'నిర్భయ' కేసులో బాలనేరస్తుడి విడుదల ఆపేందుకు..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో బాలనేరస్తుడి (జువెనైల్)గా ఉన్న నిందితుడు మరో మూడు వారాల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు. 2012లో అత్యంత కిరాతకంగా విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన అతణ్ని మరికొంతకాలం జైలులోనే ఉంచేందుకు అతనిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టమైన జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటికే సీనియర్ పోలీసులు అధికారులు న్యాయనిపుణులను కలిసి చర్చించారు. ప్రస్తుతం అతని వయస్సు 21 సంవత్సరాలు. ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ల నిందితుడు అతన్ని ప్రేరేపించాడని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడైన నేపథ్యంలో అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అవకాశముందా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని 12 నెలలపాటు జైలులో ఉంచవచ్చు.
మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు అతని విడుదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అతని విడుదలను ఆపేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖతోపాటు, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరగా జాతీయ మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు. 'ఇప్పుడు పోలీసులు ఆలోచించడం కాదు చర్యలకు ఉపక్రమించాలి' అని నిర్భయ తండ్రి బద్రినాథ్ మీడియాకు తెలిపారు. నేరగాళ్లకు ఎలాంటి హక్కులు ఉండరాదని పేర్కొన్నాడు. నిర్భయగా పేరొందిన వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన సమయంలో జువెనైల్ వయస్సు 18 సంవత్సరాలకు కొన్ని నెలలు మాత్రమే తక్కవ. దీంతో అతన్ని బాలనేరస్తుడిగా పరిగణించి మూడేళ్ల పాటు సంస్కరణ గృహానికి తరలిస్తూ శిక్ష విధించారు. అయితే నిర్భయపై జరిగిన అమానుష హింసలో జువెనైల్ పాత్ర కూడా ఉందని, అతన్ని కూడా మిగతా నిందితుల మాదిరిగానే పరిగణిస్తూ.. కఠిన శిక్ష విధించాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు.