64కు పెరిగిన మృతుల సంఖ్య
ఢాకాలో ప్రదర్శనలు, సభలపై ప్రభుత్వం నిషేధం
జైలుపై ఆందోళనకారుల దాడి
ఖైదీల విడుదల
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రంగానే కొనసాగుతున్నాయి. పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు బాహాబాహీ తలపడుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని పేర్కొంది.
అయితే, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై యంత్రాంగం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రాజధాని ఢాకా పరిధిలోని నర్సింగ్డి జిల్లాలో ఉన్న జైలుకు శుక్రవారం రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ముందుగా వారు జైలుపై దాడి చేసి, అందులోని వారందరినీ విడిచిపెట్టారు. ‘ఖైదీలంతా పరారయ్యాక ఆందోళనకారులు జైలు భవనానికి నిప్పుపెట్టారు. వెళ్లిపోయిన ఖైదీలు ఎంతమంది అనేది తెలియదు.
కానీ, వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది’ అని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది. శుక్రవారం ఢాకాలోని ప్రభుత్వ టీవీ కార్యాలయాన్ని సుమారు 1,000 మంది ఆందోళనకారులు ముట్టడించినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది. వీరిని చెదరగొట్టేందుకు సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. వీధుల్లో పెద్ద సంఖ్యలో బుల్లెట్లతోపాటు రక్తం మరకలు కనిపించాయని తెలిపింది. ఆందోళనకారులు గురువారం టీవీ కార్యాలయంలో కొంతభాగాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు.
దేశవ్యాప్త కర్ఫ్యూ
ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు శృతిమించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. శాంతిభద్రతలను కాపాడటానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది.
Comments
Please login to add a commentAdd a comment