‘కోటా’కు సరికొత్త పోటు | the system of reservation quota not in right way | Sakshi
Sakshi News home page

‘కోటా’కు సరికొత్త పోటు

Published Thu, Mar 20 2014 11:35 PM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM

‘కోటా’కు సరికొత్త పోటు - Sakshi

‘కోటా’కు సరికొత్త పోటు

విశ్లేషణ
బొజ్జా తారకం
 
 మనిషి  విలువను కులాన్నిబట్టి చూస్తున్న ఈ దేశంలో కులానికి ఆర్థిక పరిస్థితితో ఉన్న సంబంధాన్ని చూడని ఈ దేశంలో, ఆర్థిక స్థోమతను బట్టి రిజర్వేషన్లు కల్పించాలనటం రిజర్వేషన్ల సూత్రాన్ని దెబ్బకొట్టటమే. రిజర్వేషన్ల అవసరం రాని పరిస్థితిని కల్పించాల్సిన ఆవశ్యకతను విస్మరించి, ఆర్థిక పరిస్థితినిబట్టి రిజర్వేషన్లు కల్పించాలనడం అర్థరహితం.
 
 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచీ రిజర్వేషన్ల సమస్యపై మాటిమాటికీ వివాదం రేగుతూనే ఉంది. రేగటం కాదు, రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్ర కులాలు వివాదం రేపుతూ వస్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదని, ప్రతిభావంతులకు అవకాశాలు లభ్యం కావటం లేదని, రిజర్వేషన్లను వెంటనే రద్దు చేస్తే తప్ప దేశానికి మోక్షం లేదని, ప్రపంచ దేశాలలో భారతదేశం వెనకబడిపోవటానికి రిజర్వేషన్లే ప్రధాన కారణమనే పాత పాట మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంది. మళ్లీ ఈ పాత పాటను అందుకున్నది మరెవరో కారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత సన్నిహితుడైన జనార్దన్ ద్వివేది. ఈ ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇదే పాట పాడుతుంటారు. కాకపోతే కొందరు బయటకు, మరికొందరు లోలోపలే. అయితే అందరికీ ఒకటే భయం.
 
 గట్టిగా ఈ పాట పాడితే ఓట్లు కోల్పోతామని! అగ్రకులాల ఓట్లు పడతాయిగానీ అవి చాలవు! అధికార పీఠం దక్కాలంటే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల ఓట్లు తప్పనిసరి. చిత్రమేమిటంటే, ఈ సారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అంతటి వాడే ఎన్నికల సందర్భమని సైతం మరచి మనసులోని మాటను అనుకోకుండా బయటపెట్టేశారు. కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని, వాటికి బదులుగా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని ప్రకటించారు. ఆయన నోట ఆ మాట వచ్చిందంటే, అది సోనియా గాంధీ మాటేనని, అందుకు రాహుల్ గాంధీ వత్తాసు ఉండే ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. ఖంగుతిన్న అధినేత్రి నష్ట నివారణకు చేయాల్సిన ప్రకటన చేశారు. అంతమాత్రాన ద్వివేది వంటి వారి మనస్సుల్లో ఉన్న మాట చెరిగిపోయేది కాదు.
 
 అంతరాలు ఆర్థికపరమైనవే కావు
 
 ద్వివేది చెప్పింది కొత్తగా ఇప్పుడు చెబుతున్న మాట కాదు. రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఈ దాడి మొదలైంది. రిజర్వేషన్‌ల సూత్రాన్ని, రాజ్యాంగంలో దానిని పొందుపరచవలసిన అవసరాన్ని విన్నవించినా సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాతిపదికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. రిజర్వేషన్లను కొట్టివేసింది. వెంటనే 1951లో రిజర్వేషన్ సూత్రానికి అనుగుణంగా రాజ్యాంగంలోని అధికరణకు సవరణను తీసుకొచ్చారు. అప్పటి నుంచి రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదని, అసలు ప్రయోజనం పొందవలసిన వారికి అవి అందటం లేదనే వాదనలు వినవస్తూనే ఉన్నాయి. ఏదో ఒక వంకతో రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవంటూ పదే పదే సుప్రీంకోర్టు తలుపులు కొడుతూనే ఉన్నారు. సుప్రీం కోర్టు వారి వాదనను అంగీకరించకుండానే, రిజర్వేషన్ల ప్రక్రియను మెల్ల మెల్లగా బలహీనపరుస్తూ వచ్చింది.
 
 కులానినీ రిజర్వేషన్లకు, కులానికీ పేదరికానికి, కులానికీ వెనుకబాటుతనానికి మధ్య ఉన్న సంబంధాలను రిజర్వేషన్ల వ్యతిరేక శక్తులు గ్రహించటం లేదు. ఈ దేశంలో వెనుకబాటుతనం, పేదరికం, అంటరానితనం, కులవివక్ష, కులపరమైన అత్యాచారాలకు కులమే ప్రధాన కారణమని అర్థం చేసుకోవడం లేదు. పేద వాళ్లంతా ఒకటే కాదని రిజర్వేషన్ల వ్యతిరేకులు గుర్తించటం లేదు. ‘‘కూటికి పేదవాడిని గాని కులానికి కాదు’’ అనే సామెత ఎందుకు వచ్చిందో, దాని అర్థం ఏమిటో గమనిస్తే కులానికి, పేదరికానికి మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. ఒక పేద బ్రాహ్మణుడికి ఈ దేశంలో దొరికే మర్యాద, గౌరవం, ఆదరణ, ఒక ధనవంతుడైన ఒక మాల లేదా మాదిగ వ్యక్తికి దొరకదనే విషయాన్ని విస్మరించినంత కాలం, ఈ దేశంలో కులానికి, పేదరికానికి మధ్య ఉన్న సంబంధం అర్థం కాదు. ‘‘కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్లు రద్దుచేసి, ఆర్థిక స్థోమత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవలసిన సమయం ఆసన్నమైంది’’ అనే జనార్దన్ ద్వివేదికి అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయో తెలియదు. ఏ రాజకీయ పరిజ్ఞానంతో, ఏ రాజకీయ క్రియాశీలతతో, త్యాగ ఫలంతో ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాగలిగాడు? అంతకన్నా సమర్థులు, పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న నాయకులు ఎంత మంది లేరు? బ్రాహ్మణుడు కాకపోతే ఆయనకు ఆ స్థానం దొరికేదా? ఆ పార్టీ అధికార ప్రతినిధి కాగలిగే వాడా? సోనియా, రాహుల్ గాంధీలకు అంత సన్నిహితుడు కాగలిగే వాడా? నిన్నటి వరకూ ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతాన్ని ఏలింది ఈ ద్వివేదులు, చతుర్వేదులు, త్రిపాఠీలే కాదా! ఎస్‌సీ, బీసీ కులాలు కలసి బ్రాహ్మణులను రాజకీయంగా ఓడించే వరకూ వారి ప్రాబల్యాన్ని ఎవరు ఆపగలిగారు?
 
 ప్రజల మధ్య వ్యత్యాసాలకు ఆర్థిక పరిస్థితి ఒకటే కారణమనుకుంటే ఆర్థిక పరిస్థితి ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏర్పరచవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదుగదా! రిజర్వేషన్ వల్ల ఆశించిన ప్రయోజనం అరవై ఏళ్లలో ఎంత వరకు నెరవేరింది? రిజర్వేషన్ పద్ధతి ద్వారా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో సముచితమైన ప్రాతినిధ్యం కల్పించటం రిజర్వేషన్‌ల ఉద్దేశం. ‘‘అవకాశాలు లభించిన వాళ్లకే అవకాశాలు దొరుకుతున్నాయి. అట్టడుగున ఉండిపోయిన వారు అక్కడే ఉండిపోతున్నారు’’ అనేది రిజర్వేషన్లపై అగ్రకులాలు లేవనెత్తే అభ్యంతరం. అది నిజమేనా?
 
 తెల్లోడి బాటలోనే ఉద్యోగ వివక్ష
 
 రిజర్వేషన్ వల్ల వారికి విద్య, ఉద్యోగరంగాలలో పూర్తి అవకాశాలు దొరుకుతున్నాయా? ఇప్పటికీ నాలుగో తరగతి ఉద్యోగాలలోనే ఎక్కువగా వారికి రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకటి, రెండు, మూడు తరగతి ఉద్యోగాలలో పావు వంతు రిజర్వేషన్ కోటా కూడా నిండటం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఇక రిజర్వేషన్ల అవసరం లేదని ఎలా అంటారు? రిజర్వేషన్లు అంటే నాలుగు, మూడు త రగతి ఉద్యోగాలను దులపరించడం కాదు. ఇద్దరికో ముగ్గురికో ఉన్నత విద్యావకాశాలను కల్పించటం కాదు.
 
 విద్యా ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యానికి నోచుకోని వర్గాలకు అవకాశం కల్పించటం, అభివృద్ధి చెందిన వర్గాలతో పోటీ పడి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే పరిస్థితిని కల్పించటం రిజర్వేషన్ల లక్ష్యం. అధికారంలో ఉన్న వర్గం నెరవేర్చవలసిన కర్తవ్యమది. అది చేయకుండా అక్కడక్కడా కొన్ని రిజర్వేషన్లు కల్పించి, వాటిని కూడా సరిగ్గా అమలు చేయకుండా, ‘‘ఇంకా ఎంత కాలం ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగించాలి?’’ అని ఈసడించుకోవటం చేస్తున్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన మొదట్లో బంట్రోతు వంటి ఉద్యోగాలు తప్ప మిగిలిన ఉద్యోగాలన్నీ ఆంగ్లేయులకే ఇచ్చేవారు. చదువుకున్న భారతీయులు ఉద్యోగావకాశాల కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. చాలా కాలం తర్వాత ఒకటీ, ఒకటీ భారతీయులకు ఇస్తుండేవారు. చాలా కాలం వరకూ ఐసీఎస్ మేజిస్ట్రేట్, జడ్జీ ఉద్యోగాలు భారతీయులకు ఇచ్చేవారు కాదు. భారతీయులకు న్యాయదృక్పథం ఉండదనే కుంటిసాకు చెప్పేవారు. ఎంతో పోరాటం తర్వాతనే ఆ ఉద్యోగాలు భారతీయులకు దక్కాయి. ఒకప్పుడు బ్రిటిష్ వారు భారతీయుల్ని ఎలా చూశారో, అలాగే భారతీయ పాలకులు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలను చూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు ఈ మూడు వర్గాల వారికి ఇవ్వరు. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తి పదవులకు రిజర్వేషన్ వర్తింపజేయటం లేదు. ఎందుకంటే ఆ పదవుల్లో ఉండే అర్హత ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు లేదంటారు. ఇలాంటి వివక్ష చూపుతూ కూడా ఇంకా రిజర్వేషన్లు ఎంత కాలం అంటే ఎలా? మనిషి విలువను కులాన్ని బట్టి చూస్తున్న ఈ దేశంలో కులానికి ఆర్థిక పరిస్థితితో ఉన్న సంబంధాన్ని చూడని ఈ దేశంలో, ఆర్థిక స్థోమతను బట్టి రిజర్వేషన్లు కల్పించాలనటం రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెట్టిన సూత్రాన్ని దెబ్బ కొట్టటమే అవుతుంది. రిజర్వేషన్ల అవసరం రాని పరిస్థితిని కల్పించాల్సిన ఆవశ్యకతను విస్మరించి, ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు కల్పించమని అడగటం అర్థరహితం. ఆ సాకుతో అభివృద్ధి చెందవలసిన వర్గాలను దెబ్బతీయడం మంచిది కాదు. అయితే అది ద్వివేదికి మంచిదే కావచ్చు!    
 (వ్యాసకర్త రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది)

 



 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement