విజయన్ ఫేస్బుక్లో స్పందిస్తూ.. కమల్‌తో తనకు చాలాకాలంగా మంచి స్నేహం ఉన్నట్లు తెలిపారు. కేరళకు వచ్చిన ప్రతిసారీ కమల్ హాసన్ తనను కలుసుకుంటారని, అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలుసుకోవడం ఇదే తొలిసారని విజయన్ వెల్లడించారు. -
19న కేరళ సీఎం విజయన్ కర్నూలు రాక
– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు హాజరు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 19, 20, 21 తేదీల్లో కర్నూలులో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 27వ మహాసభలకు కేరళ సీఎం పినరయి విజయన్ హాజరుకానున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి టి.షడ్రక్ శనివారం ప్రకటనలో తెలిపారు. మహాసభల ప్రారంభ రోజైనా 19వ తేదీ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారన్నారు. నేడు ఆహ్వాన సంఘ సమావేశం రాష్ట్ర మహాసభల విజయం కోసం ఆదివారం కార్మిక కర్షక భవన్లో ఆహ్వాన సంఘ సమావేశాని ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు షడ్రక్ తెలిపారు. ప్యాట్రన్స్, చీఫ్ ప్యాట్రన్స్, గౌరవ సభ్యులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.