న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో పేదలకి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోన్న 10% కోటా పరిధిలోనికి దాదాపు భారతీయులందరూ వస్తారని ఓ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతీయులంతా తాజాగా ప్రకటించిన 10%రిజర్వేషన్ల కోటానో, లేదా ఇతర రిజర్వేషన్ల కోటా కిందో లబ్దిపొందుతారని అంచనా వేశారు. ఐటీ శాఖ,, లేదా నేషనల్ సాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం 95% మంది భారతీయ కుటుంబాలు కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన 8 లక్షల ఆదాయపరిమితి లోని వారే కావడం గమనార్హం.
వార్షికాదాయం 8 లక్షలు ఎందరికుంది?
వార్షికాదాయం 8 లక్షల రూపాయలంటే నెలసరి ఆదాయం 66 వేల పైన ఉండాలి. నేషనల్ శాంపిల్ సర్వే 2011–2012 తాజా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారి నెలసరి అత్యధిక ఆదాయం 2,625. పట్టణ ప్రాంతాల్లో అయితే నెలసరి ఆదాయం 6,015 లోపు వాళ్లే ఉన్నారు. 8 లక్షల రూపాయల ఆదాయం పైబడిన వారు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నారు. అలాగే 2016–17 గణాంకాల ప్రకారం 2.3 కోట్ల మంది మాత్రమే తమకు 4 లక్షల రూపాయలకన్నా అధికంగా వార్షికాదాయం ఉన్నట్టు ప్రకటించారు. ఇలా ప్రతి ఇంటిలో ఇద్దరు వ్యక్తులకు చెరి నాలుగు లక్షల లెక్కన ఆదాయం ఉన్నవారు ఉన్నారనుకుంటే, ఎనిమిది లక్షల వార్షికాదాయం దాటిన కుటుంబాలు దేశంలో కోటి మాత్రమే ఉన్నట్టు అవుతుంది. ఇది దాదాపు దేశంలోని 4 శాతానికి సమానం. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ఏడాదికి తలసరి ఆదాయం 1.25 లక్షలు అంటే ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 6.25 లక్షల రూపాయలు. అంటే ఎనిమిది లక్షల వార్షికాదాయం అనేది జాతీయ సగటుకన్నా ఎక్కువని స్పష్టమౌతోంది.
ఐదెకరాల పరిమితిలోని వారు ఎందరు?
ఇక భూ పరిమితి కూడా చాలా ఉదారంగా ఉన్నట్టు భావిస్తున్నారు. దేశంలోని 86.2 శాతం మంది 2 హెక్టార్ల లోపు భూమి ఉన్నవారే. అంటే ఐదెకరాల్లోపు వారేనని 2015–16 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి కూడా అత్యధికమంది ఈ కోటా పరిధిలోకి వస్తారని స్పష్టం అవుతోంది. అలాగే 1000 చదరపు అడుగుల కంటే తక్కువ వైశాల్యం కలిగిన సొంత ఇల్లు ఉన్నవారు ఎందరంటే నేషనల్ సాంపిల్ సర్వే 2012 ప్రకారం అత్యధికంగా 20 శాతం మంది భారతీయులకు మాత్రమే కేవలం 45.99 చదరపు మీటర్ల స్థలంలో ఇళ్ళున్నాయి. అంటే వీరంతా 500 చదరపు అడుగుల లోపునే ఇళ్ళుకట్టుకున్నారు.
ఇది ప్రభుత్వం విధించిన పరిమితిలో సగం మాత్రమే. దీన్ని బట్టి కనీసం 80 శాతం నుంచి 90 శాతం మంది 1000 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు లేనివారే ఉంటారు. వీరంతా 10 శాతం కోటాకి అర్హులవుతారు. దీన్నిబట్టి ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న దళితులు, ఆదివాసీలు, బీసీలు మినహా మిగిలిన వారంతా ఈ 10 శాతం రిజర్వేషన్ల కోటా పరిధిలోనికి వస్తారు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మొత్తం ఎస్సీ, ఎస్టీలు 23 శాతం మంది ఉన్నారు. ఓబీసీలు 40–50 శాతం ఉన్నారు. మిగిలిన 27–37 శాతం మంది మాత్రమే ప్రస్తుతం ఏ కోటాలోనూ రిజర్వేషన్లు పొందని వారున్నారు. కొత్తగా పెట్టిన పదిశాతం కోటా వీరికి దక్కుతుంది.
వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు
హరియాణాలో 2016 లో జాట్లు సహా ఆరు సామాజిక వర్గాల వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లుని బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. హైకోర్టు కోటా అమలుని నిలిపేసింది. గుజరాత్‌లో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. గుజరాత్‌లో ఇప్పటికే 49.5 శాతం రిజర్వేషన్లున్నాయి. దీంతో హైకోర్టు ఆర్డినెన్స్‌ని కొట్టివేసింది. మహారాష్ట్రలో 2018 నవంబర్‌లో మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో మహారాష్ట్రలో రిజర్వేషన్లు 68 శాతానికి పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment