సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ అయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీస్) దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
ఎమ్మార్పీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎస్సీల్లో ఎక్కువ జనాభాగా ఉన్నప్పటికీ మాదిగ ఉపకులాలకు తగిన రిజర్వేషన్లు వర్తించడం లేదన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే ఈవీ చిన్నయ్య కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే... ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఆలస్యం అవుతోందని, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యంతర పరిష్కారం ఇవ్వాలని కోరారు.
అయితే కేసు విచారణ వేగవంతం చేయాలని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరలేమని, అదే కేసులో ఇంప్లీడ్ కావాలని పిటిషనర్‌కు సీజేఐ సూచించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని రోహత్గి తెలపగా స్పందించిన సీజీఐ, ‘‘ఈ తరహా కేసులో విచారణ చేపట్టకుండా ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా?’’అని న్యాయవాదిని ప్రశ్నించారు. అనంతరం ‘‘రాజ్యాంగ ధర్మాసనం కేసులో ఇంప్లీడ్ కావడానికి పిటిషనర్‌కు అనుమతిస్తున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రతివాదులకు నోటీసులు జారీ పూర్తయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలి’’అని ధర్మాసనం ఆర్డర్‌లో పేర్కొన్నారు.
వర్గీకరణతోనే న్యాయం: మంద కృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరు గుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment