తిరుపతి, విజయవాడల్లో విద్యార్థి సంఘాల డిమాండ్
తిరుపతి సిటీ/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ముందు ‘వైద్య విద్యను గాడిలో పెడతాం..ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లు ఎన్నో మాటలు చెప్పారని, తీరా అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే విధంగా అడుగులు వేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మండిపడ్డారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎంసీ కి రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట, విజయవాడ లెనిన్ సెంటర్‌లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 107,108 జీవోలను రద్దు చేసి వైద్య విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు.
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరంచేసే ప్రయత్నాలు చేయడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నూతన కళాశాలలను నిర్మించి మెడికల్ సీట్లు పెంచి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పులివెందుల మెడికల్ కళాశాల సీట్లు కొనసాగించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
విజయవాడలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని ఎన్‌ఎంసీకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 700 సీట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లికి వందనం ఎప్పుడు...?
తిరుపతి అర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినప్పటికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర ప్రశ్నించారు. శుక్రవారం విద్యార్థి సంఘం నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నిసరన వ్యక్తం చేసి ఏవో ఝాన్సీలక్ష్మికి వినతిపత్రమిచ్చారు.
సూపర్‌సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment