సీఏఏపై స్టేకి సుప్రీంకోర్టు నో | Supreme Court Refuses To Stay Citizenship Act | Sakshi
Sakshi News home page

సీఏఏపై స్టేకి సుప్రీంకోర్టు నో

Published Thu, Jan 23 2020 4:14 AM | Last Updated on Thu, Jan 23 2020 7:45 AM

Supreme Court Refuses To Stay Citizenship Act - Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం వాదన వినకుండా ఈ చట్టంపై స్టే విధించేది లేదని స్పష్టం చేసింది. అలాగే, సీఏఏకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందించేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి నాలుగు వారాల గడువునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లను పరిశీలించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యుల «రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. అదే సమయంలో.. సీఏఏపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరపరాదంటూ అన్ని హైకోర్టులనూ ఆదేశించింది.

సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ అమలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లు అందులో కోరారు. ఈ చట్టానికి అనుకూలంగా కూడా కొందరు పిటిషన్లు వేశారు. సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సీఏఏ అమలుపై స్టే విధించాలనీ, ఎన్పీఆర్‌ను వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే సీఏఏపైనా, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌(ఎన్పీఆర్‌) అమలుపైనా దాఖలైన అన్ని పిటిషన్లను నాలుగు వారాల అనంతరం విచారించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. అదికూడా కేంద్రం ప్రతిస్పందన అనంతరమేనని తేల్చి చెప్పింది. అస్సాం, త్రిపురలకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని కోర్టు వెల్లడించింది. 

‘సీఏఏ విషయంలో అస్సాం పరిస్థితి భిన్నమైంది. అస్సాంలో గతంలో పౌరసత్వానికి కటాఫ్‌ మార్చి 24, 1971 అయితే, సీఏఏ తర్వాత ఇది డిసెంబర్‌ 31, 2014’కి పొడిగించారు’అని ధర్మాసనం పేర్కొంది. సీఏఏ రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లలో 60 కాపీలు మాత్రమే ప్రభుత్వానికి అందినట్లు కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే.వేణుగోపాల్‌ ధర్మాసనానికి తెలిపారు. మిగిలిన అన్ని అభ్యర్థనలపై స్పందించేందుకు సమయం కావాలని ఆయన కోరారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ నాయకులు జైరాం రమేష్, ఆర్జేడీ నాయకులు మనోజ్‌ షా, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహూవా మోయిత్రా, జమైత్‌ ఉలేమా–ఇ– హింద్, ఏఐఎంఐఎం నాయకులు అసదుద్దీన్‌ ఒవైసీ సహా అనేక మంది సీఏఏని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement