OBCS
-
కాంగ్రెస్ పాఠం నేర్చేనా?
మూడు హిందీ ప్రాంత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ సాధించిన అద్భుతమైన విజయం ఎన్నికల విజయం మాత్రమే కాదు. ఇది భారత రాజకీయాల వర్తమానంతోపాటు భవిష్యత్తు గురించి కూడా వివిధ వ్యక్తావ్యక్త సందేశాలను కలిగి ఉంది. ఉత్తర భారతదేశంలో ఆ పార్టీకి భారీఎత్తున ప్రజాభి మానం ఉందని బీజేపీ విజయాలు తెలియజేస్తున్నాయి. హిందీ ప్రాంత ఓటర్లతో ఆ పార్టీ అంత లోతైన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోగలిగింది, ముఖ్యంగా బీజేపీపై ప్రజల విశ్వాసం గురించి ఈ ఫలితాల నుండి వెలువడుతున్న పెద్ద సందేశం ఏమిటి? సాంఘిక సంక్షేమ రాజకీయం, రిజర్వేషన్లకు సంబంధించి కులగణన కేంద్రక రాజకీయాలు అనే రెండు ప్రధాన అంశాలను కేంద్రంగా చేసుకొని ఈ ఎన్నికలు జరిగాయి. సంక్షేమ చర్యల రాజకీయాలను ప్రధాన పోటీదారులైన బీజేపీ, కాంగ్రెస్‌లు అనుసరించాయి. బీజేపీ తన ప్రణాళికా బద్ధమైన ఎన్నికల ప్రచారం ద్వారా, డబుల్ ఇంజిన్ సర్కార్‌తో కలిగే ప్రయోజనాలను ప్రచారం చేసింది. ఒకే సమయంలో కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నందున కలిగిన ప్రయోజనాలను ప్రచారంలో ఎత్తి చూపింది బీజేపీ. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టనున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విశేషించి పేర్కొన్నారు కమలనాథులు. కాంగ్రెస్, బీజేపీలు తమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారిని ఎవరికి వారు తయారుచేసుకోగలి గాయి. కానీ కాంగ్రెస్ ఇంకా తన లబ్ధిదారులతో రాజ కీయ సంస్థాగత సంబంధాలను ఏర్పరచుకోలేదు. అయితే, బీజేపీ తన లబ్ధిదారులను ఒక సంఘంగా – ఒక సముదాయంగా–వారితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంది. మామా, లాడ్లీ బెహనా (ప్రియమైన సోదరి) వంటి కుటుంబ సంబంధ పదజాలాన్ని వాడటం ద్వారా, వారితో సన్నిహితంగా ఉండటం ద్వారా బీజేపీ ఈ పని చేయ గలిగింది. పార్టీ కార్యకర్తలు వివిధ పథకాల లబ్ధిదారులతో హోలీ, దీపావళి, రక్షా బంధన్ వంటి పండు గలను జరుపుకోవడం ప్రారంభించారు. తన వంతుగా,కాంగ్రెస్ కూడా పేద ప్రజలకు పథకాలను అందించింది, కానీ వారితో దీర్ఘకాలిక భావోద్వేగ సంబం ధాన్ని ఏర్పరచుకోలేకపోయింది. హిందీ ప్రాంత వాసి మనస్సు... తనతో గౌరవంగా, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న పార్టీతో స్పష్టంగా కనెక్ట్ అయి ఉంటుంది. బీజేపీ రాజకీయ పదజాలం... ఆర్థిక సమస్య లనూ, అభివృద్ధినీ అట్టడుగు స్థాయిలో ప్రతిధ్వనించే సాంస్కృతిక, సామాజిక భావోద్వేగాల చట్రంలో రూపొందించింది. రెండవది – గ్రామీణ భారతదేశంలోని గ్రామీణ ప్రజలకు నమ్మకం చాలా ముఖ్యం. ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయాలతో ప్రజలలో మత, సాంస్కృతిక భద్రతకు భరోసా కల్పించడం ద్వారా వారిలో అపారమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఎన్నికలలో కూడా మోదీ తనకు తానుగా ప్రచారానికి పూను కుని, ఓటర్లకు ‘నేను ఇక్కడ ఉన్నాను, నేను మీ కోసం పని చేస్తాను’ అనే భరోసా ఇచ్చే రిస్క్ తీసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించకుంటే అది మోదీ ప్రతిష్ఠపై ప్రభావం చూపి ఉండేది. మూడవది – హిందూత్వం. బీజేపీ తన రాజకీయాలను హిందూత్వ భావనపై నిర్మించి, పునరుద్ధరించే ఆధార్ భావాన్ని (ఫౌండేషనల్ ఎమోషన్) ను హిందువులు అధికంగా ఉన్న హిందీ ప్రాంత రాష్ట్రాల్లో అందించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాన్ని ప్రధాన ప్రచారా యుధంగా మలచుకొంది. రామ్ భద్రాచార్య వంటి అనేక మంది సనాతన ధర్మ సాధువులు ఈ ఎన్నికలను ధర్మం, అధర్మాల మధ్య యుద్ధంగా అంచనా వేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన కమల్‌నాథ్ నియోజకవర్గమైన ఛింద్వారాలో జరిగిన ఓ మీటింగ్‌లో తమ ధర్మాన్ని కాపాడే పార్టీకి మద్దతు ఇవ్వాలని రామ్ భద్రాచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సాధువులు తమ సమావేశాల్లో ఇచ్చిన ప్రవచనాలలో,డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. కాంగ్రెస్‌ను స్టాలిన్ పార్టీకి మద్దతుదారుగా చూపారు. అలా ఆ పార్టీని సనాతన విరోధిగా చిత్రించారు. సనాతన ధర్మంపై మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వరకు సాగిన ఈ ప్రచారం హిందీ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసే ప్రజా కథనంగా ఉద్భవించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్లలోని గిరిజనులు, దళితులపై కూడా ఇది ప్రభావం చూపింది. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ఓటర్లను వారి కుల గుర్తింపుపై సమీకరించేందుకు కుల గణన డిమాండ్‌పై కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడింది. ఈ ఎన్నికల్లో దాని వ్యూహం పూర్తిగా విఫలమైంది. హిందీ ప్రాంత రాష్ట్రాల్లో కులం ప్రభావం కొనసాగుతోంది. కానీ ప్రజల మూడ్ మారిందని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇది బహుళ ఆకాంక్షల యుగం. కుల చైతన్యం ఒక ఆకాంక్ష మాత్రమే. ‘కుల గుర్తింపు తర్వాత ఏమిటి’అనేది ఓటర్ల మనసులోని ప్రశ్న. బీజేపీ ఇకపై బ్రాహ్మణ–బనియా పార్టీ కాదనే వాస్త వాన్ని కాంగ్రెస్ కూడా అంగీకరించలేదు, బీజేపీ నాయకత్వంలో ఓబీసీలు ఉన్నారు. కాబట్టి, కుల గణన ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఓబీసీల సంఘటిత సమీకరణ దాదాపు అసాధ్యం. ఈ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తాయి. ఇవి ముఖ్యంగా హిందీ ప్రాంతంలో తన వ్యూహాలు, ప్రజలతో రాజకీయంగా వ్యవహరించే తీరు (డిక్షన్) గురించి పునరా లోచించడానికి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తాయి. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు ఇరుసుగా కాంగ్రెస్‌కు దాని స్థానం దానికి ఉండవచ్చు. అయితే, కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియల్లో జరిగే చర్చలు, ప్రాధా న్యాలను ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. తాజా ఫలితాలు ప్రధాని మోదీ ప్రతిష్ఠను బలోపేతం చేశాయి. ఇది నిస్సందేహంగా బీజేపీపై సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుంది. బద్రీనారాయణ్ వ్యాసకర్త అలహాబాద్‌లోని ‘గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇనిస్టిట్యూట్’లో ప్రొఫెసర్ -
చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రిజర్వేషన్లు కల్పిస్తు న్నారో అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదే శాల మేరకు మహిళా బిల్లుకు మద్దతిస్తు న్నామ న్నారు. రాజ్యసభలో గురువారం మహిళ బిల్లు పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు కార్యరూపం దాల్చిన ఏడేళ్ల తర్వాత అమలు చేయడం అంటే పంచభక్ష్య పరమాన్నం ముందుపెట్టి ఎప్పుడో తినమన్నట్లు ఉందన్నారు. సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో వెనుకబాటు తనంతో ఉన్న ఓబీసీలకు రిజర్వే షన్లు ఎందుకు కల్పించరని బోస్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం దీనిపై ఆలోచించి త్వరలోనే ఓబీసీ బిల్లు తీసుకురావాలని ఎంపీ బోస్ విజ్ఞప్తి చేశారు. లింగ వివక్ష తగ్గుతుంది : ఆర్. కృష్ణయ్య చర్చలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మహిళా బిల్లు స్వాగతించదగినదన్నారు. దేశంలో లింగ, కుల వివక్షలు ఉన్నాయని.. మహిళ బిల్లుతో లింగ వివక్ష తగ్గుతుందని.. అయితే, కుల వివక్ష తగ్గించాలంటే బిల్లులో ఓబీసీ సబ్‌కోటా పెట్టాలని కోరారు. సబ్‌కోటా కుదరకపోతే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అన్ని రంగాల్లోనూ బీసీల పాత్ర చాలా తక్కువగానే ఉంటోందని కృష్ణయ్య తెలిపారు. రాజ్యాధికారం వస్తేనే వారికి గౌరవం దక్కుతుందన్నారు. -
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీలకు జరుగుతున్న నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీలు బోస్, వెంకటరమణారావు ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయవ్యవస్థలోను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తొలుత బీసీ జనగణన చేయాలని, లేకుంటే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదని చెప్పామన్నారు. ఇంకా వారేమన్నారంటే.. ► న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరాం. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 14 హైకోర్టుల్లో 75 ఏళ్లలో ఒక ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కూడా లేరు. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాం. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుర్తింపు రాలేదని తెలిపాం. ► కాకినాడ–అమలాపురం రోడ్డును కత్తిపూడి నుంచి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు నిర్మించాలని, దీనికి గోదావరిపై వంతెన నిర్మించాలని కోరాం. -
2019 ఎన్నికలు: యోగి బ్రహ్మాస్త్రం ఇదే!
వారణాసి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు తన ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రయోగించబోతోంది. యూపీ ఎన్నికల్లో కులాల సమీకరణాలు అత్యంత కీలకమైన నేపథ్యంలో రాష్ట్రంలోని 82 ఓబీసీ కులాలను మూడు విభాగాలుగా విభజించి.. మండల్ కమిషన్ ప్రతిపాదించిన 27శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేబినెట్ సీనియర్ మంత్రి ఓపీ రాజ్‌భర్ తెలిపారు. బీజేపీ మిత్రపక్షం సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడైన ఆయన మీడియాతో మాట్లాడారు. 82 ఒబీసీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించి.. 27శాతం రిజర్వేషన్‌ను వర్తింపజేయాలని నిర్ణయించడం రాజకీయ బ్రహ్మాస్త్రామని, ఈ బ్రహ్మాస్త్రం దెబ్బకు ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని యోగి ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి ఇటీవలి యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్య రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగిన గోరఖ్‌పూర్, ఫూల్పుర లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి విజయం సాధించడం బీజేపీలో గుబులు రేపింది. ఈ విజయాలతో ఊపుమీదున్న ఎస్పీ-బీఎస్పీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. వెనుకబడిన తరగతులు, దళితులు, ముస్లింల సామాజిక సమీకరణంతో బీజేపీని చిత్తు చేసేందుకు ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ-బీఎస్పీ రాజకీయ సమీకరణకు చెక్ పెట్టేందుకు యోగి ప్రభుత్వం.. ఓబీసీల వర్గీకరణ సూత్రాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సూత్రం ప్రకారం వెనుకబడిన తరగతుల్లో నాలుగు కులాలు, బాగా వెనుకబడిన తరగతుల్లో 19 కులాలు, అత్యంత వెనుకబడిన కులాల్లో (ఎంబీసీలు) 59 కులాలు ఉండనున్నాయి. ఈ మేరకు ఓబీసీ రిజర్వేషన్‌ను వర్గీకరిస్తే.. ఎస్పీకి ప్రధాన మద్దతు వర్గమైన యాదవుల ఆధిపత్యానికి తీవ్ర సవాల్ ఎదురయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్లలో గణనీయమైన ప్రయోజనాలు పొందుతున్నది యాదవులే. రిజర్వేషన్ ఫలాలను యాదవులే అధికంగా పొందుతున్నారనే అసంతృప్తి ఇతర బీసీ వర్గాల్లో ఉంది. ఈ అసంతృప్తి 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలను మరింతగా చేరవయ్యి.. ఎస్పీ-బీఎస్పీ కూటమి సామాజిక సమీకరణాన్ని దెబ్బతీయని కమల దళం వ్యూహాలు రచిస్తోంది. -
కొలువుల్లోనూ వెనుకబాటే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో ఓబీసీలు వెనుకబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గణాంకాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుండేవి 69 శాఖలు. వాటిలో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులుండగా... అందులో 27 శాతం ఉద్యోగులు ఓబీసీ వర్గాలకు చెందినవారుండాలి. కానీ ఈ సంఖ్య 17 శాతానికి మించడం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీలకు అమలు చేస్తున్నారు. 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. కానీ ఈ వర్గానికి చెందిన ఉద్యోగుల సంఖ్య ఎస్సీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు నాలుగు కేటగిరీల్లో ఉన్నారు. ఉన్నతస్థాయి పోస్టులు మినహాయిస్తే మిగతా స్థాయిల్లో వీరిని.. గ్రూప్ ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. గ్రూప్–ఏ కేటగిరీలో ఎస్సీలు 11.5 శాతం ఉండగా.. ఓబీసీలు 6.9 శాతం ఉన్నారు. గ్రూప్–బీలో ఎస్సీలు 14.9 శాతం ఉండగా... ఓబీసీలు 7.3 శాతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగులు, వారి సామాజిక వర్గాల కోణంలో అధికారికంగా తీసుకున్న సమాచారం ఆధారంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఇ.ఆంజనేయగౌడ్ ‘సామాజిక న్యాయం, భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఓబీసీలు’పేరుతో పుస్తకం ప్రచురించారు. అందులో ఈ గణాంకాలను పేర్కొన్నారు. నియామకాల్లో నిబంధనలకు నీళ్లు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా ఉంది. మండల్ కమిషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల భర్తీ తరహాల్లో ఓబీసీ ఉద్యోగాల భర్తీలో మిగులు పోస్టులను క్యారీఫార్వర్డ్ చేయాలి. అలా చేస్తే ఆ పోస్టులు తిరిగి ఆయా వర్గాలకే వస్తా యి. కానీ ఓబీసీల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. యూపీఎస్సీ ద్వారా జరుగుతున్న నియామకాల్లో ఓపెన్ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థి ఉద్యోగం పొందినా.. ఆ పోస్టును రిజర్వేషన్ కోటాలో చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థి తీవ్రంగా నష్టపోతున్నాడు. క్రీమీలేయర్ విధానంతోనూ ఓబీసీలకు నష్టం జరుగుతోంది. దాదాపు పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పూర్తిస్థాయి పోస్టులు భర్తీ చేయకుండా సగానికిపైగా ఖాళీగా ఉం చుతున్నారు. ఎక్కువగా ప్రైవేటు, ఔట్సోర్సింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమ లు చేస్తే ఓబీసీలకు సగం వాటా దక్కుతుంది. అలా చేయకపోవడంతో వెనుకబాటుకు గురవుతున్నారు. – ఇ.ఆంజనేయగౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు -
‘క్రిమిలేయర్’ ఎత్తివేయాలని డిమాండ్
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన అరండల్‌పేట: కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు కల్పిస్తున్న 27 శాతం రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఆంక్షను పూర్తిగా ఎత్తివేయాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. సోమవారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీమీలేయర్ ఆంక్షల నేపథ్యంలో ఓబీసీలు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా లెక్కల ప్రకారం 27 శాతంలో కేవలం 12 శాతం స్థానాలు నిండుతున్నాయని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు చెప్పారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల తరఫున ఆదాయ పరిమితిని 6 నుంచి 8 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉందన్నారు. అయితే బీసీ కమిషన్ రూ.15లక్షలు ఉండాలని చేసిన సిఫార్సును అమలు చేయాలన్నారు. బీసీగా చెలామణి అవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలన్నారు. బీసీ రిజర్వేషన్‌న్లను ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో తీసివేయడంగానే పరిణమిస్తోందన్నారు. లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో 7శాతం కూడా నియామకాలు జరగడం లేదన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, నగర అధ్యక్షుడు కన్నా మాస్టారు, జాతీయ కృష్ణబలిజ సంఘం అధ్యక్షుడు అన్నం శివరామయ్య, పోతురాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు కావడం లేదు'
న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం ఏపీ భవన్ లో జరిగిన బీపీ మండల్ 98వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఓబీసీ పార్లమెంటరీ కమిటీకి చట్టబద్దత కల్పించడానికి తనవంతు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని పార్టీల ఏకాభిప్రాయం అవసరమన్నారు. త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి చట్టబద్ధత కల్పించాలని కోరతామని దత్తాత్రేయ తెలిపారు. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. బీసీల అభ్యున్నతికి బీపీ మండల్ కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాపోల్ ఆనంద్ భాస్కర్, మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.