రాష్ట్ర సచివాలయం ముందు మౌన పోరాటం చేస్తున్న శ్రీజిత్
అది ఉద్యోగమైనా.. ఉన్నత పదవులైనా.. చివరకు న్యాయం కోసం చేసే పోరాటమైనా.. ఎదుటివారు దిగిరావాల్సిందే. మనది ప్రజాస్వామ్యమే అయినప్పటికీ న్యాయం కోసం అడుగడుగునా పోరాటాలు దేశంలో సాధారణమే. అందుకే ఇలాంటి పోరాటాలను ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. ఓ యువకుడి విషయంలో కూడా ప్రభుత్వం తన పాతవైఖరినే ప్రదర్శించింది. అయితే ఆ యువకుడు మాత్రం పట్టుదలగా పోరాడాడు. రోజులు.. వారాలు.. నెలలు కాదు, ఏకంగా రెండేళ్లపాటు పోరాటాన్ని కొనసాగించాడు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వమే దిగొచ్చింది. వివరాల్లోకెళ్తే...
సాక్షి, స్కూల్ ఎడిషన్
అన్యాయంపై చేసే పోరాటానికి అలుపు ఉండకూడదనేది మొదటి లక్షణంగా చెబుతారు. అందుకే కేరళకు చెందిన శ్రీజిత్.. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర సచివాలయం ముందు పోరాటాన్ని ప్రారంభించాడు. ఓ దోపిడీ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీజిత్ సోదరుడు శ్రీజీవ్‌ను 2014, మేలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అతను పోలీస్ కస్టడీలో మరణించాడు. శ్రీజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వాదించారు.
కానీ శ్రీజిత్ మాత్రం అంగీకరించలేదు. తన సోదరుడిని పోలీసులే చంపారని, దీనికి బాధ్యులైన ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇదే డిమాండ్‌తో తిరువనంతపురంలోని సెక్రటేరియట్ దగ్గరికి వెళ్లడం, రోజంతా అక్కడ కూర్చోవడం.. న్యాయం చేయాలని డిమాండ్ చేయడం.. అలా 765 రోజులపాటు పోరాడి, చివరకు అనుకున్నది సాధించాడు. ఈ నెల 14న సీఎం పినరయి విజయన్ శ్రీజిత్‌ను కలిసి మరోసారి సీబీఐకి లేఖరాస్తానని హామీ ఇచ్చారు. దీంతో అతను తన నిరసనను విరమించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment