Creamy layer
-
క్రీమీలేయర్ పేరిట చిచ్చు పెట్టొద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల్లోని క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు వర్తింపజేయకూడదన్న ఆలోచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చెప్పారు. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న భాగాన్ని తొలగించాలని, ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రీమీలేయర్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు నిరాకరించాలని ఆయన సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మల్లికార్జున ఖర్గే తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విధానానికి ముగింపు పలికేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
క్రీమీలేయర్‌తో ఓబీసీ విద్యార్థులకు నష్టం
సాక్షి, హైదరాబాద్: క్రీమీలేయర్ విధానంతో వేలాదిమంది ఓబీసీ విద్యార్థులకు యూపీఎస్సీలో తీవ్ర నష్టం జరుగుతుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జరుగుతున్న నష్టం గురించి తనను శుక్రవారం కలిసిన బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు మంత్రి వివరించారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉండి రూ. 8 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వారి కుటుంబాలకు క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయాలనే నిబంధలున్నా.. ఎక్కడా అమలు కావడం లేదన్నారు. దీనిపై రాష్ట్ర బీసీ కమిషన్ సమగ్రమైన నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కృష్ణమోహన్‌కు మంత్రి సూచించారు. ఈ భేటీలో మహబూబ్‌నగర్ జిల్లా బీసీ సంఘాల ప్రతినిధులు గిరిగౌడ్, తిరుపతి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీమీలేయర్‌ను రద్దు చేయాలి: జాజుల
యాదగిరిగుట్ట: బీసీలకు క్రీమీలేయర్‌ను పెట్టి వారికి రిజర్వేషన్లు అందకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వెంటనే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ ఉపాధ్యాయులకు వెంటనే పదో న్నతులు వాటిలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరా రు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శుక్రవారం జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 47 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన సురేశ్, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి జిల్లాకు చెందిన నరేంద్రస్వామి ఎన్నికయ్యారు. -
ఓబీసీ రిజర్వేషన్లపై మోదీకి లేఖ
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ క్రిమీలేయర్‌ను రూ.8లక్షల నుంచి రూ.15లక్షల ఆదాయ పరిమితికి పెంచాలని ఎంపీ విశంభర్ పేర్కొన్నారు. గత నెల సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఒబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాగా త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓబీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
క్రీమీ లేయర్ పరిమితిని 30 లక్షలకు పెంచాలి
సందర్భం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బి.పి. శర్మ కమిటీ నివేదికను ఆమోదించి ఉద్యోగుల జీతాలను సంపన్న శ్రేణి నిర్ధారణలో కలిపినట్లయితే దేశంలో కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజర్వేషన్లు కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఓబీసీలను గుర్తించి రిజర్వేషన్ల అమలుకు 1953–55లో మొదటి జాతీయ బీసీ కమిషన్ నియమించింది. కానీ సదరు నివేదికను బుట్టదాఖలు చేసింది. రెండవ జాతీయ బీసీ కమిషన్‌ను 1978–80లో బి.పి. మండల్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ 41 సిఫార్సులతో 1980లో నివేదిక సమర్పించినప్పటికీ 1990 వరకు ఇనుప బీరువాలో భద్ర పరిచారు. మండల్ తీర్పు ద్వారా 1993 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అప్పటికే కేంద్రంలో లక్షలాది ఉద్యోగాల భర్తీ జరిగి పోయింది. మరొకవైఫు ప్రైవేటీకరణ మొదలైంది. ఫలితంగా ఓబీసీల ప్రాతినిధ్యం గ్రూపు–ఏ 13%, గ్రూపు–బి 14%, గ్రూపు–సి 22%, గ్రూపు–డి 14% మొత్తం సరాసరి 21% శాతానికి మించిలేదు. సామాజికంగా, విద్యాపరంగా వెనుక బడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లు కులాల పరంగా అమలు జరపవలసిన రిజర్వేషన్లు కావు. అయినప్పటికీ సామాజికంగా వెనుకబాటుకు ప్రామాణికం మన దేశంలో కులమే కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాలను ఓబీసీ/ బీసీ జాబితాల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. కావున ఆయా కులాల్లో సామాజికంగా వృద్ధి చెందిన వారిని ఓబీసీ రిజర్వేషన్ల నుండి తొలగించి మిగతా వారికీ 27% కేంద్రంలో అమలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అందుకు కేంద్రం 1993లో జాతీయ స్థాయిలో ఓబీసీల్లో సంపన్న శ్రేణి వారిని గుర్తించడానికి జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీని వేసింది. కమిటీ ఆరు తరగతులలో ఉన్నవారి సంతానాన్ని గుర్తించింది. 1.రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు. 2.గ్రూపు–1 లేదా తల్లి – తండ్రి గ్రూపు–2లో నియమించ బడిన వారు. 3.ఆర్మీ, పారా మిలటరీలలో కల్నల్ లేదా ఆ పై స్థాయి అధికారులు. 4. వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల పిల్లలు. 5.స్థిర, చరాస్తులు కల్గినవారు. 6. ఆదాయ పరిమితి. చివరిదైన ఆదాయ పరిమితిలో ఉద్యోగుల జీత భత్యాలు మరియు వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించారు. మొదట 1993లో వార్షిక ఆదాయం ఒక్క లక్షగా నిర్ధారించారు. ప్రతి మూడు సంవత్సరాలకు సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో 27 సంవత్సరాల నుండి ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తోంది. అనగా నేటికి ఆదాయ పరిమితిని తొమ్మిదిసార్లు సమీక్షించి పెంచి ఉంటే వార్షిక ఆదాయ పరిమితి ముప్పై లక్షల్లో ఉండేది. కానీ కేవలం నాలుగుసార్లు మాత్రమే సమీక్షించి ఎనిమిది లక్షలుగా ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదా యాన్ని మినహాయించి నిర్ధారించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అనేక సందర్భాల్లో ఈ విధానానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. కేంద్రంలో 1989లో జనతాదళ్ ప్రభుత్వం వి.పి. సింగ్ ప్రధానిగా బీజేపీ మద్దతుతో ఏర్పడింది. 1990లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కేంద్ర ఉద్యోగాల్లో ప్రకటిం చగానే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించు కుంది. మొదటి నుండి ఓబీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో దీనివల్ల అర్థం అవుతుంది. బీజేపీ 2014లో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. బీసీల పక్షాన ఉన్నట్లుగా నటిస్తూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా అధికారాలను కల్పించింది. ఉత్తర భారతదేశంలోని జాట్ కులస్తులు, గుజరాత్లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు, ఇతర అగ్రకులాల వారు ఓబీసీ జాబితాలో తమను చేర్చాలని రాజకీయ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడికి తగ్గింపు చర్యగా 2019 జనవరిలో 103వ రాజ్యాంగ సవ రణ ద్వారా అగ్ర కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. 2019లో బి.పి.శర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2017కి సంబంధిం చిన సివిల్ సర్వీసెస్ ఓబీసీ అభ్యర్థుల సమస్య పరి ష్కారం, ఓబీసీలకు సంబంధించిన క్రీమీలేయర్ విధా నాన్ని సరళీకృతం చేసి ఆదాయ పరిమితిని పెంచాలని ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ కమిటీలో ఒక్క సభ్యుడు కూడా ఓబీసీ కులానికి చెందినవారు లేకపోవడం బీజేపీ వెనుక రిజర్వేషన్ల వ్యతిరేక హిందుత్వ శక్తులు ఎంత శక్తి మంతంగా పని చేస్తున్నాయో తెలియజేస్తోంది. ఓబీసీల సంక్షేమం, ఇతర సమస్యలపై రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్‌ను నియమించిన తర్వాత బి.పి. శర్మ కమిటీకి చట్టబద్ధత, రాజ్యాంగ బద్ధత లేదని గమనించాలి. బి.పి శర్మ కమిటీ ఓబీసీ కుల సంఘాలతో, ఉద్యోగ సంఘా లతో, రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా ఏక పక్షంగా అశాస్త్రీయంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీత భత్యాలను కలిపి క్రిమీలేయరు వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 12 లక్షలకు పెంచాలని నివేదిక సమ ర్పించింది. కేంద్రం వెంటనే కేబినెట్ నోట్ తయారు చేయడం రాజ్యాంగ తప్పిదంగా భావించాలి. ఒక వైపు రాజ్యాంగ బద్ధమైన ఓబీసీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులు గణేష్ సింగ్ ఆధ్వర్యంలో సమర్పించిన నివేదికలో క్రీమీలేయరు వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బి.పి. శర్మ కమిటీ నివేదికను ఆమోదించి ఉద్యోగుల జీతాలను సంపన్న శ్రేణి నిర్ధారణలో కలిపినట్లయితే దేశంలో కోట్లమంది ఓబీసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత రిజర్వేషన్లు కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు కూడా కోల్పోవలసి వస్తుంది. దేశంలో 70 కోట్ల మందికి సంబంధించిన రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్నప్పుడు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్పందించకపోవడం వారికి ఓబీసీ రిజర్వేషన్ల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థం అవుతోంది. ఇప్పటివరకు తమిళనాడు నుండి డీఎంకే పార్టీ బి.పి. శర్మ కమిటీ నివేదికను రద్దు చెయ్యాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ లేఖను సమర్పించింది. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. క్రీమీలేయరు వార్షిక ఆదాయాన్ని ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో 8 లక్షల నుండి 30 లక్షలకు పెంచాలని డిమాండ్ చేయాలి. వ్యాసకర్త జాతీయ అధ్యక్షులు, జాతీయ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మొబైల్ : 94909 59625 కోడెపాక కుమార స్వామి -
రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 126వ సవరణ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడే ఉన్నందున, వారిలో క్రీమీలేయర్‌ను వర్తింపజేయాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఈ సవరణ ద్వారా 2030, జనవరి 25 వరకు రిజర్వేషన్లను పొడిగిస్తారు. ఈ బిల్లును 10వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. చర్చ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్‌కు, విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌కు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు వారు సభకు తిరిగివచ్చారు. -
ఎస్సీ/ఎస్టీ క్రీమీలేయర్ అంశాన్ని సమీక్షించండి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లోని సంపన్న శ్రేణి(క్రీమీ లేయర్)కి రిజర్వేషన్ కోటాలో భాగం ఇవ్వకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సమీక్షించే భాధ్యతను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది. తీర్పు ఎస్సీ/ఎస్టీలకు వర్తించదని, ఈ తీర్పును సమీక్షించాలని, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేయగా సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్ కోటా దక్కరాదన్న సూత్రం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు వర్తించదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ‘ఇది ఉద్వేగాలతో కూడుకున్న అంశం. విస్తృత ధర్మాసనానికి నివేదించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సమతా ఆందోళన్ సమితి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని గట్టిగా వ్యతిరేకించారు. -
క్రీమీలేయర్‌ను వర్తింప చేయలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల్లో చాలా మంది ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నారనీ, ఆయా వర్గాల్లోని సంపన్నులు కూడా కులం పరంగా కొంత వరకు వివక్షను ఇంకా ఎదుర్కొంటున్నారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ‘రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీ, ఎస్టీల్లో వెనుకబడిన వారికే అందేలా చూసేందుకు.. ఆయా వర్గాల్లోని సంపన్నులు, అభివృద్ధి చెందిన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు తొలగించేలా క్రీమీలేయర్‌ను వర్తింపజేయొచ్చా?’అని సుప్రీంకోర్టు వేణుగోపాల్‌ను కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లోనూ క్రీమీలేయర్‌ను వర్తింపజేయరాదంటూ 2006లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ కురియన్, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తోంది. 2006 తీర్పుపై పునఃసమీక్ష అవసరమనుకుంటే ఈ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రస్తుత బెంచ్ బదిలీ చేస్తుంది. వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీల్లోకి ఎవరిని చేర్చాలి/తొలగించాలి అనేది పూర్తిగా పార్లమెంటు, రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయమనీ, న్యాయవ్యవస్థకు దీనితో సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. వివక్షాపూరిత కుల వ్యవస్థ దేశంలో ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. 2006 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు గత నెల 11న సుప్రీం నిరాకరించడం తెలిసిందే. -
మధ్యంతర ఉత్తర్వులుండవ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల విషయంలో క్రీమీలేయర్ వర్తింపుపై 2006నాటి తీర్పు (ఎం.నాగరాజ్ తీర్పు అనికూడా పిలుస్తారు)కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. ‘2006 తీర్పు’ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. మధ్యంతర ఉపశమన చర్యలు ఇచ్చేందుకు కేసు విచారించబోమని, కూలంకషంగా చర్చిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఇందుకోసం ఎం నాగరాజు తీర్పుపై విచారించేందుకు ఏడుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించింది. తదుపరి విచారణ ఆగస్టు 3న జరుగుతుందని స్పష్టం చేసింది. నియామకాలు ఆగిపోయాయ్: కేంద్రం వివిధ న్యాయపరమైన ప్రకటనల కారణంగా రైల్వేలు, ఇతర సేవా రంగాల్లో లక్షల ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయని, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదన వినిపిస్తూ.. వివిధ బెంచ్‌లు, హైకోర్టులు ఇటీవల ఇచ్చిన తీర్పుల కారణంగా రిజర్వేషన్లపై గందరగోళం నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ‘స్టేటస్ కో’ నెలకొందంటూ ఓ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం పదోన్నతులకు సిద్ధమవుతున్న సమయంలో జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పెండింగ్‌లో పెట్టిందన్నారు. ధావన్ వాదనలను వేణుగోపాల్ సమర్థించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్‌పై గందరగోళం నెలకొందని.. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే మాత్రం.. ఈ విషయంలో గందరగోళం లేదన్నారు. పలు పక్షాలు వాదిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్రీమీలేయర్ వర్తించదు: నాటి తీర్పులో సుప్రీం 2006 నాటి ‘ఎం నాగరాజ్, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ తీర్పును పునఃపరిశీలించాలా వద్దా? అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని గతేడాది నవంబర్ 15న ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల పదోన్నతుల్లో క్రీమీలేయర్ వర్తించదంటూ ఎం నాగరాజు తీర్పులో 2006లో సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
‘క్రీమీలేయర్’ ఎత్తేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. క్రీమీలేయర్ నిబంధన ఎత్తేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్ట్ కమిటీ సమావేశంలో ఆయన అధిష్టానానికి సూచించారు. ఆదివారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్ట్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీలో సభ్యుడైన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..క్రీమీలేయర్ నిబంధన ఎత్తేసేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఏపీ నుంచి కమిటీలో సభ్యుడైన కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా కమిటీ సభ్యుల ను మన్మోహన్ సింగ్ కోరినట్టు తెలిసింది. -
క్రీమీలేయర్‌లోకి పీఎస్‌యూ ఉద్యోగాలు
ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీలు కూడా.. కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: ఓబీసీల్లో సంపన్న వర్గమైన ‘క్రీమీలేయర్’ పరిధిని కేంద్రం విస్తరించింది. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు), ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో కొన్ని పోస్టులు దీని కిందికి వస్తాయని పేర్కొంది. దీంతో ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, కుటుంబీకులు ఓబీసీ కోటాలో రిజర్వేషన్‌కు దూరమవుతారు. ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓబీసీల్లో సామాజికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు, వర్గాలను కూడా రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించింది. తాజా నిర్ణయం ప్రకారం... పీఎస్‌యూల్లో అన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుల(బోర్డు, మేనేజ్మెంట్ స్థాయి కలుపుకుని)ను గ్రూప్ ఏ పోస్టులతో సమానంగా క్రీమీలేయర్‌గా భావిస్తారు. ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీల్లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్–1 ఆపై స్థాయి ఉద్యోగులని గ్రూప్ ఏ ఉద్యోగులతో సమానంగా భావిస్తూ క్రీమీలేయర్ హోదా ఇస్తారు. ఇక క్లర్క్‌లు, ప్యూన్లకు సంబంధించి సమయానుగుణంగా వారి ఆదాయ వనరుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు‘క్రీమీలేయర్ పరిధి విస్తరణతో పీఎస్‌యూలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు... ప్రభుత్వ విభాగాల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న వారి పిల్లలతో సమానంగా ఓబీసీ రిజర్వేషన్ల ఫలాలు పొందుతారు’ అని కేబినెట్ భేటీ అనంతరం ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ♦ ఎన్నికల నిర్వహణలో ఆరు దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్న ఈసీ ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం. ఇందులో ఈక్వెడార్, ఆల్బేనియా, భూటాన్, అఫ్గానిస్తాన్, గినియా, మయన్మార్ దేశాలున్నాయి. ♦ పారిశ్రామిక అభివృద్ధి కోసం 40 మిలియన్ డాలర్లతో ఫండ్ ఏర్పా టుకు భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందానికి ఆమోదం. -
పీఎంఓకు ‘క్రీ మీలేయర్ పెంపు’
న్యూఢిల్లీ: ఓబీసీలకు రిజర్వేషన్ల వర్తింపులో ప్రస్తుతమున్న క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ. 8 లక్ష లకు పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనల ఫైలును సామాజిక న్యాయ శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిందని, త్వరలో కేంద్ర కేబినెట్లో ఈ అంశం చర్చకు వస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఉండగా... కుటుంబ ఆదాయం రూ. 6 లక్షల వరకూ ఉంటేనే రిజర్వేషన్‌ను వర్తింపచేస్తున్నారు. పరిమితిని పెంచాలంటూ కొన్ని నెలలుగా కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్రీమీలేయర్ నిర్వచనాన్ని సమీక్షించి ఇతర వెన కబడ్డ వర్గాలకు వర్తించేలా జూలైలోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలంటూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రి రాందాస్ అథవాలే ఆగస్టులో డిమాండ్ చేశారు. ఆ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ప్రస్తావించారు. పెంపు రూ. 8 లక్షలుంటే సరిపోతుందన్న ఆ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ వాదనతో చివరకు ఆ మేరకే పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెంపును కేబినెట్ ఆమోదించాక... నవంబర్-డిసెంబర్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఈ అంశం లాభిస్తుందని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. -
ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణిపై సమీక్ష
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ఓబీసీ సంపన్నశ్రేణి (క్రిమిలేయర్) విధానాన్ని కేంద్రం సమీక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. ఓబీసీల్లో కుటుంబాదాయం ఏడాదికి రూ.6 లక్షలకు మించి ఉన్నవారిని ప్రస్తుతం సంపన్నవర్గంగా పరిగణిస్తున్నారు. వీరికి విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు. ఈ ఏడాది చివరికల్లా నిర్వచనాన్ని మరోసారి సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. -
‘క్రిమిలేయర్’ ఎత్తివేయాలని డిమాండ్
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన అరండల్‌పేట: కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు కల్పిస్తున్న 27 శాతం రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఆంక్షను పూర్తిగా ఎత్తివేయాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. సోమవారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీమీలేయర్ ఆంక్షల నేపథ్యంలో ఓబీసీలు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా లెక్కల ప్రకారం 27 శాతంలో కేవలం 12 శాతం స్థానాలు నిండుతున్నాయని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు చెప్పారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల తరఫున ఆదాయ పరిమితిని 6 నుంచి 8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉందన్నారు. అయితే బీసీ కమిషన్ రూ.15లక్షలు ఉండాలని చేసిన సిఫార్సును అమలు చేయాలన్నారు. బీసీగా చెలామణి అవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలన్నారు. బీసీ రిజర్వేషన్‌న్లను ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో తీసివేయడంగానే పరిణమిస్తోందన్నారు. లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో 7శాతం కూడా నియామకాలు జరగడం లేదన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, నగర అధ్యక్షుడు కన్నా మాస్టారు, జాతీయ కృష్ణబలిజ సంఘం అధ్యక్షుడు అన్నం శివరామయ్య, పోతురాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.