Justice SA bobde
-
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు
న్యూఢిల్లీ: "భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవిని ఒక మహిళ చేపేట్టే సమయం ఆసన్నమైంది" అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అన్న వ్యాఖ్యలు నిజం అయ్యే సమయం ఆసన్నమయినట్లే ఉంది. అన్ని అనుకూలిస్తే.. త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఓ మహిళ చేపట్టనున్నారు. జస్టిస్ బీవీ నాగరత్న 2027 లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోయే మొదటి మహిళగా నిలవనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తదుపరి చీఫ్ జస్టిస్ రేసులో ఉన్న 9 మంది న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేసింది. వీరిలో బీవీ నాగరత్న పేరు కూడా ఉన్నది. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్నం పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆమె 2008 లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే.. అది దేశ న్యాయ చరిత్రలో చారిత్రాత్మక క్షణంగా నిలుస్తుంది. నాగరత్న తండ్రి ఈఎస్ వెంకటరామయ్య గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జూన్ 1989 నుంచి డిసెంబర్ 1989 మధ్య భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. భారతదేశానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి కావాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీవీ నాగరత్నను ఆ పదవి వరిస్తే.. ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా మహిళ.. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని అభిప్రాయపడ్డారు. గతంలో బాబ్డే "మహిళల ఆసక్తి, ఉత్సాహం మాకు తెలుసు. సాధ్యమైనంత మేర అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వైఖరిలో మార్పు రావాలి అనడానికేమీ లేదు. సమర్థులైన అభ్యర్ధులు కావాలి" అన్నారు. జాబితాలో మరో ఇద్దరు మహిళలు.. ఐదుగురు సభ్యుల కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల జాబితాలో నాగరత్నతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారు జస్టిస్ హిమా కోహ్లీ (తెలంగాణ హైకోర్టు సీజే), జస్టిస్ బేల త్రివేది (గుజరాత్). సుప్రీంకోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది పీఎస్ నరసింహ పేరు కూడా కొలీజయం జాబితాలో ఉంది. నాగరత్న, పీఎస్ నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్ , జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్,జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ జాబితాలో ఉన్న ఇతరులు. న్యాయ వ్యవస్థలో మహిళలు.. భారతదేశంలో 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. అంతకుముందు 1935 నుంచి ఉన్న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు వచ్చింది. అప్పటినుంచి 47మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. తొలిగా ఎపెక్స్ కోర్టులో 8 మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారాన్ని రాజ్యాంగం, పార్లమెంటుకు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 మంది. అయితే, ఇప్పటివరకూ కేవలం 8 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో జడ్జ్‌లుగా వ్యవహరించారు . 1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం 34 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో కేవలం ఒక్క కోర్టులో మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆమె, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. దేశవ్యాప్తంగా ఉన్న 661 మంది హైకోర్టు జడ్జ్‌లలో కేవలం 73 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మణిపూర్, మేఘాలయ, పట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. -
హిందీ కన్నా అంబేడ్కర్‌కు సంస్కృతమే ఇష్టం
నాగపూర్: సంస్కృత భాషను భారతదేశ అధికార జాతీయ భాషగా ప్రకటించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే చెప్పారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకు తెలుసని అన్నారు. అలాగే రాజకీయ, సామాజిక పరిస్థితులు కూడా అంబేడ్కర్ బాగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే ఆ ప్రతిపాదన తెచ్చారని వెల్లడించారు. జస్టిస్ బాబ్డే బుధవారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ఎంఎన్‌ఎల్‌యూ) అకడమిక్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. మన ప్రాచీన మేధావులు న్యాయశాస్త్రం గురించి సమగ్రంగా బోధించారని గుర్తుచేశారు. అరిస్టాలిట్ వంటి పాశ్చాత్యుల బోధనకంటే ఇవి ఎందులోనూ తీసుపోవని అన్నారు. మన మేధావులు చెప్పిన విషయాలను పక్కనపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో ఏ భాష వాడాలన్నదానిపై సుప్రీంకోర్టుకు చాలా విజ్ఞాపనలు వచ్చాయని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అంబేడ్కర్ ముందే ఊహించారని, అందుకే సంస్కృతాన్ని దేశ అధికార జాతీయ భాషగా మార్చాలని ప్రతిపాదించారని తెలిపారు. ‘‘ఉత్తర భారతదేశంలో తమిళ భాషను అంగీకరించరన్నది అంబేడ్కర్ అభిప్రాయం. అలాగే దక్షిణ భారతదేశంలో హిందీని ఒప్పుకోరని ఆయన నిర్ణయానికొచ్చారు. అందుకే సంస్కృతాన్ని దేశ అధికార భాషగా ప్రకటిస్తే ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండవని భావించారు. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు’’ అని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో చేరేవారికి లా స్కూల్ ఒక నర్సరీలాంటిదన్నారు. - జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి -
సోషల్ మీడియా ఓ గన్నులాంటిది: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన చేతిలో తుపాకీని వాడినట్టుగానే సోషల్ మీడియాను వాడవచ్చునని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసులు, బెయిల్ వంటి అంశాల్లో సోషల్ మీడియా ద్వారా చేసే పోస్టులపై మార్గదర్శకాలుండాలంది. కరోనా కట్టడి, లాక్డౌన్ వంటి అంశాల్లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలను లక్ష్యంగా చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ చౌధరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు సచిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఏడాదిన్నర పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షరతు విధించింది. దీంతో సచిన్ సుప్రీంను ఆశ్రయించారు. శుక్రవారం దీని విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బాబ్డే సోషల్ మీడియాకి సచిన్ దూరంగా ఉండాలన్న హైకోర్టు ఆదేశాలను సమర్థించారు. ఏదైనా కేసులో నిందితుడు తుపాకీకి దూరంగా ఉండాలని ఆదేశం ఇవ్వడం ఎలాంటిదో, సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండమని చెప్పడం అలాంటిదేనన్నారు. -
సుప్రీంలో తొలిసారిగా సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం నుంచి తొలిసారిగా నిర్ధిష్ట పిటిషన్లను ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సహజంగా సుప్రీంకోర్టు బెంచ్ కనీసం ఇద్దరు న్యాయమూర్తులతో కూడి ఉంటుంది. ఏడేళ్ల జైలు శిక్షకు మించని నేరాలకు సంబంధించిన కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ అప్పీళ్లను సింగిల్ జడ్జ్ బెంచ్ విచారిస్తుంది. బెయిల్, ముందస్తు బెయిల్, బదిలీ పిటిషన్ల విచారణకు సింగిల్ జడ్జ్ బెంచ్‌ను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు నిబంధనలను సవరించింది. ఇక గత ఏడాది జులై వరకూ 11.5 లక్షల పెండింగ్ కేసులు పేరుకుపోయాయని న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో తక్షణం విచారణ చేపట్టాల్సిన కేసులను స్కైప్, ఫేస్‌టైం, వాట్సాప్ అప్లికేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారిస్తోంది. కాగా, సంక్షోభ సమయంలో న్యాయస్ధానం పనిచేస్తూనే ఉందని, కేసుల పరిష్కారం దిశగా చొరవ చూపుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అన్నారు. తమ క్యాలెండర్‌కు అనుగుణంగా ఏడాదికి 210 రోజులు పనిచేస్తామని ఆయన వెల్లడించారు. చదవండి : మద్యం అమ్మకాలకు నో.. సుప్రీంకు సర్కార్ -
పీఎం కేర్స్ ఫండ్‌పై పిల్.. రేపు విచారణ
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కరోనాపై పోరులో భాగంగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీఎం కేర్స్ ఫండ్ భారీగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి మోదీ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్ ఫండ్ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. అయితే పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ ఎంఎల్ శర్మ సుప్రీం కోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ‘మార్చి 28వ తేదీన కోవిడ్-19 పోరాటంలో భాగంగా ప్రజలు విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. ఇందు కోసం పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకు సాయం అందించడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 267, 266(2) ప్రకారం ఈ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆర్టికల్ 267 ప్రకారం దీనిని పార్లమెంట్ గానీ, రాష్ట్ర శాసనసభ గానీ రూపొందించలేదు. అలాగే దీనికి పార్లమెంట్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదం లేదు’ అని పిల్లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు ఈ ఫండ్ కింద సేకరించిన విరాళాలను కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా బదిలీ చేయాలని కోరారు. కాగా, ఈ పిల్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శాంతనగౌదర్‌లతో కూడిన ధర్మాసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనుంది. -
సీఏఏపై స్టేకి సుప్రీంకోర్టు నో
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం వాదన వినకుండా ఈ చట్టంపై స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. అలాగే, సీఏఏకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందించేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి నాలుగు వారాల గడువునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లను పరిశీలించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యుల «రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. అదే సమయంలో.. సీఏఏపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరపరాదంటూ అన్ని హైకోర్టులనూ ఆదేశించింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ అమలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లు అందులో కోరారు. ఈ చట్టానికి అనుకూలంగా కూడా కొందరు పిటిషన్లు వేశారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీఏఏ అమలుపై స్టే విధించాలనీ, ఎన్పీఆర్ను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే సీఏఏపైనా, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) అమలుపైనా దాఖలైన అన్ని పిటిషన్లను నాలుగు వారాల అనంతరం విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. అదికూడా కేంద్రం ప్రతిస్పందన అనంతరమేనని తేల్చి చెప్పింది. అస్సాం, త్రిపురలకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ‘సీఏఏ విషయంలో అస్సాం పరిస్థితి భిన్నమైంది. అస్సాంలో గతంలో పౌరసత్వానికి కటాఫ్ మార్చి 24, 1971 అయితే, సీఏఏ తర్వాత ఇది డిసెంబర్ 31, 2014’కి పొడిగించారు’అని ధర్మాసనం పేర్కొంది. సీఏఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లలో 60 కాపీలు మాత్రమే ప్రభుత్వానికి అందినట్లు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. మిగిలిన అన్ని అభ్యర్థనలపై స్పందించేందుకు సమయం కావాలని ఆయన కోరారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, ఆర్జేడీ నాయకులు మనోజ్ షా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవా మోయిత్రా, జమైత్ ఉలేమా–ఇ– హింద్, ఏఐఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఒవైసీ సహా అనేక మంది సీఏఏని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. -
దిశ నిందితుల ఎన్కౌంటర్: సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తునకై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా ఈ కేసు విచారణకై విశ్రాంత న్యాయమూర్తులను సూచించాలని ప్రతివాదులకు సూచించింది. దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. రిటైర్డు న్యాయమూర్తితో ఈ కేసు దర్యాప్తు పరిశీలిస్తామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీల జాబితాను ప్రతివాదులకు ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.(చదవండి: అది బూటకపు ఎన్కౌంటర్) ఈ సందర్భంగా.. ‘ఎన్కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టు చూసుకుంటుంది.. ఎన్కౌంటర్ వెనుక నిజాలను సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి వెలికితీస్తారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయమేమిటి’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ నుంచే సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఎన్కౌంటర్ కేసు పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి పీవీ రెడ్డిని సంప్రదించగా.. ఆయన ఇందుకు నిరాకరించారని సీజేఐ జస్టిస్ బాబ్డే తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి.. ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలని కోర్టుకు విన్నవించారు. తమ అభిప్రాయం వినకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరారు. దీంతో దర్యాప్తునకై సలహాలు, సూచలనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం... విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్లను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చిన విషయం తెలిసిందే. సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ బృందంతో విచారణ జరిపించాలని విన్నవించారు. -
ఎన్కౌంటర్; సీజే కీలక వ్యాఖ్యలు
జోధ్‌పూర్: దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం అంటే పగ తీర్చుకోవడం కాదని, పగతో శిక్షలు విధించకూడదని ఆయన అన్నారు. సత్వర న్యాయం అనేది కరెక్ట్ కాదని, పగతో ఎటువంటి న్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ హైకోర్టు కొత్త భవన ప్రారంభోత్సవంలో శనివారం జస్టిస్ బాబ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు పాత చర్చలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. నేర న్యాయవ్యవస్థను మరింత కఠినతరం చేయాల్సిన అవసరముంద’ని ఆయన నొక్కి చెప్పారు. ప్రతీకారంతో జరిగేది న్యాయం కాదని, న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోకూడదని జస్టిస్ బాబ్డే అన్నారు. హైదరాబాద్ ఎన్కౌంటర్ గురించి ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దిశ హత్య కేసులో నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్‌ను మెజారిటీ ప్రజలు హర్షించడం పట్ల న్యాయకోవిదులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి.. ‘దిశ’ తిరిగిన న్యాయం ‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలి’ మహిళలపై దాడులు: కేంద్రం కీలక ఆదేశాలు మహబూబ్‌నగర్ ఆస్పతిలో ఎన్హెచ్ఆర్సీ బృందం ఉన్నావ్ బాధితురాలి మృతి: వెల్లువెత్తిన నిరసనలు -
సీజేఐగా జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆంగ్లంలో దేవుడి పేరున ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన.. వీల్‌చైర్‌లో ఆ కార్యక్రమానికి వచ్చిన తన తల్లికి పాదాభివందనం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య, కొందరు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, టీఎస్.ఠాకూర్, జేఎస్.కెహార్ హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బాబ్డే సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. 2021 ఏప్రిల్ 23 వరకు మొత్తం 17 నెలల పాటు జస్టిస్ బాబ్డే ఈ పదవిలో కొనసాగుతారు. నూతన సీజేఐకి నెటిజన్ల ప్రశంసలు ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ బాబ్డే వీల్‌చైర్‌లో వచ్చిన తన మాతృమూర్తి(92)కి పాదాభివందనం చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది. తల్లికి జస్టిస్ బోబ్డే పాదాభివందనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు ఆయన్ను మెచ్చుకున్నారు. -
అయోధ్య కేసు : అంతిమ తీర్పులో ఆ ఐదుగురు
సాక్షి, న్యూఢిల్లీ : శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదేసమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసు తుది విచారణలో భాగమైన రాజ్యంగ ధర్మాసనంలోని న్యాయమూర్తుల వివరాలు మీకోసం.. ⇔ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబర్ నియమితులయ్యారు. అస్సాంకు చెందిన గొగోయ్ ఈశాన్య రాష్ట్రాల నుంచి సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. గౌహతి హైకోర్టు, పంజాబ్ హరియాణా హైకోర్టులో ఆయన సీజేగా పనిచేశారు. 2012లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్నార్సీ వంటి కేసుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ⇔ జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే : సీజేఐ రంజన్ గొగోయ్ రిటైర్మెంట్ తర్వాత సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బాబ్డే సీజేఐగా 18 నెలల పాటు కొనసాగనున్నారు. ఆయన 2000 ఏడాదిలో బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా పనిచేశారు. 2002లో మధ్యప్రదేశ్ సీజేగా నియమితులయ్యారు. 2013లో సుప్రీం న్యాయమూర్తిగా వచ్చారు. బాబ్డే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. ⇔ జస్టిస్ డీవై చంద్రచూడ్ : సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలంపాటు పనిచేసిన వైవీ చంద్రచూడ్ తనయుడు. డీవై చంద్రచూడ్ 2016లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో బాంబే హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు సీజేగా పనిచేశారు. వ్యభిచార చట్టం మరియు గోప్యత హక్కు వంటి కీలక కేసులో వాదనలు విన్నారు. ⇔ జస్టిస్ అశోక్ భూషణ్ : 1970 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అప్పటి నుంచే అయోధ్య వివాదంపై పలు దశల్లో పనిచేశారు. అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేశారు. అదే కోర్టుకు 2001లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో కేరళ హైకోర్టులో పనిచేశారు. కొన్ని నెలలపాటు కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ⇔ జస్టిస్ అబ్దుల్ నజీర్ : 1983లో అడ్వొకేట్‌గా కెరీర్ ప్రారంభించారు. కేరళ హైకోర్టులో 20 ఏళ్ల పాటు సేవలందించారు. 2003లో కేరళ హైకోర్టు అదనపు జడ్జిగా పనిచేశారు. 2004లో పూర్తి స్థాయిలో కేరళ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ట్రిపుల్ తలాక్ వాదనలు విన్న బెంచ్‌లో సభ్యుడు. -
జడ్జీలపై కథనాలు బాధించాయి: జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల తీర్పులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై కాబోయే ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే(63) 18న బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో కొన్ని కథనాలు జడ్జీల తీర్పులను తప్పుపట్టడంతో ఆగకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంటున్నాయి. అలాంటి వేధింపుల అనుభవం నాకు కూడా కలిగింది. న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలను పరువు నష్టం కింద కూడా భావించవచ్చు. అయితే, ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు కూడా తెలియడం లేదు. ఏదైనా చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కదా’అని వ్యాఖ్యానించారు. కేసుల విచారణ సకాలంలో జరగాలన్నారు. లేకుంటే నేరాలు పెరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు దిగజారుతాయని పేర్కొన్నారు. -
కొలీజియం నిర్ణయాల్లో గోప్యత అవసరమే
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియంలో జరిగే చర్చలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. జడ్జీలుగా నియమించాలని సిఫారసు చేసేందుకు కొలీజియం తిరస్కరించిన వారికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను వెల్లడించనక్కరలేదన్నారు. ఈ మేరకు బుధవారం పీటీఐ వార్తాసంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నవంబర్ 18న సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. కేవలం సమాచారం తెలుసుకోవాలన్న పౌరుల కోరిక తీర్చడం కోసం వ్యక్తుల ప్రతిష్టకు సంబంధించిన విషయాన్ని బహిర్గత పరచడం సరికాదని తన అభిప్రాయమని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరు. న్యాయమూర్తులిచ్చే తీర్పులపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కూడా జస్టిస్ బాబ్డే తప్పుపట్టారు. అలాంటి విమర్శలతో చాలామంది న్యాయమూర్తులు ఆవేదన చెందుతుంటారన్నారు. ‘ఉదాహరణకు.. ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంజడ్జీగా పదోన్నతి కల్పించాలనుకుని, ఆ తరువాత పరిశీలనలో తమకందిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు జడ్జీగా ఆయన సరికాదని కొలీజియం నిర్ణయిస్తుంది. ముందుగా, ఆయన పేరును పరిశీలించడం ఎందుకు? ఆ తరువాత పదోన్నతికి పనికిరాడని నిర్ణయించి, ఆ విషయాన్ని బహిర్గం చేయడం ఎందుకు? ఆ జడ్జీ ఆ తరువాత కూడా ఆ హైకోర్టులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కదా! అతనికి అది ఇబ్బందికరంగా ఉండదా?’ అని ప్రశ్నించారు. వారిని బాధపెట్టడం సరికాదన్నారు. -
తదుపరి సీజేఐగా బాబ్డే పేరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కేంద్రానికి లేఖ రాశారని అధికారులు తెలిపారు. సీనియారిటీ పరంగా ఎస్ఏ బాబ్డేను తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర చట్టం, న్యాయ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 3న 46వ సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రంజన్‌గొగోయ్ బాబ్డే పేరును ప్రతిపాదిస్తూ లేఖ రాశారు. ఒకవేళ జస్టిస్ బాబ్డే పేరు ఖరారైతే ఆయన 2021 ఏప్రిల్ 3 వరకు అంటే 17 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. అనంతరం సీనియారిటీ పరంగా జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు వరుస క్రమంలో ఉన్నారు. ప్రస్తుతం జస్టిస్ గొగోయ్ పంపిన లేఖను న్యాయ శాఖ నిపుణులు పరిశీలించి ప్రధాన మంత్రికి అందజేస్తారు. అనంతరం ప్రధాన మంత్రి ఈ పదవి గురించి రాష్ట్రపతికి సలహాలు ఇస్తారు. అధికారిక నియామక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న జడ్జీలలో, సీనియర్ జడ్జీని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. -
అబార్షన్ కు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలన్న ఓ మహిళ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కడుపులోని పిండం ‘డౌన్ సిండ్రోమ్’తో బాధపడుతోందని, కాబట్టి అబార్షన్ కు అనుమతించాలని మహారాష్ట్రకు చెందిన మహిళ కోర్టును కోరింది. అయితే, ఈ విషయంలో గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి ఎలాంటి హాని ఉండదంటూ మెడికల్ బోర్డు నివేదిక సమర్పించింది. బిడ్డకు మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యుల బృందం తేల్చిందని మంగళవారం కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎల్ఎన్ లు వ్యాఖ్యానించారు. -
పేరుకు ముందు పద్మశ్రీ వాడొద్దు
* మోహన్‌బాబుకు సుప్రీం కోర్టు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ఇచ్చే పద్మ పురస్కారాలను పేరుకు ముందు వాడరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతికి తిరిగి అప్పగించేలా కేంద్ర హోం శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఫిబ్రవరిలో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాల నుంచి ఉపశమనం కోరుతూ మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘పద్మశ్రీని పేరుకు ముందు వాడడం తప్పు కదా? ఎందుకు వాడుతున్నారు? ఎక్కడా పేరుకు ముందు వాడకూడదు. చివరికి ఇంటి ముందు నేమ్ ప్లేట్‌పై కూడా వాడకూడదు’ అని జస్టిస్ దత్తు వ్యాఖ్యానించారు. పద్మశ్రీని ఇకపై పేరుకు ముందు వాడబోమని, సినిమాల్లో వాడి ఉంటే తొలగిస్తామని ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను తిరిగి ఏప్రిల్ 17కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.