ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ చలపతి
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వివరాలు బహిర్గతమైతేనే వాటి ధరలపై చర్చించడం సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో అందించిన వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న విషయంపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ రిజర్వ్‌లో ఉంచింది. ‘రఫేల్ ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న దానిపై ఇప్పుడు మేం నిర్ణయం తీసుకోవాలి’ అని జడ్జీలు అన్నారు.
ఒప్పందం వివరాలు బయటపెట్టకుండా ధరలపై విచారణ జరిపే అవకాశమే లేదని వారు కేంద్రానికి స్పష్టం చేశారు. అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ కేంద్రం తరఫున వాదించారు. ధర, ఒప్పందం వివరాలు బహిర్గతమైతే శత్రు దేశాలకు ఇదో లాభించే అంశమవుతుందని ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వాయుసేన అవసరాలకు సంబంధించినది కాబట్టి.. ప్రభుత్వం పంపే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి కాకుండా వాయుసేన అధికారిని తాము ప్రశ్నించాలనుకుంటున్నామని జడ్జీలు తెలిపారు. వాయుసేన ఉన్నతాధికారులను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా జడ్జీలు ఆదేశించడంతో హుటాహుటిన అధికారులు కోర్టుకు వచ్చారు. దీంతో ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ చలపతి, ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా, ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. చలపతిని సీజేఐ వివరాలు అడిగారు.
40 శాతం పెరిగింది: ప్రశాంత్ భూషణ్
పిటిషనర్లలో ఒకరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఇతర పిటిషనర్లు, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీల తరఫున కూడా కలిపి వాదనలు వినిపించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర 155 మిలియన్ యూరోలు కాగా, బీజేపీ ప్రభుత్వం ఆ ధరను 40 శాతం పెంచి, 270 మిలియన్ యూరోలకు ఒక్కో విమానాన్ని కొంటోందని భూషణ్ కోర్టుకు తెలిపారు. ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదన్నారు.
ప్రభుత్వాల మధ్య ఒప్పందమే కాదు: కాంగ్రెస్
రఫేల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కానేకాదని కాంగ్రెస్ పేర్కొంది. విమానం నాణ్యత, ఒక్కో విమానం తయారీని ఎన్ని పనిగంటల్లో పూర్తి చేస్తారనే వాటిపై డసో ఏవియేషన్ ఏ విధమైన హామీ ఇవ్వనందున అది నిబంధనలను అతిక్రమించినట్లేననీ, కాబట్టి కేంద్రం ఆ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకుని ఉండాల్సింది కాదని పేర్కొంది. కాంగ్రెస్ నేత, ప్రముఖ లాయరు కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ రక్షణ పరికరాల సరఫరాపై మరో దేశ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. ఈ రకమైన ఒప్పందాన్ని కేవలం అమెరికా ప్రభుత్వం మాత్రమే చేసుకుంటుంది. రఫేల్ రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం కానేకాదు. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ అనే కంపెనీతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది అంతే’ అని తెలిపారు.
నిపుణులు చర్చించాల్సిన విషయాలివి: ఏజీ
ఒప్పందం వివరాలు నిపుణులు చర్చించాల్సినవనీ, ఒక్కో యుద్ధ విమానం ధర ఎంతనే పూర్తి వివరాలను ఇప్పటివరకు పార్లమెంటుకే కేంద్రం తెలియజేయలేదని ఏజీ వాదించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విమానాల్లో ఆయుధాలను నింపే వ్యవస్థ లేదనీ, తాజా∙ఒప్పందం ప్రకారం ఆయుధాలను విమానంలోనే నింపి ఆకాశం నుంచి నేరుగా ప్రయోగించవచ్చన్నారు. ఇది అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ – ఇంటర్ గవర్న్‌మెంట్ అగ్రిమెంట్) అయినందున వివరాలను రహస్యంగా ఉంచాలని ఒప్పందంలో ఉందని ఏజీ కోర్టుకు చెప్పారు. కాబట్టి వివరాలను బహిర్గతం చేయడంలో కేంద్రానికి అభ్యంతరాలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment