లక్నో : పది వేల రూపాయల అప్పు తీర్చలేదన్న కోపంతో.. రెండున్నరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాగ్రహానికి భయపడిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసును త్వరితగతిన విచారణ చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దారుణం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో పోలీసులు నిందితుల మీద జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుందని ఎస్‌ఎస్‌పీ ఆకాశ్ కుల్హరి తెలిపారు. ఇప్పటికే శాంపిల్స్‌ను ఆగ్రా ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఇప్పటికే ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
అంతేకాక చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాహీద్, అస్లాం అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిపై లైంగిక దాడి జరగలేదని.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని పోలీసులు తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందుతుల మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాల్సిందిగా మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వారికి తెలియకుండా ఈ హత్య జరిగి ఉండదని అతను ఆరోపిస్తున్నాడు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని.. వారిని అరెస్ట్ చేయకపోతే.. తనను కూడా చంపేస్తారని బాలిక తండ్రి ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment