
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై అధికారులు జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించకుండా ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని ముందస్తుగా ప్లాన్ వేసుకుని చేసే అవకాశం ఉందని, అలాంటప్పుడు అధికారులకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఎన్‌ఎస్‌ఏ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలు, ఢిల్లీలో ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒకవేళ ఆదేశిస్తే.. వ్యవస్థ గందరగోళంగా తయారవుతుందని అభిప్రాయపడింది.
హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోండి
సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలు, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటం పేరుతో హింసకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని 154 మంది ప్రముఖులతో కూడిన బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. కొన్ని రాజకీయ శక్తులు హింసాయుత నిరసనకారులకు సహాయం చేస్తున్నారని బృందానికి నేతృత్వం వహించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) చైర్మన్ జస్టిస్ పెర్మాడ్ కోహ్లి ఆరోపించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తుల పట్ల ఆందోళనచెందుతున్నామన్నారు. రాష్ట్రపతికి సమర్పించిన మెమొరాండంపై 11 మంది హైకోర్టు జడ్జిలు, 72 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 56 మంది రక్షణ శాఖ మాజీ ఉన్నతాధికారులు, మేధావులు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment