‘క్రిమిలేయర్’ ఎత్తివేయాలని డిమాండ్
‘క్రిమిలేయర్’ ఎత్తివేయాలని డిమాండ్
Published Mon, Aug 29 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన
అరండల్‌పేట: కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు కల్పిస్తున్న 27 శాతం రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఆంక్షను పూర్తిగా ఎత్తివేయాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. సోమవారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీమీలేయర్ ఆంక్షల నేపథ్యంలో ఓబీసీలు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా లెక్కల ప్రకారం 27 శాతంలో కేవలం 12 శాతం స్థానాలు నిండుతున్నాయని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు చెప్పారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల తరఫున ఆదాయ పరిమితిని 6 నుంచి 8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉందన్నారు. అయితే బీసీ కమిషన్ రూ.15లక్షలు ఉండాలని చేసిన సిఫార్సును అమలు చేయాలన్నారు. బీసీగా చెలామణి అవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలన్నారు. బీసీ రిజర్వేషన్‌న్లను ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో తీసివేయడంగానే పరిణమిస్తోందన్నారు. లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో 7శాతం కూడా నియామకాలు జరగడం లేదన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, నగర అధ్యక్షుడు కన్నా మాస్టారు, జాతీయ కృష్ణబలిజ సంఘం అధ్యక్షుడు అన్నం శివరామయ్య, పోతురాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement