national security act
-
అమృత్‌పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్‌పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్‌పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
అమృత్‌పాల్‌కు ఐఎస్ఐ లింకులు!
చండీగఢ్: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్‌పాల్‌సింగ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్ సింగ్ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) ఏర్పాటుకు దల్జీత్ ప్రయత్నిస్తున్నట్లు తేలింది. మరోవైపు అమృత్‌పాల్ దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా ఉండగా అతనికి ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు. ‘‘భారత్‌లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్ పెడ్లర్ల మద్దతుంది. అమృత్‌పాల్ వాడే మెర్సిడెజ్ కారు రావెల్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్‌దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్‌ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు. ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్‌పాల్ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్ సింగ్ సహా ఐదుగురు ఆదివారం అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు పెట్టారు. భారత కాన్సులేట్‌పై దాడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తానీ అనుకూలవాదులు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆవరణలో ఖలిస్తానీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బ్రిటన్‌లో లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీవాదులు తొలగించిన ఘటనపై కేంద్రం తీవ్ర నిరసన తెలిపింది. -
సహకరిస్తే భారీగా నగదు ఇస్తాం.. ప్రజలకు చైనా బంపరాఫర్
National Security' Tip-Offs: చైనా సంచలన ప్రకటన చేసింది. తన పౌరులను జాతీయ భద్రతకు సహకరించాల్సిందిగా అభ్యర్థించింది. ఇలా చేస్తే పౌరులకు సుమారు రూ. 11 లక్షల రివార్డును, సర్టిఫికేట్లను అందజేస్తానని చెప్పింది. జాతీయ భద్రతకు మద్దతిచ్చేలా.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి సమాచారం ఇస్తే పౌరులకు మంచి రివార్డులు అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు నేరాలను నివారించడం లేదా ఏదైనా కేసు పరిష్కరించడంలో సహకరించి మంచి తెగువ చూపించనవారికి పెద్ద మొత్తంలో నగదు, సర్టిఫికేట్లు ఇస్తామని తెలిపింది. ఇది ఒక రకంగా జాతీయ భద్రతకు సహకరించేలా పౌరుల్లోని ధ్యైర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని సమీకరించే చర్యగా పేర్కొనవచ్చు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా ఉల్లంఘనల గురించి సమాచారం అందించినవారికి మంచి నగదు బహుమతులను అందిస్తోంది. అయితే.. ఇప్పుడు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ పౌరులందరూ ఆచరించేలా జాతీయ భద్రతకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండమని బీజింగ్ తమ దేశా ప్రజలకు సూచించింది. చైనా మీడియా సంస్థలు కూడా ప్రజలను మన మధ్య ఉండే గూఢచారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. మన మధ్యే గూఢచారులుగా తిరిగే వాళ్లు ఎలా ఉంటారో కూడా సూచనలిచ్చింది. ఈ మేరకు చైనా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ జాతీయ భద్రతా ఉల్లంఘనల అనుమానంతో 2020లో నిర్బంధించింది ఐతే ఆమెను నిర్బంధించిన సమయంలో వచ్చిన ఆరోపణల గురించి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందా లేక ప్రతికారం తీర్చుకుంటుందా అనే ఊహాగానాలకు తెరలేపింది. అలాగే ఆస్ట్రేలియాలో జన్మించిన చైనీస్ రచయిత యాంగ్ జున్ గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు. హాంకాంగ్ నగరంలో చెలరేగిన హిసాత్మక ప్రజాస్వామ్య అనుకూల నిరసనల అసమ్మతిని తొలగించడానికి చైనా 2020లో విధించిన జాతీయ భద్రతా చట్టం ఉపయోగపడింది. అప్పటి నుంచి చైనా జాతీయ భద్రతను మరింత పటిష్టంగా ఉంచుకునే దిశగా గట్టి చర్యలు తీసుకుంటోంది. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
జాతరలో కీచకపర్వం.. కొరడా ఝుళిపించిన ఖాకీలు
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. జాతరకు వెళ్లిన గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. ఆ కీచకులను గుర్తించి జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు ఖాకీలు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా.. వైరల్ అయిన ఓ వీడియోను సుమోటాగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం పదిహేను మంది నిందితుల్లో.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్ఎస్ఏ (National Security Act) కింద కేసు నమోదు చేశారు. వాళ్లను అరెస్ట్ చేసి.. రోడ్ల వెంబడి నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వాళ్ల తల్లిదండ్రుల్ని పిలిపించి.. వాళ్ల సమక్షంలోనే ఘటన గురించి వివరించి చెప్పారు. ఇక మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మార్చి 11వ తేదీన అలిరాజ్పూర్ జిల్లా సోన్వా రీజియన్ వాల్పూర్ గ్రామంలో భగోరియా జాతర జరిగింది. ఈ జాతరకు వెళ్లిన ఇద్దరు గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు. అంతటితో ఆగకుండా ఆ మృగచేష్టలను వీడియో తీసి వైరల్ చేశారు. సాయం కోసం ఆ యువతులు కేకలు వేసినా.. జనాలెవరూ వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం పదిహేను నిందితులు.. ధార్, అలిరాజ్పూర్ జిల్లాలకు చెందినవాళ్లుగా గుర్తించారు. ⚡️Distressing Video A tribal woman molested in broad daylight by saffron-clad goons during a fair in Madhya Pradesh, India.pic.twitter.com/lTZKLxVVwF — Ahmer Khan (@ahmermkhan) March 13, 2022 అయితే పోలీస్ స్టేషన్ గడప తొక్కడం ఇష్టం లేని ఆ యువతుల కుటుంబాలు.. ఘటనపై ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు.. బాధితుల కుటుంబాలకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన లేకపోవడంతో.. వాళ్ల కోసం వెతికారు. బాధితుల జాడ లేకపోవడంతో స్వయంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసుకున్నారు. నరేంద్ర దావర్, విశాల్ కియాదియా, దిలీప్ వస్కెల్, మున్నా భీల్.. ఇలా ప్రధాన నిందితులు నలుగురు ముప్ఫై ఏళ్లలోపు వాళ్లే కావడం విశేషం. ఈ నలుగురిని ప్రస్తుతం ఉజ్జయిని జైలుకు తరలించినట్లు అల్జిపూర్ ఎస్పీ మనోజ్ సింగ్ వెల్లడించారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఆయన. -
హాంకాంగ్‌లో మీడియాపై... జాతీయ భద్రతా చట్టం ప్రయోగం
హాంకాంగ్: చైనా పాలకుల కర్కశత్వానికి మరో తార్కాణం. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య గళాలను అణచివేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని తొలిసారిగా మీడియాపై ప్రయోగించారు. యాపిల్ డైలీ అనే పత్రికకు చెందిన ఐదుగురు ఎడిటర్లు, కార్యనిర్వాహకులను పోలీసులు ఈ చట్టం కింద గురువారం అరెస్టు చేశారు. ఈ పత్రికలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ వార్తలను ప్రచురిస్తుంటారు. హాంకాంగ్‌కు చైనా చెర నుంచి విముక్తి లభించాలని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కావాలని యాపిల్ డైలీ గట్టిగా నినదిస్తోంది. చైనా, హాంకాంగ్‌పై ఇతర దేశాలు ఆంక్షలు విధించేలా కుట్ర పన్నడమే ధ్యేయంగా 30కిపైగా ఆర్టికల్స్‌ను ఈ పత్రిక ప్రచురించినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వెల్లడించారు. -
ఫ్రెంచ్ విప్లవ నినాదం విలువ కోల్పోనుందా?
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కొత్త అంతర్జాతీయ భద్రత బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం– ఇకముందెవ్వరూ పోలీసుల తాలూకు దృశ్యా లను చిత్రీకరించి, వారి శారీరక లేదా మానసిక స్థితిని దెబ్బతీయరాదు. అంటే పోలీసులు విధి నిర్వహణలో నిబంధనలను అతిక్ర మించి హింసాత్మకంగా ప్రవర్తించినా, పాత్రికేయులు గానీ, ప్రజలు గానీ వీడియోల చిత్రీకరణలు చేసి ప్రచా రంలో పెట్టరాదు. అంతిమంగా ఇది పోలీసులకు రక్షణ కల్పించే పేరిట, ప్రజలపట్ల వారు అతిగా వ్యవహ రించడానికి లైసెన్స్ ఇచ్చే విధంగా ఉంది. కాగా ఈ బిల్లు చట్టం కావడానికి వ్యతిరేకంగా – ఫ్రెంచ్ ప్రజలు, పాత్రికేయులు రోడ్లెక్కారు. అది పాత్రి కేయుల హక్కులను, ఫ్రెంచ్ విప్లవ నినాదమైన ‘లిబర్టీ’ (స్వేచ్ఛ)ని కాలరాసే విధంగా ఉందని నినది స్తున్నారు. మాటల్లో తప్పితే చేతల్లో స్వేచ్ఛ కనబడని పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి కార్ల్ మార్క్స్ 19వ శతాబ్దంలోనే చెప్పివున్నాడు. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవ నినాదం ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’. దీనిని మార్క్స్– పెట్టుబడిదారులు ‘స్వేచ్ఛ, సమా నత్వం, సోదరభావం’ అని నినదిస్తారు కానీ నిజానికి ఆ నినాదసారం ‘పదాతి దళం, ఫిరంగి దళం, అశ్విక దళం’ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం, ఫ్రాన్స్ నల్లచట్టం పరిస్థితి నిరూపి స్తుంది ఇదే. గత అనేక సంవత్సరాలుగా ఫ్రెంచ్ ప్రజలు, ప్రపంచంలోని అనేక ధనిక దేశాల ప్రజల్లా గానే పదే పదే నిరసనలకూ, వీధి పోరాటాలకూ దిగుతున్నారు. ఈ క్రమంలో, పరిస్థితి మరింత చేయి జారిపోతున్నట్లు– పాలకవర్గాలు భావిస్తున్నాయి. వ్యవస్థలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అసమాన తలు– కోవిడ్ అనంతర కాలంలో మరింత తీవ్రరూపం దాల్చాయి. దీంతో అటు ఫ్రాన్స్, ఇటు ఇతర ధనిక దేశాల్లోని పాలకులు కూడా తమ ముసుగులను తీసే స్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రజానీకం మీద బహిరంగం గానే దాడికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తమ దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక పునాదులకు మూల మైన ఫ్రెంచ్ విప్లవ నినాదాన్ని కూడా పాలకులు పాతర పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఈ అసలు రూపాన్ని రష్యా విప్లవ నేత లెనిన్ కొన్ని ప్రశ్నల రూపంలో వివరించారు. మొదటగా, ‘స్వేచ్ఛ’ అనే దానిని వివరిస్తూ, స్వేచ్ఛ ఎవరికీ, ఎవరి నుంచీ అనే ప్రశ్న వేశారు. స్వేచ్ఛ అనే పదాన్ని వాస్తవ జీవితంతో సంబంధం లేకుండా వాడలేమనీ, అనివార్యంగా ఇది రెండు భిన్న వర్గాలను దృష్టిపథంలోకి తెస్తుందనీ ఆయన ఉద్దేశం. రెండు వర్గాలు లేకుండా, ఒకరిపై ఒకరి పెత్తనాలు లేకుండా– విడిగా స్వేచ్ఛ అంటూ ఉండదనేది ఇక్కడ గమనార్హం. ఇక్కడ ‘సమానత్వం ఎవరికీ, ఎవరినుంచీ’ అని లెనిన్ ప్రశ్నిస్తాడు. సమా నత్వం అనే నినాదమే అసమానుల అస్తిత్వాన్ని సూచి స్తోంది. అసమానులు (ఆర్థిక అసమానతలతో సహా) లేని సమాజంలో, సమానత్వం అనే అంశం తాలూకు అస్తిత్వమే ఉండదు. ఇక ఈ మాటల్లో చివరిది ‘సోదర భావం’. ‘సోదరభావం ఎవరెవరి మధ్య’ అని కూడా లెనిన్ ప్రశ్నించాడు. వర్గాలుగా విడిపోయిన సమా జంలో స్వేచ్ఛను కోల్పోయిన వారికీ, ఆర్థిక అసమాన తల కింద కునారిల్లుతున్న బడుగులకూ– తమను అణ చివేసి, తమ శ్రమశక్తితో ఆర్థికంగా ఎదిగిన పై వర్గాల వారితో సోదరభావం సాధ్యం కాదనేది సారాంశం. ఈ కోణం నుంచి ఫ్రాన్స్, ఇతర దేశాల పరిణామా లను గమనిస్తే, వాస్తవంలో జరుగుతున్నది ఏమిటో అర్థమవుతుంది. అంతర్జాతీయంగా ఫ్రెంచ్ విప్లవ నినాదంతో ప్రభావితం అయ్యామని చెప్పుకుంటున్న వివిధ దేశాలలో ఈ నినాదం తాలూకు హక్కులూ, ఆ హక్కులకు హామీ ఇచ్చే ప్రాథమిక చట్టాలూ కూడా వారికి భరించనలవికానివిగా తయారయ్యాయన్న మాట. ఇగిరి ఆవిరైపోతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు అంతిమ ఫలితం ఇది. నిన్నటివరకూ లాగా, కనీస స్థాయిలో ప్రజలకు రాయితీలు ఇచ్చిన స్థితి కూడా పోయి, ఇక నేడు ప్రజల కడగండ్లు పెరుగుతున్న కాలంలో తాము చేసిన చట్టాలను తామే భరించలేని స్థితికి పాలకులు చేరుకున్నారు. వివిధ దేశాలలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతల వల్ల రానున్న రోజుల్లో ఫ్రాన్స్ తాలూకు ఈ ‘అంతర్జాతీయ భద్రతా బిల్లు’ విశ్వవ్యాప్త మైనా ఆశ్చర్యంలేని పరిస్థితి. నాడు పెట్టుబడిదారీ ప్రపంచానికి ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’ నినాదాన్ని అందించిన ఫ్రాన్స్ నుంచి మళ్ళీ మరింత ఉధృత రూపంలో ఇటువంటి చట్టం మొలకలెత్తడం కాలం తాలూకు వైచిత్రి కావచ్చు! వ్యాసకర్త: డి. పాపారావు, సామాజిక విశ్లేషకులు మొబైల్: 98661 79615 -
ఈ తీర్పు శిరోధార్యం
దేశ భద్రతకు ముప్పుతెచ్చే నేరగాళ్లను అదుపు చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు మన దగ్గర దుర్వినియోగమవుతున్నాయని చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్ ఖాన్ నిర్బంధం తాజా ఉదాహరణ. ఆయనను జాతీయ భద్రతా చట్టం(నాసా) కింద అరెస్టు చేయడం చెల్లదని, తక్షణం విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా డాక్టర్ కఫీల్ మంగళవారం నిర్బంధం నుంచి విముక్తులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాథుర్, జస్టిస్ సౌమిత్రదయాళ్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులను ఉద్దేశించి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన చేసిన ప్రసంగం ఈ చట్టం ప్రయోగానికి ప్రభుత్వం చెప్పిన కారణం. కానీ ఆయన ప్రసంగంలో ఎంపిక చేసుకున్న కొన్ని భాగాల ఆధారంగా కేసు పెట్టడం కాక మొత్తంగా దాని నిజమైన ఉద్దేశమేమిటో గ్రహించాలని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. అందులో హింసను లేదా విద్వేషాన్ని ప్రోత్సహించే అంశాలేమీ లేవన్నదే వారి మాట. మూడేళ్లక్రితం గోరఖ్‌పూర్ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజెన్ సిలెండర్ల కొరత కారణంగా వందలాదిమంది పిల్లలు మృత్యువాత పడినప్పటినుంచి డాక్టర్ కఫీల్ ఖాన్ వార్తల్లోకెక్కారు. ఆ ఉదంతం సమయంలో ఆయన చొరవ తీసుకుని దాదాపు 500 సిలెండర్లు లభ్యమయ్యేలా చూడటం వల్ల అనేకమంది పసిపిల్లల ప్రాణాల్ని కాపాడటం సాధ్యమైందని అప్పట్లో ఇతర వైద్యులు చెప్పారు. సిలెండర్లను తీసుకురావడంలో డాక్టర్ ఖాన్‌కు తోడ్పడిన సశస్త్ర సీమాబల్ సిబ్బంది సైతం ఆ మాటే అన్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేసిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ముఖ్య కార్యదర్శి హిమాన్షు కుమార్ సారథ్యంలోని అధికారుల బృందం కూడా ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆక్సిజెన్ సిలెండర్ల నిర్వహణ ఆయనకు సంబంధించింది కాదని... కనుక ఆయన్ను దోషిగా చెప్పడం సాధ్యం కాదని వివరించింది. ఈలోగా డాక్టర్ కఫీల్ జైలుకెళ్లక తప్పలేదు. నేరగాళ్లు కొత్త ఎత్తులు ప్రయోగించినప్పుడు, దేశానికి కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పుడు వాటిని అరికట్టడానికి సమర్థవంతమైన చట్టం తీసుకురావడం అవసరమే. కానీ ఇతరేతర ఉద్దేశాలతో వాటిని ఇష్టానుసారం ప్రయోగించడం వల్ల అమాయకులు ఇబ్బందుల పాలవుతారు. ఇందిరాగాంధీ హయాంలో 1971లో తీసుకొచ్చిన ఆంతరంగిక భద్రతా(మీసా) చట్టం అత్యవసర పరిస్థితి కాలంలో ఎంతో దుర్వినియోగమైంది. ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతలుగా వున్నవారెందరో అప్పుడు జనసంఘ్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ ఆ చట్టం కోరల్లో చిక్కుకున్నారు. 1977 ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన జనతా పార్టీ ఈ అనుభవాలన్నీ గమనించి ఆ చట్టాన్ని రద్దు చేసింది. కానీ మళ్లీ అధికారంలోకొచ్చిన ఇందిరాగాంధీ 1980లో మీసాను మించిన కఠిన నిబంధనలతో తెచ్చిన చట్టమే జాతీయ భద్రతా చట్టం. ఎలాంటి కారణం చూపకుండా 12 నెలలపాటు పౌరులను నిర్బంధించడానికి వీలు కల్పించే ఈ చట్టంపై కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అది దుర్వినియోగమవుతున్నదని ఆరోపణలు వచ్చాయి. ఈ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినా... ఎవరినైనా ఆ చట్టం కింద అక్రమంగా నిర్బంధించారని భావించినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయి. కానీ ఈలోగా ఆ చట్టం కోరల్లో చిక్కుకున్నవారు తమ తప్పేమీ లేకుండా అకారణంగా జైళ్లలో గడపవలసి వస్తున్నది. ఇప్పుడు డాక్టర్ కఫీల్ ఖాన్ కేసు కూడా అటువంటిదే. మొన్న ఫిబ్రవరిలో అరెస్టయ్యాక ఆయన నిర్బంధాన్ని రెండుసార్లు పొడిగించారు. అక్రమ నిర్బంధాల వల్ల కఫీల్ ఖాన్ వంటివారు, వారి కుటుంబసభ్యులు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడతారు. కానీ ప్రభుత్వాలకు, సమాజానికి జరిగే నష్టం అంతకన్నా ఎక్కువే. ప్రభుత్వాల శక్తియుక్తులన్నీ ఇలా అనవసరమైన కేసుల్లో వృథా చేయడం వల్ల సమాజానికి ముప్పుగా పరిణమించే అవకాశమున్న నిజమైన నేరగాళ్లు తప్పించుకునే అవకాశం వుంది. ఇదే ఉత్తరప్రదేశ్‌లో మొన్న జూలైలో పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన వికాస్ దుబే ఉదంతమే అందుకు ఉదాహరణ. ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, తనకు అడ్డొస్తారని అనుమానం వచ్చినవారిని హత్యలు చేస్తూ ఎదిగిన మాఫియా డాన్ దుబే డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిదిమంది పోలీసుల ప్రాణాలు తీశాడు. పోలీసులనే కాదు... 2001లో ఇతగాడు ఏకంగా రాష్ట్ర మంత్రిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుటే ఆయన్ను కాల్చిచంపాడు. జాతీయ భద్రతా చట్టమైనా, మరే ఇతర ముందస్తు నిర్బంధానికి సంబంధించిన చట్టమైనా ప్రయోగించడం సరైందా కాదా అన్నది న్యాయస్థానాలు చూడాలని 2011లో తమిళనాడుకు చెందిన ఒక కేసులో సుప్రీంకోర్టు సూచించింది. లేనట్టయితే వ్యక్తి స్వేచ్ఛకు ముప్పు కలిగే ప్రమాద మున్నదని హెచ్చరించింది. ముందస్తు నిర్బంధాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలైనప్పుడు న్యాయస్థానాలు అన్ని కోణాలను పరిశీలించాలని, సాధారణ చట్టాలతో సరిపెట్టవలసి వచ్చిన సందర్భాల్లో కూడా ఈ కఠినమైన చట్టాలు ప్రయోగించినట్టు భావిస్తే బాధితులకు విముక్తి కలిగించాలని న్యాయస్థానాలకు సూచించింది. వ్యక్తి స్వేచ్ఛను ఎంతో పవిత్రంగా భావించే రాజ్యాంగంలోని 21వ అధికరణ ఉల్లంఘన కాకూడదని హితవు పలికింది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే ఇటువంటి ముందస్తు నిర్బంధ చట్టాలు అమల్లోవుంటాయి. మన దేశంలో నాసా చట్టం ఒక్కటే కాదు... ఇప్పుడు సుధా భరద్వాజ్, వరవరరావు వంటివారిని నిర్బంధించిన యూఏపీఏ చట్టం కూడా అత్యంత కఠినమైనదే. నిర్బంధ చట్టాల ప్రయోగంలో ప్రభుత్వాలు అత్యంత జాగురూకతతో మెలగాలన్నది డాక్టర్ కఫీల్ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు సారాంశం. యోగి ప్రభుత్వం దీన్ని గమనించాలి. -
హాంకాంగ్‌లో మళ్లీ చిచ్చు
జూలై నెల సమీపిస్తున్నదంటే హాంకాంగ్ వాసులు హడలెత్తుతారు. 1997 జూలై నెలలో ఆ నగరంపై బ్రిటన్‌కున్న లీజు ముగిసి, అది చైనాకు స్వాధీనమైంది. ఏటా ఆ వార్షికోత్సవం సమయానికల్లా హాంకాంగ్‌లో ఏదో ఒక చిచ్చు రేపడం చైనాకు ఆనవాయితీగా మారింది. ఈసారి అది భద్రతా చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరి గణించే బిల్లును గత నెలలో జనంపైకి వదిలింది. దానిపై ఆందోళనలు రాజుకుంటున్న జాడలు కనిపిస్తుండగానే ఈ భద్రతా చట్టం ప్రతిపాదన బయటికొచ్చింది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం అవసరమంటోంది చైనా. ఆ దేశం చెప్పినదానికల్లా తలాడించడం అలవాటైన హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ యధాప్రకారం ఈ చట్టాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన నిరసనలు, ఆందోళనలు ఈ భద్రతా చట్టం పరిధిలోకి రావని, పౌరుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం వాటిల్లదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హాంకాంగ్ వాసులపై ఆంక్షల సంకెళ్లు వుండబోవంటున్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయమంటున్నారు. నెలక్రితం జాతీయ గీతం బిల్లు విషయంలోనూ ఆమె ఈ మాదిరే మాట్లాడారు. ఇరవైమూడేళ్లక్రితం హాంకాంగ్‌ను వెనక్కి తీసుకున్నప్పుడు చైనా చాలా హామీలు ఇచ్చింది. తాము స్వతంత్ర రాజ్యంగా మనుగడ సాగిస్తాం తప్ప, విలీనం కావడానికి ఒప్పుకోబోమని హాంకాంగ్ వాసులు ఆందోళనలకు దిగినప్పుడు నాటి చైనా అధినాయకుడు డెంగ్ షియావో పెంగ్ వారికి అనేక విధాల నచ్చజెప్పారు. చైనాలో తాము అమలు చేస్తున్న విధానాలేవీ హాంకాంగ్‌లో అమలుకాబోవని చెప్పారు. ఆ నగరంలో వచ్చే 50 ఏళ్లపాటు... అంటే 2047 వరకూ పాత విధానాలే పూర్తిగా అమల వుతాయని, దాని స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం రానీయబోమని రాతపూర్వకంగా వాగ్దానం చేశారు. అప్పటివరకూ ‘ఒకే దేశం– రెండు వ్యవస్థల’ విధానం కొనసాగుతుందని చెప్పారు. ఆయనిచ్చిన హామీల ప్రకారం ఆర్థిక, వాణిజ్య, న్యాయ వ్యవహారాల్లో హాంకాంగ్ సొంతంగా నిర్ణయాలు తీసు కోవచ్చు. పాలనా నిర్వహణ, శాసనాధికారం కూడా దానికే ఉంటాయి. కానీ అనంతరకాలంలో చైనా మాట తప్పడం మొదలుపెట్టింది. 2003లో తొలిసారిగా జాతీయ భద్రతా చట్టం ప్రతిపాదన తీసు కొచ్చింది. అప్పట్లో ఆ ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హాంకాంగ్‌లో విదేశీ శక్తులు చొరబడకుండా ఆపడానికే చట్టం తెస్తున్నామని చెప్పినా ఉద్యమకారులు వినలేదు. గత్యంతరం లేని స్థితిలో దాన్ని చైనా ఉపసంహరించుకోవాల్సివచ్చింది. గత మూడేళ్లుగా బాహాటంగానే ప్రవర్తిస్తోంది. పాలనా వ్యవస్థలో వున్న చైనా వ్యతిరేకులను అనర్హులుగా ప్రకటించడం, చైనా వ్యతిరేకులన్న అను మానం కలిగినవారిని కిడ్నాప్ చేయడం వంటివి మొదలయ్యాయి. నిరుడు నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు తీసుకొచ్చారు. అది ఆమోదం పొందివుంటే నేరాలు చేసినవారిని చైనాకు అధికారికంగా అప్పగించడానికి వీలయ్యేది. విశ్వసనీయత అంతంతమాత్రంగా వున్న చైనా న్యాయ వ్యవస్థలో న్యాయం ఎంతో అందరికీ తెలుసు. పైగా వెనకటి కాలం నుంచి వర్తించేలా ఆ సవరణ బిల్లు రూపొం దించారు. ఆ బిల్లుపై చెలరేగిన ఆందోళనల్ని ఎంతగా అణచడానికి ప్రయత్నించినా హాంకాంగ్ పాలక వ్యవస్థకూ, చైనాకూ అసాధ్యమైంది. నయానా భయానా చెప్పి చూసినా ఆ ఉద్యమం చల్లారలేదు సరిగదా అది మరింత ఉధృతంగా కొనసాగింది. చివరకు ఆ బిల్లును వెనక్కు తీసుకుంది. అనంతరం నిరుడు నవంబర్‌లో హాంకాంగ్ పరిధిలోని 18 జిల్లా పాలకమండళ్లకు జరిగిన ఎన్నికల్లో 17 మండళ్లు ప్రజాస్వామ్య అనుకూలవాదుల చేతికి చిక్కడంతోపాటు 452 స్థానాల్లో 390 స్థానాలు లభించాయి. చైనా అనుకూలురకు కేవలం 59 స్థానాలు మాత్రమే వచ్చాయి. పాలకమండళ్లకు పెద్దగా అధికారాలు లేకపోయినా ఆ తీర్పు చైనాకు పెద్ద షాకిచ్చింది. పర్యవసానంగా నేరస్తుల అప్పగింత చట్టాన్ని మించిన కఠిన నిబంధనలతో తాజాగా ఈ చట్టానికి రూపకల్పన చేసింది. ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారితో పోరాడటంలో ప్రపంచమంతా నిమగ్నమైన తరుణంలో చైనా ఇదే అదునుగా భావించి ఈ కఠినమైన చట్టాన్ని జనం నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తోంది. ఇది అమల్లోకొస్తే చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు హాంకాంగ్‌లో తిష్ట వేస్తాయి. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచడానికి పనిచేస్తాయి. హాంకాంగ్ పాలనా వ్యవస్థ, పోలీస్ విభాగం అప్పుడే ఆ చట్టానికి అనుకూ లంగా ప్రచారం మొదలుపెట్టాయి. వారు చెబుతున్న ప్రకారం హాంకాంగ్‌లో ఉగ్రవాదం పెరిగిపోతోందట. దాని స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయట. అలా ప్రక టనలు చేసిందే తడవుగా హాంకాంగ్ పోలీసులకు ఆ నగరంలో తుపాకులు, కొన్ని పేలుడు పదార్థాలు ‘దొరికాయి’. ఉగ్రవాద దాడులకు దిగేవారు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివే వినియోగిస్తుంటారని పోలీస్ చీఫ్ క్రిస్ టాంగ్ చెబుతున్నారు. చట్ట ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న దశలోనే ఇలా తుపాకులు, పేలుడు పదార్థాలు దొరికాయంటే, మున్ముందు ఆ నగరం పరిస్థితేమిటో సులభంగానే అంచనా వేసు కోవచ్చు. హాంకాంగ్‌కు సంబంధించి చట్టాలు చేయదల్చుకున్నప్పుడు వాటికి సంబంధించిన బిల్లుల్ని అక్కడి పాలనా మండలిలో ప్రవేశపెట్టడం రివాజు. ఆ దారిన పోతే వికటిస్తోందని భయపడి ఈసారి చైనా కొత్త మార్గం ఎంచుకుంది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లుపెట్ట బోతోంది. చైనా పాలకులకు రబ్బర్ స్టాంపుగా ఉపయోగపడే ఆ సభలో ఇది ఆమోదం పొందడం ఖాయం. ఇంతవరకూ బిల్లు గురించి స్థూలంగా ఒకటి రెండు ముక్కలు చెప్పడమే తప్ప, దాని పూర్తి పాఠాన్ని చైనా బయటపెట్టలేదు. ఆ పని చేస్తే వ్యతిరేకత మిన్నంటుతుందని దాని భయం. ప్రజా స్వామ్య పరిరక్షణకు గత 23 ఏళ్లుగా నిరంతరం పోరాడుతూ చైనా ప్రయత్నాలను వమ్ము చేస్తూ వచ్చిన హాంకాంగ్ పౌరులు ఈసారి తమ కృషిలో విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాలి. -
చైనా కీలక నిర్ణయం.. హాంకాంగ్‌కు ముగింపు ఇది!
బీజింగ్/వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం రోజురోజుకీ ముదురుతున్న నేపథ్యంలో ఆర్థిక, వ్యాపార కేంద్రంగా భాసిల్లుతున్న హాంకాంగ్‌ను పూర్తిగా తన గుప్పిట్లో బంధించేందుకు చైనా పావులు కదుపుతోంది. జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌లో అమలు చేసే బిల్లుకు సంబంధించిన ప్రతిపాదనలను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. తద్వారా చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలను అణగదొక్కి వాణిజ్య హబ్‌పై మరింత పట్టు సాధించేలా ముందుకు సాగుతోంది. ఈ విషయం గురించి చైనా పార్లమెంట్ అధికార ప్రతినిధి జాంగ్ యేసూయీ మాట్లాడుతూ.. ‘‘హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం’’అమలు చేసేందుకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొలి రోజు సమావేశంలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తద్వారా చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని చైనా పార్లమెంట్ భావిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. హాంకాంగ్‌కు మార్కెట్ ఎకానమీని పటిష్టం చేసేందుకు ఈ అంశం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. (తైవాన్‌పై బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా) హాంకాంగ్‌కు ముగింపు ఇది చైనా తాజా నిర్ణయాన్ని హాంకాంగ్ ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. డ్రాగన్ చర్యలు హాంకాంగ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘హాంకాంగ్‌కు ముగింపు ఇది. ఒక దేశం- రెండు వ్యవస్థలకు చరమగీతం ఇది. ఇలాంటి తప్పులు చేయకండి’’ అంటూ సివిక్ పార్టీ చట్టసభ ప్రతినిధి డెన్నిస్ వోక్ ఆందోళన వ్యక్తం చేశారు. హాంగ్‌కాంగ్ ప్రజలకు బీజింగ్ ఏమాత్రం గౌరవం ఇవ్వడంలేదని మరో నేత తాన్యా చాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మమ్మల్ని సంప్రదించకుండానే ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. అయితే మేం ఎన్నటికీ ఆశావహ దృక్పథాన్ని విడిచిపెట్టం. పోరాడుతూనే ఉంటాం’’అని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఇక హాంగ్ కాంగ్ చివరి బ్రిటీష్ గవర్నర్ క్రిస్ పాటన్..‘‘ పట్టణ స్వయంప్రతిపత్తిపై ఇది హేయమైన దాడి’’ అని మండిపడ్డారు. కొంతమంది చైనా మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.(చైనా చొరబాట్లు.. భారత్‌పై ఆక్రోషం!) అమెరికా స్పందన హాంకాంగ్ పట్ల చైనా వైఖరిపై అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదే గనుక నిజమైతే.. ఆ వివాదంపై మా స్పందన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది’’అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సెనెటర్ పాట్ టూమీ మాట్లాడుతూ.. ‘‘ఇతర దేశాలపై చైనా జోక్యం ఎక్కువవుతోంది. హాంకాంగ్ ఆసియాకు బొగ్గు గని వంటిది’ ’అని పేర్కొన్నారు. చైనా గనుక తన నిర్ణయాన్ని అమలు చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని హెచ్చరించారు. 1997లో అప్పగింత.. బ్రిటన్ తన పాలనలో ఉన్న హాంకాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించింది. ఆ సమయంలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ మినీ రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఇక అందులోని ఆర్టికల్ 23 ప్రకారం చైనా ప్రభుత్వాన్ని ధిక్కరించకూడదు. అయితే గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని వారు సహించలేకపోతున్నారు. ఇక నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన చైనా ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో గతేడాది నిరసనలు మిన్నంటాయి. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్ వింగ్ యాక్టివిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. (‘శరీరాలు నుజ్జునుజ్జు చేసి.. ఎముకలు విరగ్గొడతాం’)) బ్రిటన్ వైపు డ్రాగన్ చూపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై విరుచుకుపడుతున్న అమెరికా.. తమ దేశ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను ఆర్థికంగా దెబ్బతీయాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ఇక అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన డ్రాగన్ దేశం తదుపరి వ్యూహాలతో సమాయత్తమవుతోంది. కంట్లో నలకలా మారిన హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు డ్రాగన్ చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్స్చేంజీల నుంచి తమ కంపెనీలు డీలిస్ట్ అయినట్లయితే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్స్చేంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. (చైనాకు అమెరికా భారీ షాక్..) -
యూపీలో నర్సులపై వెకిలి వేషాలు
న్యూఢిల్లీ/ఘజియాబాద్: బ్లాక్ లిస్ట్‌లో చేర్చి, టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన 960 మంది తబ్లిగీ జమాత్‌కు చెందిన విదేశీ కార్యకర్తల్లో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారని కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. వారితో పాటు, ప్రస్తుతం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉన్న తబ్లిగీ విదేశీ కార్యకర్తల్లో 379 మంది ఇండోనేసియన్లు, 110 మంది బంగ్లాదేశీయులు, 63 మంది మయన్మార్ వారు, 33 మంది శ్రీలంక వారు ఉన్నారని పేర్కొంది. కిర్గిస్తాన్(77), మలేసియా(75), థాయిలాండ్(65), ఇరాన్(24), వియత్నాం(12), సౌదీ అరేబియా(9), ఫ్రాన్స్(3)లకు చెందిన విదేశీ తబ్లిగీ కార్యకర్తల వీసాలను కూడా రద్దు చేశామంది. ఆ 960 మందిలో కజకిస్తాన్, కెన్యా, మడగాస్కర్, మాలి, ఫిలిప్పైన్స్, ఖతార్, రష్యా తదితర దేశాల వారు కూడా ఉన్నారని తెలిపింది. టూరిస్ట్ వీసాపై వచ్చిన వీరిని ఇప్పుడు ఆయా దేశాలకు తిరిగి పంపే ఆలోచన లేదని, వారిపై ఫారినర్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద వీసా నిబంధనలను ఉల్లంఘించిన నేరాల కింద చర్యలు తీసుకోనున్నామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలిల శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘వారిపై చర్యలు ప్రారంభమైన ప్రస్తుత సమయంలో వారిని వెనక్కు పంపే ప్రశ్నే లేదు. ఎప్పుడు పంపిస్తామన్నది నిబంధనలకు లోబడి నిర్ణయిస్తాం’ అన్నారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమాల్లో పాల్గొని తమ దేశాలకు వెళ్లిన 360 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించామని శ్రీవాస్తవ తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తగా 1930 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రారంభించామన్నారు. కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఉన్నాయన్నారు. ► కరోనా, లాక్‌డౌన్‌కు సంబంధించి ఢిల్లీ ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 8800007722ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాలో పర్యటించారు. కరోనా వ్యాప్తిపై సర్వే నిర్వహించారు. యూపీలో నర్సులపై వెకిలి వేషాలు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసుపత్రిలో నర్సులపై తప్పుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ జమాత్ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేసింది. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. నర్సులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్యాంటు వేసుకోకుండా ఆసుపత్రుల్లో తిరిగారని, వెకిలి వ్యాఖ్యలు చేస్తూ, బూతు పాటలు పాడుతూ, వెకిలి చర్యలకు పాల్పడ్డారని, భౌతిక దూరం పాటించలేదని, తామిచ్చే ఔషధాలను తీసుకునేందుకు నిరాకరించారని ఆ ఆరుగురిపై నర్సులు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ప్రమాదమని భావిస్తే ఎన్ఎస్ఏ కింద ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండానే, సంవత్సరం పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. కనౌజ్‌లోని జామామసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు గుమికూడటాన్ని నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ► మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్–19 బాధితుల కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగును క్వారంటైన్ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడి చేసిన నలుగురిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌పై పోరుకు ఆ ఘటనలతో విఘాతం ఆనంద్ విహార్ వద్ద భారీ సంఖ్యలో వలస కార్మికులు గుమికూడటం, నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ యావత్ దేశం కరోనా కట్టడికి చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలిగించాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
అలా ఆదేశాలివ్వలేం..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై అధికారులు జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించకుండా ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని ముందస్తుగా ప్లాన్ వేసుకుని చేసే అవకాశం ఉందని, అలాంటప్పుడు అధికారులకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఎన్ఎస్ఏ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలు, ఢిల్లీలో ఎన్ఎస్ఏ ప్రయోగించకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒకవేళ ఆదేశిస్తే.. వ్యవస్థ గందరగోళంగా తయారవుతుందని అభిప్రాయపడింది. హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోండి సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక నిరసనలు, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటం పేరుతో హింసకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని 154 మంది ప్రముఖులతో కూడిన బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది. కొన్ని రాజకీయ శక్తులు హింసాయుత నిరసనకారులకు సహాయం చేస్తున్నారని బృందానికి నేతృత్వం వహించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) చైర్మన్ జస్టిస్ పెర్మాడ్ కోహ్లి ఆరోపించారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న శక్తుల పట్ల ఆందోళనచెందుతున్నామన్నారు. రాష్ట్రపతికి సమర్పించిన మెమొరాండంపై 11 మంది హైకోర్టు జడ్జిలు, 72 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 56 మంది రక్షణ శాఖ మాజీ ఉన్నతాధికారులు, మేధావులు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు సంతకాలు చేశారు. -
చిన్నారి హత్యోదంతం : సిట్ ఏర్పాటు
లక్నో : పది వేల రూపాయల అప్పు తీర్చలేదన్న కోపంతో.. రెండున్నరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాగ్రహానికి భయపడిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసును త్వరితగతిన విచారణ చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దారుణం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో పోలీసులు నిందితుల మీద జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుందని ఎస్ఎస్పీ ఆకాశ్ కుల్హరి తెలిపారు. ఇప్పటికే శాంపిల్స్‌ను ఆగ్రా ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఇప్పటికే ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అంతేకాక చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాహీద్, అస్లాం అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిపై లైంగిక దాడి జరగలేదని.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని పోలీసులు తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందుతుల మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాల్సిందిగా మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వారికి తెలియకుండా ఈ హత్య జరిగి ఉండదని అతను ఆరోపిస్తున్నాడు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని.. వారిని అరెస్ట్ చేయకపోతే.. తనను కూడా చంపేస్తారని బాలిక తండ్రి ఆరోపించాడు. -
గోవధపై జాతీయ భద్రత చట్టం
లక్నో: గోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ), గ్యాంగ్స్టర్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్కన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. కేంద్రం తెచ్చిన పశువధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
'నిర్భయ' కేసులో బాలనేరస్తుడి విడుదల ఆపేందుకు..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో బాలనేరస్తుడి (జువెనైల్)గా ఉన్న నిందితుడు మరో మూడు వారాల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు. 2012లో అత్యంత కిరాతకంగా విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన అతణ్ని మరికొంతకాలం జైలులోనే ఉంచేందుకు అతనిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టమైన జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే సీనియర్ పోలీసులు అధికారులు న్యాయనిపుణులను కలిసి చర్చించారు. ప్రస్తుతం అతని వయస్సు 21 సంవత్సరాలు. ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ల నిందితుడు అతన్ని ప్రేరేపించాడని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడైన నేపథ్యంలో అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అవకాశముందా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని 12 నెలలపాటు జైలులో ఉంచవచ్చు. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు అతని విడుదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అతని విడుదలను ఆపేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖతోపాటు, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరగా జాతీయ మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు. 'ఇప్పుడు పోలీసులు ఆలోచించడం కాదు చర్యలకు ఉపక్రమించాలి' అని నిర్భయ తండ్రి బద్రినాథ్ మీడియాకు తెలిపారు. నేరగాళ్లకు ఎలాంటి హక్కులు ఉండరాదని పేర్కొన్నాడు. నిర్భయగా పేరొందిన వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన సమయంలో జువెనైల్ వయస్సు 18 సంవత్సరాలకు కొన్ని నెలలు మాత్రమే తక్కవ. దీంతో అతన్ని బాలనేరస్తుడిగా పరిగణించి మూడేళ్ల పాటు సంస్కరణ గృహానికి తరలిస్తూ శిక్ష విధించారు. అయితే నిర్భయపై జరిగిన అమానుష హింసలో జువెనైల్ పాత్ర కూడా ఉందని, అతన్ని కూడా మిగతా నిందితుల మాదిరిగానే పరిగణిస్తూ.. కఠిన శిక్ష విధించాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కోవన్కు ఊరట
చెన్నై : జానపద కళాకారుడు కోవన్కు హైకోర్టులో ఊరట లభించింది. జాతీయ భద్రతా చట్టం అమలుకు స్టే విధిస్తూ మంగళవారం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోవన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. కోవన్ ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు తదుపరి కన్నయ్యన్ రాందాసుపై గురి పెట్టారు. రాష్ట్రంలో మద్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా జానపద కళాకారుడు కోవన్ పాడిన పాటలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు జాతీయ భద్రతా చట్టం ప్రయోగించే పనిలో పడ్డారు. పుళల్ జైల్లో ఉన్న కోవన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మద్యానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమం రాజుకుంది. దీనిపై ఉక్కుపాదం మోపే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవన్‌పై నమోదు చేస్తున్న జాతీయ భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తనయుడు చారువాహన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తన పాటలో కోవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, మద్యానికి వ్యతిరేకంగా ఇక్కడ సాగుతున్న వ్యవహారాన్ని ఎత్తి చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని అన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదన్న విషయాన్ని పరిగణించాలని తన పిటిషన్లో చారువాహన్ సూచించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి సుందరేషన్ నేతత్వంలోని బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ కోవన్‌పై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు. కోవన్ను విడుదల చేయాలంటూ రాష్ర్టంలో పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుచ్చిలో జరిగిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కోవన్ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి తమ గురిని కన్నయ్యన్ రాందాసు మీద పెట్టారు. కోవన్ పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేసిన మక్కల్ కలై ఇయక్కంకు చెందిన కన్నయ్యన్పై క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నయ్యన్ అజ్ఞాతంలోకి వెళ్లారు.