reservation quota
-
మా కలలు చిదిమేసిన ప్రభుత్వం
మా కలలను ప్రభుత్వం చిదిమేసింది. మా ఆశలను అడియాశలు చేసింది. గత ఏడాది కటాఫ్ కన్నా ఎక్కువగా మార్కులు వచ్చాయన్న ఆనందాన్ని ఆవిరి చేసింది. రిజర్వేషన్ కోటాలో అయినా సీటు వస్తుందని ఎదురు చూసినా నిరాశనే మిగిల్చింది. మా భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మాకు పెనుశాపంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు పెంచుకుంటూ వెళుతుంటే... ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే మంజూరు చేసిన కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లను సైతం వద్దని ప్రభుత్వమే అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి... అని పలువురు నీట్ ర్యాంకర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయి తమ పిల్లల భవిష్యత్ తలకిందులైందని పలువురు తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చంద్రబాబు, లోకేశ్ హామీ ఇస్తే నమ్మామని... అధికారంలోకి వచ్చాక ఆ జీవోలు రద్దు చేయకపోగా... ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ... అంటూ అసలు రూపం బయటపెట్టారు. నమ్మించిగొంతు కోశారు... అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది గత ఏడాది రెండు మార్కుల తేడాతో కన్వినర్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోల్పోయాను. మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కష్టపడి చదివి నీట్ యూజీ–2024లో 610 స్కోర్ చేశా. ఈ ర్యాంక్‌కు గత ఏడాది గుంటూరు మెడికల్ కాలేజీలో ఓసీకి చివరి సీట్ వచ్చింది. గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. ఈసారి కూడా మరో 750 సీట్లు పెరుగుతాయన్నారు. వాటికితోడు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని టీడీపీ చెప్పింది. ఇలా కూడా మరికొన్ని సీట్లు కలిసి వస్తాయని అనుకున్నా. మంచి స్కోర్ చేశాను. సీట్లు కూడా పెరిగితే తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ వచ్చేస్తుందని కుటుంబం అంతా ఆశపెట్టుకున్నాం. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి కొత్త కళాశాలలు ప్రారంభం కాలేదు. సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేయలేదు. దీంతో సీట్లు పెరగలేదు. ఏయూ రీజియన్‌లో ఓసీ విభాగంలో 615 స్కోర్‌కు ఆఖరి సీట్ దక్కింది. రెండు, మూడు కౌన్సెలింగ్‌లలో సీట్ వస్తుందన్న నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో నా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. – యశ్వంత్‌రెడ్డి, నీట్ ర్యాంకర్, విశాఖపట్నం కొత్త కాలేజీలో సీటు వస్తుందని ఆశపడ్డా బీసీ–డీ సామాజికవర్గానికి చెందిన నేను నీట్లో 541 మార్కులు తెచ్చుకున్నాను. కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావడంతో ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాను. కొత్త కళాశాలలు అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి పేద విద్యార్థులకు అవకాశం లభించేది. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరు కాగా, రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం వల్ల మాలాంటి బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక డబ్బులు కట్టి పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడం కష్టమే. – దేవేశ్, నీట్ విద్యార్థి, రాజంపేట, అన్నమయ్య జిల్లా లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్నా.. నేను మూడేళ్లగా నీట్ కోసం లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుంటున్నా. ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించాను. ఈ ఏడాది కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో బీసీ–ఈ కోటాలో ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు వస్తుందనే ఆశతో ఉన్నా. కానీ కొత్త మెడికల్ కాలేజీలు రాకపోవటం, పులివెందులకు కేటాయించిన సీట్లను ప్రభుత్వం వద్దనడంతో ఈ ఏడాది కూడా సీటు వస్తోందో.. రాదో అని భయంగా ఉంది. మా తల్లిదండ్రులు పేదలు అయినా నన్ను డాక్టర్‌గా చూడాలని లాంగ్‌టర్మ్‌లో చేర్పించారు. ఇప్పుడు సీటు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. – షేక్ తజి్మన్, దువ్వూరు, వైఎస్సార్ జిల్లా రిజర్వేషన్ ఉన్నా మా అబ్బాయికి సీటు రాలేదు గత ఏడాది బీసీ–డీలో 497 స్కోర్ వరకు కన్వినర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి మా అబ్బాయి 541 స్కోర్ చేశాడు. 83 మార్కుల మేర స్కోర్ పెరిగింది. ఈ క్రమంలో తొలి రౌండ్లో కన్వినర్ కోటా సీటు వస్తుందని ఆశపడ్డాం. కానీ, తొలి రౌండ్లో ఎస్వీయూ రీజియన్‌లో బీసీ–డీలో 560 వరకు సీటు వచ్చింది. మా అబ్బాయికి సీటు రాలేదు. గత ఏడాది నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 519 స్కోర్‌కు సీట్ వచ్చింది. ఆ ఏడాది పోటీకి తగ్గట్టుగా ప్రభుత్వ కళాశాలలు పెరిగి సీట్లు పెరగడంతో 519 ర్యాంక్‌కు ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా వద్దని లేఖ రాశారు. సీట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడి మాలాంటి వాళ్లకు ద్రోహం తలపెట్టింది. వేరే దేశానికి వెళ్లి అక్కడ ప్రైవేట్ కంపెనీల్లో పని చేసి వచ్చిన జీతంలో తిని తినక దాచిపెట్టి నా కొడుక్కు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించా. మంచి స్కోరు, రిజర్వేషన్ ఉన్నా ప్రభుత్వ కోటాలో సీటు రాలేదు. ఇక మాలాంటి వాళ్లు ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు ఎలా చదువుతారు. – పెంచలయ్య, నీట్ ర్యాంకర్ తండ్రి, అన్నమయ్య జిల్లా నా కల చెదిరింది వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనుకునే నా కల చెదిరింది. కటాఫ్ పెంచి నా భవితను చిదిమేశారు. ఓసీ వర్గానికి చెందిన నేను 540 మార్కులు సాధించినా సీటు రాలేదు. గత ప్రభుత్వంలో వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాధాన్యత కొరవడటంతో నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం వైద్య విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. – గరికిన సత్య సంతోష్, గొడారిగుంట,కాకినాడ ఇక మెడిసిన్ కలగానే... విజయవాడలోని ఓ కోచింగ్ సెంటర్లో సంవత్సరం నుంచి నీట్ శిక్షణ తీసుకుంటున్నా. ఇంటర్లో గురుకుల పాఠశాలలో చదువుకున్నా. గత ఏడాది మొదటి సారి నీట్ రాస్తే 388 మార్కులు వచ్చాయి. ఈ సారైనా మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివా. 720 మార్కులకు 524 మార్కులు వచ్చాయి. ప్రభుత్వం నూతనంగా ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఉంటే 750 సీట్లు అదనంగా వచ్చేవి. దీంతో నాకు సీటు వచ్చే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో నా లాంటి ఎంతో మంది పేద విద్యార్థుల డాక్టర్ కల కలగానే మిగిలిపోనుంది. బీసీ–బీ కురుబ అయినా నాకు సీటు రాలేదు. – ముత్తుకూరు సరిత, సంతేకుడ్లూరు గ్రామం, ఆదోని మండలం తీవ్ర నిరాశకు గురయ్యా నాన్న డాక్టర్ బి.సురేష్, రేడియాలజిస్టు. అమ్మ డాక్టర్ ఉమాదేవి గైనకాలజిస్టు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో నన్ను కూడా డాక్టర్‌ను చేయాలని వారు ఎంతో ఆశగా చదివించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా నేను కూడా ఎంతో కష్టపడి చదువుతున్నాను. మాది బీసీ–బీ కేటగిరీ. నీట్లో 527 మార్కులు తెచ్చుకున్నా సీటు రాలేదు. కటాఫ్ 556 దగ్గర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. మన రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఉంటే నాకు సీటు వచ్చి ఉండేదని లెక్చరర్లు చెబుతున్నారు. నాకు సీటు రాకపోవడంతో మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడ్డారు. – బి.ప్రణవ్, కర్నూలు సీట్లు పెరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు మాది వ్యవసాయ కుటుంబం. మాది బీసీ–ఏ కేటగిరీ. నన్ను ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని మా అమ్మ వరలక్ష్మి , నాన్న వెంకటేశ్వర్లు చాలా కష్టపడి చదివిస్తున్నారు. నేను కూడా కష్టపడి చదివి మా అమ్మానాన్నల కలలను సాకారం చేయాలని ప్రయతి్నస్తున్నాను. నీట్లో 528 మార్కులు సాధించినా సీటు రాలేదు. కటాఫ్ 561 వద్దే ఆగిపోయింది. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. గత సంవత్సరం ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా మరికొన్ని కాలేజీలు వస్తాయని, మరో 500 నుంచి 700 వరకు సీట్లు పెరుగుతాయని భావించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాలాంటి విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగిలింది. – బి.జాహ్నవి, కర్నూలు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు ఎంబీబీఎస్‌లో కన్వినర్ కోటా కింద మొదటి కౌన్సిలింగ్లో సీట్లు కేటాయింపు పూర్తయింది. నాకు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు. పులివెందులలో మెడికల్ కళాశాల ఉండి ఉంటే ఈజీగా నాకు సీటు వచ్చి ఉండేది. నాకు సీటు రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. నీట్ రాసి 597 మార్కులు సాధించినప్పటికీ సీటు రాకపోవడం కలచివేస్తోంది. ప్రభుత్వ తీరు వల్లే నాకు అన్యాయం జరిగింది. – సాయి విఘ్నేశ్వరరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా సీట్లు వదులుకోవడం సరికాదు బీసీ–ఈ కేటగిరీకి చెందిన నేను నీట్లో 545 మార్కులు సాధించాను. అయినా సీటు రాలేదు. బీసీ–ఈ కటాఫ్ 553 వద్ద ఆగిపోయింది. గత సంవత్సరం బీసీ–ఈ కేటగిరీ కటాఫ్ 496 మార్కులు. అందువల్ల ఈ ఏడాది నాకు 545 మార్కులు రావడంతో తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశపడ్డాను. దీనికి తోడు రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరుగుతాయన్న ఆశ కూడా ఉండేది. కానీ మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. సీట్లు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను కొనసాగించలేదు. ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లు కూడా వదులుకుంది. ఫలితంగా మాలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. విలువైన మెడికల్ సీట్లు వదులుకోవడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్‌సీట్లు సాధించాలి. – హెచ్ఎం ఫర్హా అన్జుమ్, కర్నూలు 570 వచ్చినా సీటు లేదు... నాకు నీట్ యూజీలో 570 మార్కులు వచ్చాయి. నేను ఓసీ కేటగిరీ. గత ఏడాది మా రీజియన్‌లో ఓసీ కేటగిరీ కటాఫ్ 542 వద్ద ఆగిపోయింది. ఓసీ కేటగిరీలో పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుసు. అందుకే మొదటి నుంచి ఎంతో కష్టపడి చదువుతున్నాను. నీట్లో 570 మార్కులు సాధించినా ఫలితం లేకపోయింది. కటాఫ్ 601 వద్దే ఆగిపోయింది. గత సంవత్సరం కటాఫ్ 542 వద్ద ఆగిపోవడంతో ఈ సంవత్సరం నాకు వచ్చిన మార్కులకు తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, ఎన్ఎంసీ ద్వారా సీట్లు సాధించి ఉంటే మాలాంటి వారికి తప్పకుండా సీట్లు వచ్చేవి. ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఏడాది మాలాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. – వి.సాయిసృజన, కర్నూలు ఆంధ్రాలో పుట్టడమే నేరమా? నా కుమార్తెకు బీసీ–ఏ కేటగిరీలో 565 మార్కులు వచ్చినా మెడికల్ సీటు రాలేదు. పేదవాళ్లం అయినప్పటికీ మా కుమార్తెను డాక్టర్‌గా చూడాలని సుమారు రూ.4లక్షలు ఖర్చు చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించాం. ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాం. చివరకు కన్నీరే మిగిలింది. గత ఏడాది 501 మార్కులకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ, ఈ ఏడాది 565 మార్కులు వచ్చినా నా బిడ్డకు సీటు రాలేదు. మాలాంటి వాళ్లని ఎంతోమందిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కొత్త కాలేజీలు వస్తే మాలాంటి వారి జీవితాలు బాగుపడతాయని ఎదురు చూశాం. తీరా ఇప్పుడు సీట్లు తగ్గించారు. ఆంధ్రాలో పుట్టడమే నేరమా.. అన్నట్లు ఉంది. – కె.నవీన్, విద్యార్థిని తండ్రి, టెక్కలిపేద పిల్లలకు శరాఘాతం ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడంతో సీట్లు తగ్గాయి. నా లాంటి విద్యార్థులకు నష్టం కలిగింది. ఎంబీబీఎస్ పూర్తిచేయాలన్న ఆశతో కష్టపడి చదివాను. సీటు వచ్చే అవకాశం లేదు. మళ్లీ లాంగ్‌టెర్మ్ కోచింగ్‌లో చేరాను. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం వంటిది. మెడికల్ కాలేజీలకు ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు శాపం. – కె.మానస, కిండం అగ్రహారం గ్రామం, బొండపల్లి మండలం మా భవిత ప్రశ్నార్థకం నేను బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని. కటాఫ్ మార్కులు పెరగడంతో నీట్ సీటు చేజారింది. మాది పేద కుటుంబం. డాక్టర్ కావాలన్నది నా ఆశయం. వైద్య కళాశాలలు పెరగడంతో కచ్చితంగా సీటు వస్తుందని భావించాను. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని ఊహించాను. అయితే ప్రభుత్వం కొత్త కాలేజీలు తీసుకురాకపోవడంతో మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రభుత్వమే ఇలా చేయడమే సరికాదు. – ఎండీ ఖాసీం, జె.రామారావుపేట, కాకినాడప్రభుత్వం వల్ల ఎంతో నష్టం నాకు నీట్లో 568 మార్కులు వచ్చాయి. గతేడాది ఎస్వీయూ రీజియన్‌లో ఓసీ కేటగిరీకి 542 మార్కులకు కూడా సీటొచ్చింది. ఈ ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని.. 550కి ఓసీ కేటగిరిలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా. ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్‌కు వెళదామన్నా.. వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదు. – లతిక, నీట్ విద్యార్థి, ఎస్వీయూ రీజియన్ -
బంగ్లాదేశ్‌లో ఆందోళనలు: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల మధ్య జరిగిన హింసలో ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు తమ తమ క్లాసులకు తిరిగి హాజరుకావాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులు రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఆదివారం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఈ మేరకు విద్యార్థులంతా వెంటనే ఆందోళనలు ముగించి తిరిగి తమ తరగతులకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 13 వ తేదీన మొదలైన రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా హింసాత్మంకంగా మారాయి. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్పై నిషేధం విధించింది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆదివారం, సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించింది.మరోవైపు.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కఠిన చర్యలు మొదలు పెట్టింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం తాజాగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది.1000 మందిదాకా పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుదాటి భారత్‌లో ప్రవేశించినట్లు సమాచారం. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని షేక్‌హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. -
బంగ్లాదేశ్‌లో చల్లారని ఉద్రిక్తతలు
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రంగానే కొనసాగుతున్నాయి. పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు బాహాబాహీ తలపడుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని పేర్కొంది. అయితే, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై యంత్రాంగం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రాజధాని ఢాకా పరిధిలోని నర్సింగ్డి జిల్లాలో ఉన్న జైలుకు శుక్రవారం రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ముందుగా వారు జైలుపై దాడి చేసి, అందులోని వారందరినీ విడిచిపెట్టారు. ‘ఖైదీలంతా పరారయ్యాక ఆందోళనకారులు జైలు భవనానికి నిప్పుపెట్టారు. వెళ్లిపోయిన ఖైదీలు ఎంతమంది అనేది తెలియదు. కానీ, వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది’ అని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది. శుక్రవారం ఢాకాలోని ప్రభుత్వ టీవీ కార్యాలయాన్ని సుమారు 1,000 మంది ఆందోళనకారులు ముట్టడించినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది. వీరిని చెదరగొట్టేందుకు సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. వీధుల్లో పెద్ద సంఖ్యలో బుల్లెట్లతోపాటు రక్తం మరకలు కనిపించాయని తెలిపింది. ఆందోళనకారులు గురువారం టీవీ కార్యాలయంలో కొంతభాగాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు.దేశవ్యాప్త కర్ఫ్యూ ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు శృతిమించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. శాంతిభద్రతలను కాపాడటానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. -
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
Supreme Court Of India: బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుంది
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీలు, ఎస్టీల్లో ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అనే అంశంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేయరాదని తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు సజాతీయ సమూహాలు అయినందున వీరిలో వెనుకబడిన, బలహీన కులాలకు కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. -
ఆ కోర్సుల్లో క్రీడా కోటా ఎందుకు తొలగించారు: హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్..లాంటి వైద్య విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్ ఎందుకు తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. కాగా, వైద్య, విద్యా కోర్సుల్లో క్రీడా కోటా కింద 0.3 శాతం రిజర్వేషన్‌ను తీసివేస్తూ ప్రభుత్వం.. జూలై 4న జీవో 75ను జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన జి.హరికృష్ణతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. క్రీడా కోటా రిజర్వేషన్ కింద 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది జైశ్వాల్ వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసిందని, ఆ నివేదిక ఇవ్వాలని సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ -
‘రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయాలి’
పట్నా: దేశంలో రిజర్వేషన్లపైనున్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటాను సమర్థించడంపై నితీశ్ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ అనుకూలమేనని ప్రకటించారు. ‘సుప్రీం కోర్టు తీర్పు చాలా న్యాయంగా ఉంది. రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ అనుకూలమే. అయితే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయడానికి ఇదే సరైన సమయం. ఈ పరిమితి వల్ల ఓబీసీ, ఈబీసీలకు వారి జనాభాకి అనుగుణంగా అవకాశాలు రావడం లేదు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా గణన చేపట్టాలని ఆయన పునరుద్ఘాటించారు. కుల గణన జాతీయ స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం
బనశంకరి: రిజర్వేషన్లను పెంచాలని వాల్మీకులు, ఎస్టీల్లో చేర్చాలని కురుబలు, తమనూ బీసీలుగా గుర్తించాలని అగ్రవర్ణ వీరశైవ, లింగాయత్‌ల ఆందోళనలు కర్ణాటకలో ఊపందుకున్నాయి. నెలరోజుల నుంచి ఎవరికి వారు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ యెడియూరప్ప సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆఖరికి మంత్రులు సైతం తమ వర్గాల సమావేశాల్లో పాల్గొంటూ గళమెత్తడంతో సీఎం యెడియూరప్పకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గుణపాఠం తప్పదన్న పంచమసాలిలు .. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆదివారం లింగాయత పంచమసాలి వర్గీయులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వర్గీయులు అధికంగా ఉండే కలబురిగి, విజయపుర, బాగల్‌కోటే, యాదగిరి, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, హావేరి, ధారవాడ, బెళగావిల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బీసీల్లో 3బీ గా ఉన్న తమను తక్షణం 2ఏ కు మార్చి రిజర్వేషన్ వసతులను పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూడల సంగమ పంచమసాలి పీఠాధిపతి శ్రీ బసవజయ మృత్యుంజయ స్వామీజీ మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తమ వర్గం స్వామీజీల నేతృత్వంలో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు రిజర్వేషన్ ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. సమావేశంలో మంత్రులు మురుగేశ్ నిరాణి, సీసీపాటిల్, అన్ని పార్టీల నుంచి 20 మందికిపైగా ఎమ్మెల్యేలు, స్వామీజీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు ? వరుస ఆందోళనల నేపథ్యంలో సీఎం యెడియూరప్ప అన్ని వర్గాలను బుజ్జగించేలా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రిమండలిలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని మంత్రులకు స్పష్టంచేశారు. -
ఎస్సీ/ఎస్టీ క్రీమీలేయర్ అంశాన్ని సమీక్షించండి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లోని సంపన్న శ్రేణి(క్రీమీ లేయర్)కి రిజర్వేషన్ కోటాలో భాగం ఇవ్వకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సమీక్షించే భాధ్యతను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది. తీర్పు ఎస్సీ/ఎస్టీలకు వర్తించదని, ఈ తీర్పును సమీక్షించాలని, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేయగా సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్ కోటా దక్కరాదన్న సూత్రం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు వర్తించదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ‘ఇది ఉద్వేగాలతో కూడుకున్న అంశం. విస్తృత ధర్మాసనానికి నివేదించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సమతా ఆందోళన్ సమితి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని గట్టిగా వ్యతిరేకించారు. -
ప్రతి ఒక్కరికి రిజర్వేషన్!
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో పేదలకి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోన్న 10% కోటా పరిధిలోనికి దాదాపు భారతీయులందరూ వస్తారని ఓ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతీయులంతా తాజాగా ప్రకటించిన 10%రిజర్వేషన్ల కోటానో, లేదా ఇతర రిజర్వేషన్ల కోటా కిందో లబ్దిపొందుతారని అంచనా వేశారు. ఐటీ శాఖ,, లేదా నేషనల్ సాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం 95% మంది భారతీయ కుటుంబాలు కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన 8 లక్షల ఆదాయపరిమితి లోని వారే కావడం గమనార్హం. వార్షికాదాయం 8 లక్షలు ఎందరికుంది? వార్షికాదాయం 8 లక్షల రూపాయలంటే నెలసరి ఆదాయం 66 వేల పైన ఉండాలి. నేషనల్ శాంపిల్ సర్వే 2011–2012 తాజా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారి నెలసరి అత్యధిక ఆదాయం 2,625. పట్టణ ప్రాంతాల్లో అయితే నెలసరి ఆదాయం 6,015 లోపు వాళ్లే ఉన్నారు. 8 లక్షల రూపాయల ఆదాయం పైబడిన వారు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నారు. అలాగే 2016–17 గణాంకాల ప్రకారం 2.3 కోట్ల మంది మాత్రమే తమకు 4 లక్షల రూపాయలకన్నా అధికంగా వార్షికాదాయం ఉన్నట్టు ప్రకటించారు. ఇలా ప్రతి ఇంటిలో ఇద్దరు వ్యక్తులకు చెరి నాలుగు లక్షల లెక్కన ఆదాయం ఉన్నవారు ఉన్నారనుకుంటే, ఎనిమిది లక్షల వార్షికాదాయం దాటిన కుటుంబాలు దేశంలో కోటి మాత్రమే ఉన్నట్టు అవుతుంది. ఇది దాదాపు దేశంలోని 4 శాతానికి సమానం. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ఏడాదికి తలసరి ఆదాయం 1.25 లక్షలు అంటే ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 6.25 లక్షల రూపాయలు. అంటే ఎనిమిది లక్షల వార్షికాదాయం అనేది జాతీయ సగటుకన్నా ఎక్కువని స్పష్టమౌతోంది. ఐదెకరాల పరిమితిలోని వారు ఎందరు? ఇక భూ పరిమితి కూడా చాలా ఉదారంగా ఉన్నట్టు భావిస్తున్నారు. దేశంలోని 86.2 శాతం మంది 2 హెక్టార్ల లోపు భూమి ఉన్నవారే. అంటే ఐదెకరాల్లోపు వారేనని 2015–16 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి కూడా అత్యధికమంది ఈ కోటా పరిధిలోకి వస్తారని స్పష్టం అవుతోంది. అలాగే 1000 చదరపు అడుగుల కంటే తక్కువ వైశాల్యం కలిగిన సొంత ఇల్లు ఉన్నవారు ఎందరంటే నేషనల్ సాంపిల్ సర్వే 2012 ప్రకారం అత్యధికంగా 20 శాతం మంది భారతీయులకు మాత్రమే కేవలం 45.99 చదరపు మీటర్ల స్థలంలో ఇళ్ళున్నాయి. అంటే వీరంతా 500 చదరపు అడుగుల లోపునే ఇళ్ళుకట్టుకున్నారు. ఇది ప్రభుత్వం విధించిన పరిమితిలో సగం మాత్రమే. దీన్ని బట్టి కనీసం 80 శాతం నుంచి 90 శాతం మంది 1000 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు లేనివారే ఉంటారు. వీరంతా 10 శాతం కోటాకి అర్హులవుతారు. దీన్నిబట్టి ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న దళితులు, ఆదివాసీలు, బీసీలు మినహా మిగిలిన వారంతా ఈ 10 శాతం రిజర్వేషన్ల కోటా పరిధిలోనికి వస్తారు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మొత్తం ఎస్సీ, ఎస్టీలు 23 శాతం మంది ఉన్నారు. ఓబీసీలు 40–50 శాతం ఉన్నారు. మిగిలిన 27–37 శాతం మంది మాత్రమే ప్రస్తుతం ఏ కోటాలోనూ రిజర్వేషన్లు పొందని వారున్నారు. కొత్తగా పెట్టిన పదిశాతం కోటా వీరికి దక్కుతుంది. వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు హరియాణాలో 2016 లో జాట్లు సహా ఆరు సామాజిక వర్గాల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లుని బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. హైకోర్టు కోటా అమలుని నిలిపేసింది. గుజరాత్లో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. గుజరాత్లో ఇప్పటికే 49.5 శాతం రిజర్వేషన్లున్నాయి. దీంతో హైకోర్టు ఆర్డినెన్స్‌ని కొట్టివేసింది. మహారాష్ట్రలో 2018 నవంబర్‌లో మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో మహారాష్ట్రలో రిజర్వేషన్లు 68 శాతానికి పెరిగాయి. -
వారంలోగా మహిళల కోటా స్థానాలు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మహిళలకు 33శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్కెటింగ్ చట్టానికి సవరణలు ప్రతిపాది స్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందిం ది. తాజా సవరణ మేరకు రాష్ట్రంలోని 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 55 మార్కెట్లకు చైర్పర్సన్ స్థానాలు దక్కనున్నాయి. అయితే కేటగిరీల వారీగా మహిళలకు దక్కే మార్కెట్ కమిటీలను గుర్తించడంపై మార్కెటింగ్‌శాఖ దృష్టి సారించింది. గతంలో కేటగిరీల వారీగా కేటాయించిన కోటా నుం చే.. మహిళలకు దక్కే స్థానాలను గుర్తించాలని మార్కెటింగ్‌శాఖ ప్రాథమికంగా నిర్ణయించిం ది. నామినేటెడ్ పదవుల భర్తీని ప్రభుత్వం నెలాఖరులో చేపడుతుందనే వార్తల నేపథ్యం లో.. వీలైనంత త్వరగా మార్కెట్ కమిటీల్లో మహిళా కోటా స్థానాలను గుర్తించనున్నారు. నిజానికి గడాది సెప్టెంబర్‌లోనే కేటగిరీల వారీగా రిజర్వేషన్ కోటా ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కే మార్కెట్ కమిటీలను రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా లాటరీ ద్వారా ఎంపిక చేశారు. తొలి ఏడాది లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయగా.. తర్వాతి ఏడాది నుంచి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే కమిటీల పదవీకాల పరిమితి ఏడాది కాగా.. ఈ కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌తో 14 మంది సభ్యులు వుంటారు. లాటరీ విధానంలో రిజర్వేషన్లు కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని.. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి చైర్మన్‌గా, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి సూర్యప్రభ సభ్యులుగా వున్న కమిటీలాటరీ విధానంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీల కుగాను..పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 మార్కెట్ కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు - 6 శాతం, ఎస్సీలకు - 15 శాతం, బీసీలకు- 29 శాతం చొప్పున మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కేటాయించారు. మిగతా 84 కమిటీలను అన్ రిజర్వుడు (ఓసీ)గా పరిగణిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. తాజా సవరణ నేపథ్యంలో షెడ్యూలు ఏరియాలోని మార్కెట్ కమిటీలను మినహాయిస్తే.. మిగతా 168 కమిటీల్లో 33శాతాన్ని మహిళలకు రిజ ర్వు చేయాల్సి వుంటుంది. ఈ లెక్కన మహిళలకు 55 స్థానాలు దక్కే అవకాశం వుందని మార్కెటింగ్‌శాఖ వర్గాలు వెల్లడించాయి. వారంలోగా మహిళలకు రిజర్వు చేసిన కమిటీల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేస్తామని మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ శరత్ వెల్లడించారు. -
‘కోటా’కు సరికొత్త పోటు
విశ్లేషణ బొజ్జా తారకం మనిషి విలువను కులాన్నిబట్టి చూస్తున్న ఈ దేశంలో కులానికి ఆర్థిక పరిస్థితితో ఉన్న సంబంధాన్ని చూడని ఈ దేశంలో, ఆర్థిక స్థోమతను బట్టి రిజర్వేషన్లు కల్పించాలనటం రిజర్వేషన్ల సూత్రాన్ని దెబ్బకొట్టటమే. రిజర్వేషన్ల అవసరం రాని పరిస్థితిని కల్పించాల్సిన ఆవశ్యకతను విస్మరించి, ఆర్థిక పరిస్థితినిబట్టి రిజర్వేషన్లు కల్పించాలనడం అర్థరహితం. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచీ రిజర్వేషన్ల సమస్యపై మాటిమాటికీ వివాదం రేగుతూనే ఉంది. రేగటం కాదు, రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్ర కులాలు వివాదం రేపుతూ వస్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదని, ప్రతిభావంతులకు అవకాశాలు లభ్యం కావటం లేదని, రిజర్వేషన్లను వెంటనే రద్దు చేస్తే తప్ప దేశానికి మోక్షం లేదని, ప్రపంచ దేశాలలో భారతదేశం వెనకబడిపోవటానికి రిజర్వేషన్లే ప్రధాన కారణమనే పాత పాట మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంది. మళ్లీ ఈ పాత పాటను అందుకున్నది మరెవరో కారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత సన్నిహితుడైన జనార్దన్ ద్వివేది. ఈ ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇదే పాట పాడుతుంటారు. కాకపోతే కొందరు బయటకు, మరికొందరు లోలోపలే. అయితే అందరికీ ఒకటే భయం. గట్టిగా ఈ పాట పాడితే ఓట్లు కోల్పోతామని! అగ్రకులాల ఓట్లు పడతాయిగానీ అవి చాలవు! అధికార పీఠం దక్కాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఓట్లు తప్పనిసరి. చిత్రమేమిటంటే, ఈ సారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అంతటి వాడే ఎన్నికల సందర్భమని సైతం మరచి మనసులోని మాటను అనుకోకుండా బయటపెట్టేశారు. కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని, వాటికి బదులుగా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని ప్రకటించారు. ఆయన నోట ఆ మాట వచ్చిందంటే, అది సోనియా గాంధీ మాటేనని, అందుకు రాహుల్ గాంధీ వత్తాసు ఉండే ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. ఖంగుతిన్న అధినేత్రి నష్ట నివారణకు చేయాల్సిన ప్రకటన చేశారు. అంతమాత్రాన ద్వివేది వంటి వారి మనస్సుల్లో ఉన్న మాట చెరిగిపోయేది కాదు. అంతరాలు ఆర్థికపరమైనవే కావు ద్వివేది చెప్పింది కొత్తగా ఇప్పుడు చెబుతున్న మాట కాదు. రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఈ దాడి మొదలైంది. రిజర్వేషన్ల సూత్రాన్ని, రాజ్యాంగంలో దానిని పొందుపరచవలసిన అవసరాన్ని విన్నవించినా సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాతిపదికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. రిజర్వేషన్లను కొట్టివేసింది. వెంటనే 1951లో రిజర్వేషన్ సూత్రానికి అనుగుణంగా రాజ్యాంగంలోని అధికరణకు సవరణను తీసుకొచ్చారు. అప్పటి నుంచి రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదని, అసలు ప్రయోజనం పొందవలసిన వారికి అవి అందటం లేదనే వాదనలు వినవస్తూనే ఉన్నాయి. ఏదో ఒక వంకతో రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవంటూ పదే పదే సుప్రీంకోర్టు తలుపులు కొడుతూనే ఉన్నారు. సుప్రీం కోర్టు వారి వాదనను అంగీకరించకుండానే, రిజర్వేషన్ల ప్రక్రియను మెల్ల మెల్లగా బలహీనపరుస్తూ వచ్చింది. కులానినీ రిజర్వేషన్లకు, కులానికీ పేదరికానికి, కులానికీ వెనుకబాటుతనానికి మధ్య ఉన్న సంబంధాలను రిజర్వేషన్ల వ్యతిరేక శక్తులు గ్రహించటం లేదు. ఈ దేశంలో వెనుకబాటుతనం, పేదరికం, అంటరానితనం, కులవివక్ష, కులపరమైన అత్యాచారాలకు కులమే ప్రధాన కారణమని అర్థం చేసుకోవడం లేదు. పేద వాళ్లంతా ఒకటే కాదని రిజర్వేషన్ల వ్యతిరేకులు గుర్తించటం లేదు. ‘‘కూటికి పేదవాడిని గాని కులానికి కాదు’’ అనే సామెత ఎందుకు వచ్చిందో, దాని అర్థం ఏమిటో గమనిస్తే కులానికి, పేదరికానికి మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. ఒక పేద బ్రాహ్మణుడికి ఈ దేశంలో దొరికే మర్యాద, గౌరవం, ఆదరణ, ఒక ధనవంతుడైన ఒక మాల లేదా మాదిగ వ్యక్తికి దొరకదనే విషయాన్ని విస్మరించినంత కాలం, ఈ దేశంలో కులానికి, పేదరికానికి మధ్య ఉన్న సంబంధం అర్థం కాదు. ‘‘కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్లు రద్దుచేసి, ఆర్థిక స్థోమత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవలసిన సమయం ఆసన్నమైంది’’ అనే జనార్దన్ ద్వివేదికి అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయో తెలియదు. ఏ రాజకీయ పరిజ్ఞానంతో, ఏ రాజకీయ క్రియాశీలతతో, త్యాగ ఫలంతో ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాగలిగాడు? అంతకన్నా సమర్థులు, పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న నాయకులు ఎంత మంది లేరు? బ్రాహ్మణుడు కాకపోతే ఆయనకు ఆ స్థానం దొరికేదా? ఆ పార్టీ అధికార ప్రతినిధి కాగలిగే వాడా? సోనియా, రాహుల్ గాంధీలకు అంత సన్నిహితుడు కాగలిగే వాడా? నిన్నటి వరకూ ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతాన్ని ఏలింది ఈ ద్వివేదులు, చతుర్వేదులు, త్రిపాఠీలే కాదా! ఎస్సీ, బీసీ కులాలు కలసి బ్రాహ్మణులను రాజకీయంగా ఓడించే వరకూ వారి ప్రాబల్యాన్ని ఎవరు ఆపగలిగారు? ప్రజల మధ్య వ్యత్యాసాలకు ఆర్థిక పరిస్థితి ఒకటే కారణమనుకుంటే ఆర్థిక పరిస్థితి ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏర్పరచవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదుగదా! రిజర్వేషన్ వల్ల ఆశించిన ప్రయోజనం అరవై ఏళ్లలో ఎంత వరకు నెరవేరింది? రిజర్వేషన్ పద్ధతి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో సముచితమైన ప్రాతినిధ్యం కల్పించటం రిజర్వేషన్ల ఉద్దేశం. ‘‘అవకాశాలు లభించిన వాళ్లకే అవకాశాలు దొరుకుతున్నాయి. అట్టడుగున ఉండిపోయిన వారు అక్కడే ఉండిపోతున్నారు’’ అనేది రిజర్వేషన్లపై అగ్రకులాలు లేవనెత్తే అభ్యంతరం. అది నిజమేనా? తెల్లోడి బాటలోనే ఉద్యోగ వివక్ష రిజర్వేషన్ వల్ల వారికి విద్య, ఉద్యోగరంగాలలో పూర్తి అవకాశాలు దొరుకుతున్నాయా? ఇప్పటికీ నాలుగో తరగతి ఉద్యోగాలలోనే ఎక్కువగా వారికి రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకటి, రెండు, మూడు తరగతి ఉద్యోగాలలో పావు వంతు రిజర్వేషన్ కోటా కూడా నిండటం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఇక రిజర్వేషన్ల అవసరం లేదని ఎలా అంటారు? రిజర్వేషన్లు అంటే నాలుగు, మూడు త రగతి ఉద్యోగాలను దులపరించడం కాదు. ఇద్దరికో ముగ్గురికో ఉన్నత విద్యావకాశాలను కల్పించటం కాదు. విద్యా ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యానికి నోచుకోని వర్గాలకు అవకాశం కల్పించటం, అభివృద్ధి చెందిన వర్గాలతో పోటీ పడి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే పరిస్థితిని కల్పించటం రిజర్వేషన్ల లక్ష్యం. అధికారంలో ఉన్న వర్గం నెరవేర్చవలసిన కర్తవ్యమది. అది చేయకుండా అక్కడక్కడా కొన్ని రిజర్వేషన్లు కల్పించి, వాటిని కూడా సరిగ్గా అమలు చేయకుండా, ‘‘ఇంకా ఎంత కాలం ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగించాలి?’’ అని ఈసడించుకోవటం చేస్తున్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన మొదట్లో బంట్రోతు వంటి ఉద్యోగాలు తప్ప మిగిలిన ఉద్యోగాలన్నీ ఆంగ్లేయులకే ఇచ్చేవారు. చదువుకున్న భారతీయులు ఉద్యోగావకాశాల కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. చాలా కాలం తర్వాత ఒకటీ, ఒకటీ భారతీయులకు ఇస్తుండేవారు. చాలా కాలం వరకూ ఐసీఎస్ మేజిస్ట్రేట్, జడ్జీ ఉద్యోగాలు భారతీయులకు ఇచ్చేవారు కాదు. భారతీయులకు న్యాయదృక్పథం ఉండదనే కుంటిసాకు చెప్పేవారు. ఎంతో పోరాటం తర్వాతనే ఆ ఉద్యోగాలు భారతీయులకు దక్కాయి. ఒకప్పుడు బ్రిటిష్ వారు భారతీయుల్ని ఎలా చూశారో, అలాగే భారతీయ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను చూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు ఈ మూడు వర్గాల వారికి ఇవ్వరు. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తి పదవులకు రిజర్వేషన్ వర్తింపజేయటం లేదు. ఎందుకంటే ఆ పదవుల్లో ఉండే అర్హత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లేదంటారు. ఇలాంటి వివక్ష చూపుతూ కూడా ఇంకా రిజర్వేషన్లు ఎంత కాలం అంటే ఎలా? మనిషి విలువను కులాన్ని బట్టి చూస్తున్న ఈ దేశంలో కులానికి ఆర్థిక పరిస్థితితో ఉన్న సంబంధాన్ని చూడని ఈ దేశంలో, ఆర్థిక స్థోమతను బట్టి రిజర్వేషన్లు కల్పించాలనటం రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెట్టిన సూత్రాన్ని దెబ్బ కొట్టటమే అవుతుంది. రిజర్వేషన్ల అవసరం రాని పరిస్థితిని కల్పించాల్సిన ఆవశ్యకతను విస్మరించి, ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు కల్పించమని అడగటం అర్థరహితం. ఆ సాకుతో అభివృద్ధి చెందవలసిన వర్గాలను దెబ్బతీయడం మంచిది కాదు. అయితే అది ద్వివేదికి మంచిదే కావచ్చు! (వ్యాసకర్త రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది)