ఢాకా: బంగ్లాదేశ్‌లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యాసంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థలు జూలై 17వ తేదీ నుంచి మూతబడ్డాయి. ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే.
పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో..‘ప్రధాన సలహాదారు యూనుస్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 18వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని సంబంధిత వర్గాలను కోరుతున్నాం’అంటూ 15వ తేదీన విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి మొసమ్మత్ రహీమా అక్తర్ పేరిట ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం యూనిఫాం ధరించిన స్కూలు విద్యార్థులు విద్యాసంస్థలకు చేరుకోవడం కనిపించింది. రాజధాని ఢాకాలోని చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. బంగ్లాదేశ్‌లో పాఠశాలలు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment