న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల్లో చాలా మంది ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నారనీ, ఆయా వర్గాల్లోని సంపన్నులు కూడా కులం పరంగా కొంత వరకు వివక్షను ఇంకా ఎదుర్కొంటున్నారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ‘రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీ, ఎస్టీల్లో వెనుకబడిన వారికే అందేలా చూసేందుకు.. ఆయా వర్గాల్లోని సంపన్నులు, అభివృద్ధి చెందిన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు తొలగించేలా క్రీమీలేయర్‌ను వర్తింపజేయొచ్చా?’అని సుప్రీంకోర్టు వేణుగోపాల్‌ను కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లోనూ క్రీమీలేయర్‌ను వర్తింపజేయరాదంటూ 2006లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే.
నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ కురియన్, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తోంది. 2006 తీర్పుపై పునఃసమీక్ష అవసరమనుకుంటే ఈ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రస్తుత బెంచ్ బదిలీ చేస్తుంది. వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీల్లోకి ఎవరిని చేర్చాలి/తొలగించాలి అనేది పూర్తిగా పార్లమెంటు, రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయమనీ, న్యాయవ్యవస్థకు దీనితో సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. వివక్షాపూరిత కుల వ్యవస్థ దేశంలో ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. 2006 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు గత నెల 11న సుప్రీం నిరాకరించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment