సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. జాతరకు వెళ్లిన గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. ఆ కీచకులను గుర్తించి జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు ఖాకీలు.
ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా.. వైరల్ అయిన ఓ వీడియోను సుమోటాగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం పదిహేను మంది నిందితుల్లో.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్‌ఎస్‌ఏ (National Security Act) కింద కేసు నమోదు చేశారు. వాళ్లను అరెస్ట్ చేసి.. రోడ్ల వెంబడి నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వాళ్ల తల్లిదండ్రుల్ని పిలిపించి.. వాళ్ల సమక్షంలోనే ఘటన గురించి వివరించి చెప్పారు. ఇక మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మార్చి 11వ తేదీన అలిరాజ్‌పూర్ జిల్లా సోన్వా రీజియన్ వాల్‌పూర్ గ్రామంలో భగోరియా జాతర జరిగింది. ఈ జాతరకు వెళ్లిన ఇద్దరు గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు. అంతటితో ఆగకుండా ఆ మృగచేష్టలను వీడియో తీసి వైరల్ చేశారు. సాయం కోసం ఆ యువతులు కేకలు వేసినా.. జనాలెవరూ వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం పదిహేను నిందితులు.. ధార్, అలిరాజ్‌పూర్ జిల్లాలకు చెందినవాళ్లుగా గుర్తించారు.
⚡️Distressing Video
— Ahmer Khan (@ahmermkhan) March 13, 2022
A tribal woman molested in broad daylight by saffron-clad goons during a fair in Madhya Pradesh, India.pic.twitter.com/lTZKLxVVwF
అయితే పోలీస్ స్టేషన్ గడప తొక్కడం ఇష్టం లేని ఆ యువతుల కుటుంబాలు.. ఘటనపై ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు.. బాధితుల కుటుంబాలకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన లేకపోవడంతో.. వాళ్ల కోసం వెతికారు. బాధితుల జాడ లేకపోవడంతో స్వయంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసుకున్నారు.
నరేంద్ర దావర్, విశాల్ కియాదియా, దిలీప్ వస్కెల్, మున్నా భీల్.. ఇలా ప్రధాన నిందితులు నలుగురు ముప్ఫై ఏళ్లలోపు వాళ్లే కావడం విశేషం. ఈ నలుగురిని ప్రస్తుతం ఉజ్జయిని జైలుకు తరలించినట్లు అల్జిపూర్ ఎస్పీ మనోజ్ సింగ్ వెల్లడించారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఆయన.
Comments
Please login to add a commentAdd a comment