బాల నేరస్తుడిపై సుప్రీంకోర్టు ఏమందంటే..
న్యూఢిల్లీ: బాల నేరస్తుల చట్టాల్లో మార్పులు తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం తమను ఇరకాటంలో పడేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు)ని విడుదల చేయకుండా ఉండాలని ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. అవేంటంటే..
- మీరు అభ్యర్థించినట్లుగా ఏ చట్టం ప్రకారం మేం ఇంకా అతడిని అదుపులో ఉంచుకోగలం?
- ఏదైనా జరిగిందంటే అది చట్టానికి లోబడే, చట్ట ప్రకారమే జరిగింది. మేం చట్టానికి అతీతులం కాదు
- రాజ్యాంగంలోని 21 నిబంధన ప్రకారం ఒక వ్యక్తి హక్కును మేం హరించలేము. చట్టంలో అలాంటి అవకాశం పొందుపరచలేదు.
- మేం మీ ఆందోళనను అర్ధం చేసుకోగలం.. కానీ, ఈ కేసులో చట్టం మూడేళ్లకు మించి బాల నేరస్తుడిని అదుపులో ఉంచుకునేందుకు అనుమతించదు
- ఒక వేళ ప్రభుత్వం ఆ మేరకు చట్టంలో మార్పులు చేసే క్రమంలో ఏడు నుంచి పదేళ్ల సమయం పడితే అప్పటి వరకు అతడిని అదుపులో ఉంచుకోగలమా? ఆ విధంగా చేసేందుకు మాకు చట్ట అనుమతి ఏది? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.