
జస్టిస్ బాబ్డేతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కేంద్రానికి లేఖ రాశారని అధికారులు తెలిపారు. సీనియారిటీ పరంగా ఎస్‌ఏ బాబ్డేను తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర చట్టం, న్యాయ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 3న 46వ సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రంజన్‌గొగోయ్ బాబ్డే పేరును ప్రతిపాదిస్తూ లేఖ రాశారు.
ఒకవేళ జస్టిస్ బాబ్డే పేరు ఖరారైతే ఆయన 2021 ఏప్రిల్ 3 వరకు అంటే 17 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. అనంతరం సీనియారిటీ పరంగా జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ యూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు వరుస క్రమంలో ఉన్నారు. ప్రస్తుతం జస్టిస్ గొగోయ్ పంపిన లేఖను న్యాయ శాఖ నిపుణులు పరిశీలించి ప్రధాన మంత్రికి అందజేస్తారు. అనంతరం ప్రధాన మంత్రి ఈ పదవి గురించి రాష్ట్రపతికి సలహాలు ఇస్తారు. అధికారిక నియామక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న జడ్జీలలో, సీనియర్ జడ్జీని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment