మా కలలు చిదిమేసిన ప్రభుత్వం | The decision to privatize medical colleges has put our future in question | Sakshi
Sakshi News home page

మా కలలు చిదిమేసిన ప్రభుత్వం

Published Wed, Sep 18 2024 5:30 AM | Last Updated on Wed, Sep 18 2024 1:03 PM

The decision to privatize medical colleges has put our future in question

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసింది 

మా తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసింది 

రిజర్వేషన్‌ కేటగిరీ వారికీ తీవ్ర నష్టం

ఎన్నికల ముందు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు రద్దు చేస్తామన్నారు

అధికారంలోకి వచ్చాక అన్నీ ప్రైవేటుపరం అంటున్నారు 

చంద్రబాబు, లోకేశ్‌ నమ్మించి గొంతుకోశారు.. నీట్‌ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రుల ఆగ్రహం 

మా కలలను ప్రభుత్వం చిదిమేసింది. మా ఆశలను అడియాశలు చేసింది. గత ఏడాది కటాఫ్‌ కన్నా ఎక్కువగా మార్కులు వచ్చాయన్న ఆనందాన్ని ఆవిరి చేసింది. రిజర్వేషన్‌ కోటాలో అయినా సీటు వస్తుందని ఎదురు చూసినా నిరాశనే మిగిల్చింది. మా భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మాకు పెనుశాపంగా మారింది. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలలు, ఎంబీబీఎస్‌ సీట్లు పెంచుకుంటూ వెళుతుంటే... ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే మంజూరు చేసిన కళాశాలలు, ఎంబీబీఎస్‌ సీట్లను సైతం వద్దని ప్రభుత్వమే అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి... అని పలువురు నీట్‌ ర్యాంకర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోయి తమ పిల్లల భవిష్యత్‌ తలకిందులైందని పలువురు తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు రద్దు చేస్తామని చంద్రబాబు, లోకేశ్‌ హామీ ఇస్తే నమ్మామని... అధికారంలోకి వచ్చాక ఆ జీవోలు రద్దు చేయకపోగా... ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ... అంటూ అసలు రూపం బయటపెట్టారు. నమ్మించిగొంతు కోశారు... అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.   – సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌ 

భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది 
గత ఏడాది రెండు మార్కుల తేడాతో కన్వినర్‌ కోటా ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ కోల్పోయాను. మేనేజ్‌మెంట్‌ కోటాలో చదవాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో ఏడాదిపాటు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నాను. కష్టపడి చదివి నీట్‌ యూజీ–2024లో 610 స్కోర్‌ చేశా. ఈ ర్యాంక్‌కు గత ఏడాది గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఓసీకి చివరి సీట్‌ వచ్చింది. గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. 

ఈసారి కూడా మరో 750 సీట్లు పెరుగుతాయన్నారు. వాటికితోడు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్‌ విధానం రద్దు చేస్తామని టీడీపీ చెప్పింది. ఇలా కూడా మరికొన్ని సీట్లు కలిసి వస్తాయని అనుకున్నా. మంచి స్కోర్‌ చేశాను. సీట్లు కూడా పెరిగితే తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్‌ వచ్చేస్తుందని కుటుంబం అంతా ఆశపెట్టుకున్నాం. 

కౌన్సెలింగ్‌ మొదలయ్యే నాటికి కొత్త కళాశాలలు ప్రారంభం కాలేదు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ విధానం రద్దు చేయలేదు. దీంతో సీట్లు పెరగలేదు. ఏయూ రీజియన్‌లో ఓసీ విభాగంలో 615 స్కోర్‌కు ఆఖరి సీట్‌ దక్కింది. రెండు, మూడు కౌన్సెలింగ్‌లలో సీట్‌ వస్తుందన్న నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో నా భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.  – యశ్వంత్‌రెడ్డి, నీట్‌ ర్యాంకర్, విశాఖపట్నం 

కొత్త కాలేజీలో సీటు వస్తుందని ఆశపడ్డా 
బీసీ–డీ సామాజికవర్గానికి చెందిన నేను నీట్‌లో 541 మార్కులు తెచ్చుకున్నాను. కొత్త మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు కావడంతో ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని ఆశపడ్డాను. కొత్త కళాశాలలు అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి పేద విద్యార్థులకు అవకాశం లభించేది. 

పులివెందుల మెడికల్‌ కళాశాలకు 50 సీట్లు మంజూరు కాగా, రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం వల్ల మాలాంటి బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక డబ్బులు కట్టి పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడం కష్టమే.  – దేవేశ్, నీట్‌ విద్యార్థి, రాజంపేట, అన్నమయ్య జిల్లా 

లాంగ్‌ టర్మ్‌ శిక్షణ తీసుకున్నా..   
నేను మూడేళ్లగా నీట్‌ కోసం లాంగ్‌టర్మ్‌ శిక్షణ  తీసుకుంటున్నా. ఈ ఏడాది నీట్‌లో 500 మార్కులు సాధించాను. ఈ ఏడాది కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో బీసీ–ఈ కోటాలో ఎలాగైనా ఎంబీబీఎస్‌ సీటు వస్తుందనే ఆశతో ఉన్నా. 

కానీ కొత్త మెడికల్‌ కాలేజీలు రాకపోవటం, పులివెందులకు కేటాయించిన సీట్లను ప్రభుత్వం వద్దనడంతో ఈ ఏడాది కూడా సీటు వస్తోందో.. రాదో అని భయంగా ఉంది. మా తల్లిదండ్రులు పేదలు అయినా నన్ను డాక్టర్‌గా చూడాలని లాంగ్‌టర్మ్‌లో చేర్పించారు. ఇప్పుడు సీటు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం.    – షేక్‌ తజి్మన్, దువ్వూరు, వైఎస్సార్‌ జిల్లా 

రిజర్వేషన్‌ ఉన్నా మా అబ్బాయికి సీటు రాలేదు 
గత ఏడాది బీసీ–డీలో 497 స్కోర్‌ వరకు కన్వినర్‌ కోటాలో సీటు వచ్చింది. ఈసారి మా అబ్బాయి 541 స్కోర్‌ చేశాడు. 83 మార్కుల మేర స్కోర్‌ పెరిగింది. ఈ క్రమంలో తొలి రౌండ్‌లో కన్వినర్‌ కోటా సీటు వస్తుందని ఆశపడ్డాం. కానీ, తొలి రౌండ్‌లో ఎస్‌వీయూ రీజియన్‌లో బీసీ–డీలో 560 వరకు సీటు వచ్చింది. మా అబ్బాయికి సీటు రాలేదు. గత ఏడాది నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 519 స్కోర్‌కు సీట్‌ వచ్చింది. 

ఆ ఏడాది పోటీకి తగ్గట్టుగా ప్రభుత్వ కళాశాలలు పెరిగి సీట్లు పెరగడంతో 519 ర్యాంక్‌కు ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా వద్దని లేఖ రాశారు. సీట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడి మాలాంటి వాళ్లకు ద్రోహం తలపెట్టింది. 

వేరే దేశానికి వెళ్లి అక్కడ ప్రైవేట్‌ కంపెనీల్లో పని చేసి వచ్చిన జీతంలో తిని తినక దాచిపెట్టి నా కొడుక్కు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇప్పించా. మంచి స్కోరు, రిజర్వేషన్‌ ఉన్నా ప్రభుత్వ కోటాలో సీటు రాలేదు. ఇక మాలాంటి వాళ్లు ఎంబీబీఎస్‌ వంటి ఉన్నత చదువులు ఎలా చదువుతారు. – పెంచలయ్య, నీట్‌ ర్యాంకర్‌ తండ్రి, అన్నమయ్య జిల్లా 

నా కల చెదిరింది 
వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనుకునే నా కల చెదిరింది. కటాఫ్‌ పెంచి నా భవితను చిదిమేశారు. ఓసీ వర్గానికి చెందిన నేను 540 మార్కులు సాధించినా సీటు రాలేదు. గత ప్రభుత్వంలో వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాధాన్యత కొరవడటంతో నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం వైద్య విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. – గరికిన సత్య సంతోష్, గొడారిగుంట,కాకినాడ 

ఇక మెడిసిన్‌ కలగానే... 
విజయవాడలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో సంవత్సరం నుంచి నీట్‌ శిక్షణ తీసుకుంటున్నా. ఇంటర్‌లో గురుకుల పాఠశాలలో చదువుకున్నా. గత ఏడాది మొదటి సారి నీట్‌ రాస్తే 388 మార్కులు వచ్చాయి. ఈ సారైనా మెడికల్‌ సీటు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివా. 720 మార్కులకు 524 మార్కులు వచ్చాయి. 

ప్రభుత్వం నూతనంగా ఐదు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఉంటే 750 సీట్లు అదనంగా వచ్చేవి. దీంతో నాకు సీటు వచ్చే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో నా లాంటి ఎంతో మంది పేద విద్యార్థుల డాక్టర్‌ కల కలగానే మిగిలిపోనుంది. బీసీ–బీ కురుబ అయినా నాకు సీటు రాలేదు.  – ముత్తుకూరు సరిత, సంతేకుడ్లూరు గ్రామం, ఆదోని మండలం 

తీవ్ర నిరాశకు గురయ్యా 
నాన్న డాక్టర్‌ బి.సురేష్, రేడియాలజిస్టు. అమ్మ డాక్టర్‌ ఉమాదేవి గైనకాలజిస్టు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో నన్ను కూడా డాక్టర్‌ను చేయాలని వారు ఎంతో ఆశగా చదివించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా నేను కూడా ఎంతో కష్టపడి చదువుతున్నాను. మాది బీసీ–బీ కేటగిరీ. నీట్‌లో 527 మార్కులు తెచ్చుకున్నా సీటు రాలేదు. 

కటాఫ్‌ 556 దగ్గర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. మన రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఉంటే నాకు సీటు వచ్చి ఉండేదని లెక్చరర్లు చెబుతున్నారు. నాకు సీటు రాకపోవడంతో మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడ్డారు.   – బి.ప్రణవ్, కర్నూలు 

సీట్లు పెరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు 
మాది వ్యవసాయ కుటుంబం. మాది బీసీ–ఏ కేటగిరీ. నన్ను ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని మా అమ్మ వరలక్ష్మి , నాన్న వెంకటేశ్వర్లు చాలా కష్టపడి చదివిస్తున్నారు. నేను కూడా కష్టపడి చదివి మా అమ్మానాన్నల కలలను సాకారం చేయాలని ప్రయతి్నస్తున్నాను. నీట్‌లో 528 మార్కులు సాధించినా సీటు రాలేదు. కటాఫ్‌ 561 వద్దే ఆగిపోయింది. 

రాష్ట్రంలో మెడికల్‌ సీట్లు పెరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. గత సంవత్సరం ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా మరికొన్ని కాలేజీలు వస్తాయని, మరో 500 నుంచి 700 వరకు సీట్లు పెరుగుతాయని భావించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాలాంటి విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగిలింది.             – బి.జాహ్నవి, కర్నూలు  

597 మార్కులు వచ్చినా సీటు రాలేదు 
ఎంబీబీఎస్‌లో కన్వినర్‌ కోటా కింద మొదటి కౌన్సిలింగ్‌లో సీట్లు కేటాయింపు పూర్తయింది. నాకు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు. పులివెందులలో మెడికల్‌ కళాశాల ఉండి ఉంటే ఈజీగా నాకు సీటు వచ్చి ఉండేది. నాకు సీటు రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. నీట్‌ రాసి 597 మార్కులు సాధించినప్పటికీ సీటు రాకపోవడం కలచివేస్తోంది. ప్రభుత్వ తీరు వల్లే నాకు అన్యాయం జరిగింది.  – సాయి విఘ్నేశ్వరరెడ్డి, పులివెందుల, వైఎస్సార్‌ జిల్లా 

సీట్లు వదులుకోవడం సరికాదు 
బీసీ–ఈ కేటగిరీకి చెందిన నేను నీట్‌లో 545 మార్కులు సాధించాను. అయినా సీటు రాలేదు. బీసీ–ఈ కటాఫ్‌ 553 వద్ద ఆగిపోయింది. గత సంవత్సరం బీసీ–ఈ కేటగిరీ కటాఫ్‌ 496 మార్కులు. అందువల్ల ఈ ఏడాది నాకు 545 మార్కులు రావడంతో తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశపడ్డాను. దీనికి తోడు రాష్ట్రంలో మెడికల్‌ సీట్లు పెరుగుతాయన్న ఆశ కూడా ఉండేది. కానీ మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది.

 సీట్లు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను కొనసాగించలేదు. ఎన్‌ఎంసీ ఇచ్చిన సీట్లు కూడా వదులుకుంది. ఫలితంగా మాలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. విలువైన మెడికల్‌ సీట్లు వదులుకోవడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్‌సీట్లు సాధించాలి. – హెచ్‌ఎం ఫర్హా అన్జుమ్, కర్నూలు 

570 వచ్చినా సీటు లేదు...  
నాకు నీట్‌ యూజీలో 570 మార్కులు వచ్చాయి. నేను ఓసీ కేటగిరీ. గత ఏడాది మా రీజియన్‌లో ఓసీ కేటగిరీ కటాఫ్‌ 542 వద్ద ఆగిపోయింది. ఓసీ కేటగిరీలో పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుసు. అందుకే మొదటి నుంచి ఎంతో కష్టపడి చదువుతున్నాను. నీట్‌లో 570 మార్కులు సాధించినా ఫలితం లేకపోయింది. 

కటాఫ్‌ 601 వద్దే ఆగిపోయింది. గత సంవత్సరం కటాఫ్‌ 542 వద్ద ఆగిపోవడంతో ఈ సంవత్సరం నాకు వచ్చిన మార్కులకు తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, ఎన్‌ఎంసీ ద్వారా సీట్లు సాధించి ఉంటే మాలాంటి వారికి తప్పకుండా సీట్లు వచ్చేవి. ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఏడాది మాలాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.   – వి.సాయిసృజన, కర్నూలు 

ఆంధ్రాలో పుట్టడమే నేరమా?  
నా కుమార్తెకు బీసీ–ఏ కేటగిరీలో 565 మార్కులు వచ్చినా మెడికల్‌ సీటు రాలేదు. పేదవాళ్లం అయినప్పటికీ మా కుమార్తెను డాక్టర్‌గా చూడాలని సుమారు రూ.4లక్షలు ఖర్చు చేసి లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇప్పించాం. ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని ఆశపడ్డాం. చివరకు కన్నీరే మిగిలింది. గత ఏడాది 501 మార్కులకు ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. 

కానీ, ఈ ఏడాది 565 మార్కులు వచ్చినా నా బిడ్డకు సీటు రాలేదు. మాలాంటి వాళ్లని ఎంతోమందిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కొత్త కాలేజీలు వస్తే మాలాంటి వారి జీవితాలు బాగుపడతాయని ఎదురు చూశాం. తీరా ఇప్పుడు సీట్లు తగ్గించారు. ఆంధ్రాలో పుట్టడమే నేరమా.. అన్నట్లు ఉంది.   – కె.నవీన్, విద్యార్థిని తండ్రి, టెక్కలి

పేద పిల్లలకు శరాఘాతం 
ప్రభుత్వం కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడంతో సీట్లు తగ్గాయి. నా లాంటి విద్యార్థులకు నష్టం కలిగింది. ఎంబీబీఎస్‌ పూర్తిచేయాలన్న ఆశతో కష్టపడి చదివాను. సీటు వచ్చే అవకాశం లేదు. మళ్లీ లాంగ్‌­టెర్మ్‌ కోచింగ్‌లో చేరాను. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభు­త్వ నిర్ణయం శరాఘాతం వంటిది. మెడికల్‌ కాలేజీలకు ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు శాపం.   – కె.మానస, కిండం అగ్రహారం గ్రామం, బొండపల్లి మండలం 

మా భవిత ప్రశ్నార్థకం 
నేను బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని. కటాఫ్‌ మార్కులు పెరగడంతో నీట్‌ సీటు చేజారింది. మాది పేద కుటుంబం. డాక్టర్‌ కావాలన్నది నా ఆశయం. వైద్య కళాశాలలు పెరగడంతో కచ్చితంగా సీటు వస్తుందని భావించాను. ఎంతో ఉన్నత భవిష్యత్‌ ఉంటుందని ఊహించాను. అయితే ప్రభుత్వం కొత్త కాలేజీలు తీసుకురాక­పోవడంతో మా ఆశలన్నీ అ­డియాశలయ్యాయి. ప్రభుత్వమే ఇలా చేయడమే సరికాదు.  – ఎండీ ఖాసీం, జె.రామారావుపేట, కాకినాడ

ప్రభుత్వం వల్ల ఎంతో నష్టం 
నాకు నీట్‌లో 568 మార్కులు వచ్చాయి. గతేడాది ఎస్వీయూ రీజియన్‌లో ఓసీ కేటగిరీకి  542 మార్కులకు కూడా సీటొ
చ్చింది. ఈ ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని.. 550కి ఓసీ కేటగిరిలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్వీయూ రీజియన్‌ పరిధిలో పులివెందుల మెడికల్‌ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా. ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్‌కు వెళదామన్నా.. వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదు.   – లతిక, నీట్‌ విద్యార్థి, ఎస్వీయూ రీజియన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement