ag venugopalarao
-
కమ్రా ట్వీట్లు కోర్టు ధిక్కారమే: ఏజీ
న్యూఢిల్లీ: కమేడియన్ కునాల్ కమ్రా సుప్రీంకోర్టుని విమర్శిస్తూ చేసిన ట్వీట్లు కోర్టుని అవహేళన చేయడమేనని, అతనిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్ తెలిపారు. సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను ప్రజలు ధైర్యంగా, బహిరంగంగా విమర్శించవచ్చునని, అయితే వాక్ స్వాతంత్య్రం అనేది చట్టానికి లోబడి ఉంటుందని కెకె.వేణుగోపాల్ అన్నారు.సుప్రీంకోర్టుని కాషాయరంగుతో, దానిపై త్రివర్ణపతాకం జెండా స్థానంలో బీజేపీ జెండాని చూపిస్తూ కమ్రా ట్వీట్ చేశారని, ఇది సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, అతనిపై చర్యలకు అనుమతినివ్వాలని ముగ్గురు లాయర్లు కోరారు. అర్నబ్‌కి సుప్రీం బెయిలు మంజూరు చేయడంపై కమ్రా ఈ ట్వీట్ చేశారు. -
ఎస్సీ/ఎస్టీ క్రీమీలేయర్ అంశాన్ని సమీక్షించండి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లోని సంపన్న శ్రేణి(క్రీమీ లేయర్)కి రిజర్వేషన్ కోటాలో భాగం ఇవ్వకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సమీక్షించే భాధ్యతను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది. తీర్పు ఎస్సీ/ఎస్టీలకు వర్తించదని, ఈ తీర్పును సమీక్షించాలని, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేయగా సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్ కోటా దక్కరాదన్న సూత్రం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు వర్తించదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ‘ఇది ఉద్వేగాలతో కూడుకున్న అంశం. విస్తృత ధర్మాసనానికి నివేదించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సమతా ఆందోళన్ సమితి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని గట్టిగా వ్యతిరేకించారు. -
అర్ధగంట చదివినా అర్థంకాలేదు
న్యూఢిల్లీ/శ్రీనగర్: రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దును వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరిస్తూ, ఆ పిటిషన్లలో అనేక లోపాలు ఉన్నాయనీ, ముందు వాటిని సరిచేసుకోవాలని సూచించింది. ఇంతటి తీవ్రమైన, ప్రధానమైన అంశానికి సంబంధించిన పిటిషన్లలో అనేక తప్పులు, లోపాలు ఉండటంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం ఈ నెల 5న రద్దు చేయడం తెలిసిందే. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. న్యాయవాది ఎంఎల్ శర్మ మొట్టమొదటగా, ఆగస్టు 6నే వేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది. శర్మ పిటిషన్‌పై జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యానిస్తూ ‘ఈ పిటిషన్‌ను అర్ధగంటపాటు చదివాను. కానీ ఈ పిటిషన్ ఎందుకు వేశారో అర్థం కాలేదు. పిటిషనర్ ఏం కోరుతున్నారో తెలియలేదు. ఏం అడుగుతున్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఏం పిటిషన్ ఇది?’ అని అన్నారు. మరికొంత సమయం ఇస్తాం.. జమ్మూ కశ్మీర్లో మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను కూడా ఇదే ధర్మాసనం విచారించింది. ఆంక్షలను క్రమక్రమంగా ఎత్తివేస్తున్నామని కేంద్రం తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ అంశంలో ఏదైనా ఆదేశం జారీ చేసే ముందు తాము మరికొంత సమయం వేచిచూడనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ క్రమక్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నామని చెప్పారు. ఇరు పక్షాల వాదనలనూ విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ‘ ఆంక్షల ఎత్తివేతపై కేంద్ర ప్రభుత్వానికి మేం మరికొంత సమయం ఇవ్వదలచుకున్నాం’ అని తెలిపింది. ఎవ్వరూ చనిపోలేదు జమ్మూ కశ్మీర్లో ఆగస్టు 5న ఆంక్షలు విధించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రాణం కూడా పోలేదనీ, ఎవరికీ పెద్ద గాయాలు కాలేదని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు. కశ్మీర్లో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లను పునరుద్ధరించే పని శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమవుతుందనీ, శనివారం ఉదయానికే శ్రీనగర్‌లోని అత్యధిక భాగం ఫోన్లు పనిచేస్తుంటాయని ఆయన తెలిపారు. కశ్మీర్లో పాఠశాలలను వచ్చే వారంలో పునఃప్రారంభిస్తామనీ, దశల వారీగా ఆంక్షలను ఎత్తివేస్తామన్నారు. కశ్మీర్ లోయలోని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం బాగా ఎక్కువగానే హాజరు నమోదైందని సుబ్రహ్మణ్యం తెలిపారు. జమ్మూ కశ్మీర్లో 22 జిల్లాలు ఉండగా, ప్రస్తుతం 12 జిల్లాల్లో ఫోన్ కనెక్షన్లన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయనీ, మరో ఐదు జిల్లాల్లో కేవలం రాత్రి వేళల్లోనే ఆంక్షలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. కశ్మీర్ లోయలో 11 రోజులు ఉన్న అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం ఢిల్లీకి తిరిగొచ్చారు. మరోవైపు కశ్మీర్లో ఫోన్లైన్లు, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు పనిచేయకపోవడంతో.. బయటి ప్రాంతాల్లోని వ్యక్తులు తమ సందేశాలను టీవీ చానెళ్లకు పంపితే, చానెళ్లు వాటిని టీవీల్లో టిక్కర్ (స్క్రోలింగ్) రూపంలో కశ్మీర్‌లోని వారికి అందిస్తున్నాయి. అయితే కశ్మీర్‌లోని వారంతా ఈ మెసేజ్‌లను టీవీల్లో చూడగలరు తప్ప తిరిగి సమాధానం పంపలేరు. థార్ లింక్ ఎక్స్‌ప్రెస్ రద్దు థార్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కరాచీ వెళ్లేందుకు జీరోపాయింట్ వరకూ నడుపుతున్న లింక్ ఎక్స్‌ప్రెస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఈ రైలు ఆగిపోయిందని వాయువ్య రైల్వే అధికారి అభయ్‌శర్మ అన్నారు. అటునుంచి రావాల్సిన రైలు కూడా నిలిచిపోయిందని తెలిపారు. ట్రంప్‌కు ఇమ్రాన్‌ఖాన్ ఫోన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కశ్మీర్ సమస్యపై ఫోన్లో చర్చించినట్లు పాక్ విదేశాంగ మంత్రి తెలిపారు. కశ్మీర్ విషయంలో ఐరాసలో రహస్య భేటీ జరుగుతున్న సందర్భంగా ట్రంప్–ఇమ్రాన్ మాట్లాడుకున్నారని చెప్పారు. -
రెండేళ్లకు ముందే తొలగించలేరు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా తనను రెండేళ్ల నిర్దిష్ట కాలానికి నియమించారనీ, అంతకుముందే విధుల నుంచి తప్పించే లేదా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని ఆ సంస్థ చీఫ్ అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత నెలలో డైరెక్టర్ అలోక్ వర్మను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించడం, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ కేసు విచారణను కోర్టు గురువారం కొనసాగించింది. అలోక్‌వర్మ తరపున ఆయన న్యాయవాది ఫాలీ నారిమన్, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ తదితరులు వాదనలు వినిపించారు. సీబీఐ డైరెక్టర్‌ను విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశాలిచ్చే అధికారం కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేదని నారిమన్ అన్నారు. ‘1997లోనే వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సీబీఐ డైరెక్టర్‌కు రెండేళ్ల నిర్దిష్ట పదవీకాలం ఉంటుంది’ అని అన్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ (డీఎస్పీఈ) చట్టం – 1946 ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ను తొలగించాలంటే ఆ అధికారం ఆయనను ఆ పదవికి ఎంపిక చేసిన ప్యానెల్ (ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ)కే ఉంటుందనీ, సీవీసీ ఆదేశాలపై అలోక్ వర్మను తొలగించడం చట్ట విరుద్ధమని నారిమన్ కోర్టుకు తెలిపారు. కేంద్రం చేసిన పనితో వినీత్ నరైన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా పోయిందన్నారు. బదిలీ చేయలేదు, వర్మనే డైరెక్టర్: ఏజీ నారిమన్ వ్యాఖ్యలతో ఏజీ వేణుగోపాల్ విభేదించారు. అలోక్ వర్మ తన అధికారిక బంగ్లాలోనే నివసిస్తున్నారనీ, కాబట్టి ఆయనను కేంద్రం బదిలీ చేసిందని అనుకోవడానికి వీల్లేదన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్ కలగజేసుకుని.. అలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. డీఎస్పీఈ చట్టంలోని నిబంధనలను సీవీసీ, ప్రభుత్వం ఉల్లంఘించజాలవనీ, సీబీఐ డైరెక్టర్‌ను పదవీకాలం మధ్యలో బదిలీ చేయాలన్నా, తీసేయాలన్నా ఆయనను నియమించిన కమిటీకే ఆ అధికారం ఉంటుందని వివరించారు. విజిలెన్స్ చట్టం కింద అధికారాల్లేకుండానే, నిబంధనలను ఉల్లంఘించి వర్మను విధుల నుంచి కేంద్రం తప్పించిందని ఆయన ఆరోపించారు. ఈరోజు సీబీఐ డైరెక్టర్‌కు జరిగినట్లుగానే రేపు కాగ్‌కు, సీవీసీకి జరగదని భరోసా ఏంటనీ, ఈ ప్రభుత్వానికి చట్టాలపై ఏం గౌరవం ఉందనీ, చట్టబద్ధ సంస్థల స్వతంత్రత ఏమవుతుందని సిబల్ ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తులు విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ తాము ఈ కేసులో అలోక్, అస్థానా వర్గాల ఆరోపణల జోలికి పోమనీ, ముందుగా కేంద్రం చట్టాన్ని ఉల్లంఘించిందా, లేదా అన్న దానిపైనే విచారిస్తామని స్పష్టం చేశారు. సీబీఐలో ఓఎస్డీ నియామకం? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో ప్రస్తుతం డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేడీ నాగేశ్వరరావు ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలువరించడం తెలిసిందే. ఈ కారణంగా సీబీఐలో పాలన సరిగా సాగడం లేదనీ, కాబట్టి సీబీఐలో డైరెక్టర్ జనరల్ ర్యాంక్‌లో ఓఎస్డీ (ప్రత్యేక విధులపై నియమితులైన అధికారి)ని నియమించాలని కేంద్రం అనుకుంటున్నట్లు సమాచారం. ఓఎస్డీ నియామకానికి అయితే∙ప్యానెల్ అనుమతి అవసరం లేదనీ, కాబట్టి ఓఎస్డీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘సాక్షుల రక్షణ’ను అమలుపరచండి
న్యూఢిల్లీ: సాక్షుల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన ముసాయిదాను అమలు పరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ (నల్సా) సలహా తీసుకుంటామని తెలిపింది. కేంద్రం రూపొందించిన ముసాయిదా రూపకల్పన తుది దశకు చేరుకుందని, త్వరలోనే అది చట్టంగా రూపొందనుందని ఈ లోపు ముసాయిదాను అమలుపరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాల్సిందిగా అటార్నీ జనరల్ కె.కె.వేణు గోపాల్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ‘మేం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం. ఈ ముసాయిదాను అమలు పరిచేలా అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తాం’అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. -
రఫేల్ వివరాలు బయటపెడితేనే ధరలపై చర్చ సాధ్యం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వివరాలు బహిర్గతమైతేనే వాటి ధరలపై చర్చించడం సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం సీల్డ్ కవర్లో అందించిన వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న విషయంపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ రిజర్వ్‌లో ఉంచింది. ‘రఫేల్ ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న దానిపై ఇప్పుడు మేం నిర్ణయం తీసుకోవాలి’ అని జడ్జీలు అన్నారు. ఒప్పందం వివరాలు బయటపెట్టకుండా ధరలపై విచారణ జరిపే అవకాశమే లేదని వారు కేంద్రానికి స్పష్టం చేశారు. అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ కేంద్రం తరఫున వాదించారు. ధర, ఒప్పందం వివరాలు బహిర్గతమైతే శత్రు దేశాలకు ఇదో లాభించే అంశమవుతుందని ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వాయుసేన అవసరాలకు సంబంధించినది కాబట్టి.. ప్రభుత్వం పంపే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి కాకుండా వాయుసేన అధికారిని తాము ప్రశ్నించాలనుకుంటున్నామని జడ్జీలు తెలిపారు. వాయుసేన ఉన్నతాధికారులను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా జడ్జీలు ఆదేశించడంతో హుటాహుటిన అధికారులు కోర్టుకు వచ్చారు. దీంతో ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ చలపతి, ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా, ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. చలపతిని సీజేఐ వివరాలు అడిగారు. 40 శాతం పెరిగింది: ప్రశాంత్ భూషణ్ పిటిషనర్లలో ఒకరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఇతర పిటిషనర్లు, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీల తరఫున కూడా కలిపి వాదనలు వినిపించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర 155 మిలియన్ యూరోలు కాగా, బీజేపీ ప్రభుత్వం ఆ ధరను 40 శాతం పెంచి, 270 మిలియన్ యూరోలకు ఒక్కో విమానాన్ని కొంటోందని భూషణ్ కోర్టుకు తెలిపారు. ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదన్నారు. ప్రభుత్వాల మధ్య ఒప్పందమే కాదు: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కానేకాదని కాంగ్రెస్ పేర్కొంది. విమానం నాణ్యత, ఒక్కో విమానం తయారీని ఎన్ని పనిగంటల్లో పూర్తి చేస్తారనే వాటిపై డసో ఏవియేషన్ ఏ విధమైన హామీ ఇవ్వనందున అది నిబంధనలను అతిక్రమించినట్లేననీ, కాబట్టి కేంద్రం ఆ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకుని ఉండాల్సింది కాదని పేర్కొంది. కాంగ్రెస్ నేత, ప్రముఖ లాయరు కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ రక్షణ పరికరాల సరఫరాపై మరో దేశ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. ఈ రకమైన ఒప్పందాన్ని కేవలం అమెరికా ప్రభుత్వం మాత్రమే చేసుకుంటుంది. రఫేల్ రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం కానేకాదు. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ అనే కంపెనీతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది అంతే’ అని తెలిపారు. నిపుణులు చర్చించాల్సిన విషయాలివి: ఏజీ ఒప్పందం వివరాలు నిపుణులు చర్చించాల్సినవనీ, ఒక్కో యుద్ధ విమానం ధర ఎంతనే పూర్తి వివరాలను ఇప్పటివరకు పార్లమెంటుకే కేంద్రం తెలియజేయలేదని ఏజీ వాదించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విమానాల్లో ఆయుధాలను నింపే వ్యవస్థ లేదనీ, తాజా∙ఒప్పందం ప్రకారం ఆయుధాలను విమానంలోనే నింపి ఆకాశం నుంచి నేరుగా ప్రయోగించవచ్చన్నారు. ఇది అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ – ఇంటర్ గవర్న్మెంట్ అగ్రిమెంట్) అయినందున వివరాలను రహస్యంగా ఉంచాలని ఒప్పందంలో ఉందని ఏజీ కోర్టుకు చెప్పారు. కాబట్టి వివరాలను బహిర్గతం చేయడంలో కేంద్రానికి అభ్యంతరాలున్నాయన్నారు. -
'కాల్ డేటా వివరాలు ఇప్పించండి'
విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా సిట్ తరుపున అడ్వకేట్ జనరల్ వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. సీఆర్ పీసీ 174 కింద కాల్ డేటాను ఇవ్వాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. అయితే, కాల్ డేటా వివరాలను వెల్లడించడం చట్ట విరుద్ధమవుతుందని టెలికాం ఆపరేటర్లు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు.