ఆ జువైనల్ కు ఐఎస్ తో అనుబంధం?
నిర్భయ కేసులో దోషిగా ఉన్న బాల నేరస్థుడుపై మరిన్ని అభియోగాలు వెలుగు చూస్తున్నాయి. అతడు సంక్షేమ గృహంలో ఉన్నపుడు కాశ్మీర్ జిహాదీల్లో చేరే ఆలోచనలో ఉన్నట్లుగా అనుమానించిన నిఘా వర్గాలు... తాజాగా అతడికి ఐసిస్ తో అనుబంధాలు ఉన్నట్లు చెప్తున్నాయి.
ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై బస్సులో అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డ బాల నేరస్థుడికి జిహాదీలతో సంబంధాలు ఉన్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలు మరోమారు అనుమానిస్తున్నాయి. కేసులో మూడు సంవత్సరాల నిర్బంధ శిక్ష అనంతరం అతని విడుదల విషయంలో అనేక అభ్యంతరాలు వెల్లడైన విషయం తెలిసిందే. అతడు తిరిగి సమాజానికి ఎటువంటి హాని తలపెట్టడని హామీ ఇవ్వాలంటూ విడుదలకు ముందు కోర్టుకు అభ్యర్థనలూ వెల్లువెత్తాయి. అదే నేపథ్యంలో స్పందించిన కేద్రం ఢిల్లీ హైకోర్టుకు ఇంటిలిజెన్స్ రిపోర్టును సమర్పించింది. జువైనల్.. సంక్షేమ గృహంలో ఉన్నపుడు జిహాదీల్లో చేరేందుకు యోచించినట్లు హోం వ్యవహారాల శాఖ కూడ నివేదిక ఇచ్చింది. చివరికి 2015 డిసెంబర్ లో జువైనల్ సంక్షేమ గృహంనుంచీ అతడు విడుదలయ్యాడు. కాగా ప్రస్తుతం ఆ నేరస్థుడు కొన్ని ప్రత్యేక నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించి, అధికారులను అప్రమత్తం చేశాయి. అతడిపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించాయి. కానీ అతడిగురించిన ఏ ఇతర వివరాలనూ వెల్లడించలేదు.
ఉత్తర ప్రదేశ్ లోని నిఘా వర్గాల ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్భయ గ్యాంగ్ రేప్ నేరస్థుడి కదలికలను నిఘానేత్రంతో గమనిస్తున్నారు. కాశ్మీరీ యువత.. సదరు జువైనల్ ను జిహాదీల్లో చేరాలని ప్రేరేపిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని బదౌన్ జిల్లాకు చెందిన 21 ఏళ్ళ ఆ నేరస్థుడిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆర్నెల్లక్రితం రిఫార్మ్ హోమ్ లో మూడేళ్ళ శిక్షను పూర్తి చేసుకొని బయటపడ్డ అతడు మరో ఐదుగురితో కలసి అతి క్రూరంగా గ్యాంగ్ రేప్ జరిపిన (నిర్భయ) కేసు... 2012 లో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రేపింది. అంతేకాదు ఇండియాలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచం దృష్టి పడేలా చేసింది.