రోడ్డు పక్కన కూర్చుని కేరళ గవర్నర్‌ నిరసన | Kerala Governor angry roadside protest | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన కూర్చుని కేరళ గవర్నర్‌ నిరసన

Jan 28 2024 5:33 AM | Updated on Jan 28 2024 5:33 AM

Kerala Governor angry roadside protest - Sakshi

శనివారం కేరళలోని నీలమెల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించిన గవర్నర్‌ ఆరిఫ్‌

తిరువనంతపురం/కొల్లం: కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  ఈసారి కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ రోడ్డు పక్కన రెండు గంటలపాటు కూర్చుని దాదాపు ధర్నాకు దిగినంత పనిచేశారు. శనివారం ఉదయం కొట్టరక్కరలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ందుకు గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ వెళ్తుండగా అధికార సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిలామెల్‌ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు.

‘సంఘీ చాన్సెలర్‌ గో బ్యాక్‌’అంటూ ఆయన్నుద్దేశించి నినాదాలు చేశారు. ఆగ్రహించిన గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ తన కారును ఆపించి, కిందికి దిగారు. తన వద్దకు రావాలంటూ పెద్దగా అరుస్తూ వారి సమీపానికి వెళ్లారు. దీంతో, పోలీసులు నినాదాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు, గవర్నర్‌కు మధ్య అడ్డుగా నిలబడ్డారు. అనంతరం, గవర్నర్‌ సమీపంలోని దుకాణం నుంచి కుర్చీ తెప్పించుకుని రెండు గంటలపాటు రోడ్డు పక్కనే కూర్చున్నారు.

నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను గట్టిగా డిమాండ్‌ చేశారు. నిరసనల్లో పాల్గొన్న 17 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కాపీని చేతికి అందించాకే ఆయన నిరసన విరమించారు. ముఖ్యమంత్రి విజయన్‌ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర అధినేతగా వాటిని సహించబోనన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వామపక్ష ప్రభుత్వం తనపై దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు.

ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను గూండాలు, రోజువారీ కూలీలుగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ఏరాష్ట్ర గవర్నర్‌ కూడా ఇలా వ్యవహరించ లేదని కేరళ విద్యామంత్రి వి.శివన్‌కుట్టి వ్యాఖ్యానించారు.  నిలామెల్‌ ఘటన జరిగిన గంటలోపే ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కూడిన జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలి్పంచినట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించిందని రాజ్‌భవన్‌ ప్రకటించింది. గవర్నర్‌ తిరిగి తిరువనంతపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అక్కడ కూడా నిరసనలు కొనసాగించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement