న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లోని సంపన్న శ్రేణి(క్రీమీ లేయర్)కి రిజర్వేషన్ కోటాలో భాగం ఇవ్వకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సమీక్షించే భాధ్యతను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది. తీర్పు ఎస్సీ/ఎస్టీలకు వర్తించదని, ఈ తీర్పును సమీక్షించాలని, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేయగా సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌ల బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్ కోటా దక్కరాదన్న సూత్రం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు వర్తించదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ‘ఇది ఉద్వేగాలతో కూడుకున్న అంశం. విస్తృత ధర్మాసనానికి నివేదించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సమతా ఆందోళన్ సమితి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని గట్టిగా వ్యతిరేకించారు.
Comments
Please login to add a commentAdd a comment