ప్రతి కులానికి రిజర్వేషన్‌ ఫలం! | Supreme Court Green Signal To SC ST Sub Classification: telangana | Sakshi
Sakshi News home page

ప్రతి కులానికి రిజర్వేషన్‌ ఫలం!

Published Fri, Aug 2 2024 6:11 AM | Last Updated on Fri, Aug 2 2024 6:11 AM

 Supreme Court Green Signal To SC ST Sub Classification: telangana

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఫలితం

ఇప్పటివరకు లబ్ధి పొందని కులాలకు ఇకపై ప్రత్యేక కోటాతో న్యాయం

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్సీ, ఎస్టీల్లోని ఉపకులాల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కల నెరవేరిందని ఆయా వర్గాల నేతలు చెబుతుండగా.. వాస్తవంగా ఏమేరకు లబ్ధి జరుగుతుందనే చర్చ మరోవైపు మొదలైంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అమలవుతున్నప్పటికీ అభివృద్ధిలో ఉన్న కులాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయనే వాదన తీవ్రంగా ఉంది.

ఎస్సీల్లో మాలలే ఎక్కువగా రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్నారని, మాదిగలకు సరైన కోటా దక్కడం లేదనే వాదన ఉండగా.. ఎస్టీల్లో లంబాడాలే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారంటూ ఆదివాసీ తెగలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తు న్నాయి. ఈ క్రమంలోనే మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌), తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి పేరిట ఉద్యమాలు ఏళ్లుగా కొనసాగు తున్నాయి. ఇందులో అత్యంత చురుకుగా ఎమ్మార్పీఎస్‌ ముందు వరుసలో ఉంది. దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పరిష్కారం లభించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు...
రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల కేటగిరీలో 60 ఉప కులాలున్నాయి. అదే విధంగా షెడ్యూల్డ్‌ తెగల (ట్రైబ్స్‌) కేటగిరీలో 32 ఉప కులాలు న్నాయి. గిరిజన కేటగిరీలో పర్టిక్యులర్లీ వల్నరెబుల్‌ (అత్యంత బలహీన) ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీవీటీజీ) విభాగం కింద మరో 5 కులాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో ప్రధానంగా నాలుగైదు కులాల్లోనే అత్యధిక జనాభా ఉండగా.. మిగిలిన కులాల్లో మాత్రం వెయ్యిలోపు నుంచి పదివేల లోపు జనాభా ఉన్నవే ఎక్కువ.

కాగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతించడంతో పాటు అన్ని కులాలకు సమానంగా అందించేవిధంగా వర్గీకరణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఏవిధంగా జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement