
దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
జోధ్‌పూర్: దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం అంటే పగ తీర్చుకోవడం కాదని, పగతో శిక్షలు విధించకూడదని ఆయన అన్నారు. సత్వర న్యాయం అనేది కరెక్ట్ కాదని, పగతో ఎటువంటి న్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ హైకోర్టు కొత్త భవన ప్రారంభోత్సవంలో శనివారం జస్టిస్ బాబ్డే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు పాత చర్చలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. నేర న్యాయవ్యవస్థను మరింత కఠినతరం చేయాల్సిన అవసరముంద’ని ఆయన నొక్కి చెప్పారు. ప్రతీకారంతో జరిగేది న్యాయం కాదని, న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోకూడదని జస్టిస్ బాబ్డే అన్నారు. హైదరాబాద్ ఎన్‌కౌంటర్ గురించి ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దిశ హత్య కేసులో నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్‌ను మెజారిటీ ప్రజలు హర్షించడం పట్ల న్యాయకోవిదులు ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి..
‘దిశ’ తిరిగిన న్యాయం
‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలి’
మహిళలపై దాడులు: కేంద్రం కీలక ఆదేశాలు