న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి.. మహిళల భద్రత పట్ల ఆందోళన పెంచిన నిర్భయ ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడేళ్లు. 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడి... ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది.
అయితే వీరికి ఉరిశిక్ష ఖరారు చేసి దాదాపు రెండున్నరేళ్లు అవుతున్నా.. వారిని ఇంకా ఉరితీయలేదు. శిక్షకు సంబంధించిన రివ్యూ పిటిషన్లు ఇంకా దాఖలు అవుతూనే ఉన్నాయి. తన కూతురి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన దోషులను సత్వరమే ఉరి తీయాలని నిర్భయ తల్లి కోరుతుండగా.. దోషులు మాత్రం తీర్పును సమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే ఇంతా జరుగుతున్నా.. ఘటనకు మూలకారణమైన భద్రత విషయంలో ఏమాత్రం మార్పు రాలేదంటున్నారు దేశ రాజధాని మహిళలు. ముఖ్యంగా నిర్భయ ఆరోజు బస్సు ఎక్కిన మునిర్కా బస్టాప్ వద్ద నేటికీ సరైన నిఘా లేకపోవడంతో తరచుగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.(నిర్భయ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన బస్సు ఏమైంది?)
ఎవరో ఒకరు వచ్చి తీసుకువెళ్తారు..
‘నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత మహిళల భద్రత విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని అధికారులు చెప్పారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు గురించి రోజూ పత్రికల్లో, టీవీ చానెళ్లలో చూస్తున్నాం. కానీ నాటికీ నేటికీ ఇక్కడ ఏమీ మారలేదు. సీసీటీవీలు పెడతామన్నారు. బస్సుల్లో జీపీఎస్ ఏర్పాటు చేస్తామన్నారు. అయినప్పటికీ మునిర్కా బస్టాప్ వద్ద ఆకతాయిలు మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. నేను ఢిల్లీ మొత్తం ప్రయాణించినా నా తల్లిదండ్రులు అంతగా భయపడరు. కానీ మేము నివాసం ఉండే మునిర్కాకు వస్తున్నానంటే భయపడిపోతారు. నేను అక్కడ దిగేసరికి ఎవరో ఒకరు వచ్చి తీసుకువెళ్తారు. నిర్భయ ఘటన ఇంకా వారిని వెంటాడుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. రాత్రి తొమ్మిది గంటలు దాటిందంటే చాలు అరాచక శక్తులకు ఆ స్టాప్ అడ్డాగా మారుతోంది’ ఓ 24 ఏళ్ల ఉద్యోగిని చెప్పుకొచ్చారు. ఇక రాణీ కుమారి అనే బ్యూటిషియన్ మాట్లాడుతూ... ‘ నేను మనిర్కాలో బస్సు దిగే సరిగి అక్కడ కుప్పతెప్పలుగా ఆటోలు ఉంటాయి. కానీ ఎన్ని డబ్బులు ఇస్తామన్నా ఆటో డ్రైవర్లు.. డ్రాప్ చేయడానికి రారు. ఆటో కోసం అడుగుతూ ఉంటే.. వెకిలిగా చూస్తూ.. అసభ్య సంఙ్ఞలు చేస్తూ నీచంగా ప్రవర్తిస్తారు. అంతేకాదు ఎవరూ రావడం లేదు కదా అని కాలినడకన వెళ్తుంటే వెనకే ఆటోలో ఫాలో అవుతూ అసభ్యపు పదజాలం వాడుతూ వేధింపులకు గురిచేస్తారు’ అని తన గోడును వెళ్లబోసుకున్నారు.
అబద్ధం ఆడితే ఫిర్యాదు ఎలా?
ఇక మీనా అనే మహిళ మాట్లాడుతూ... ‘ ఆటో డ్రైవర్లు మమ్మల్ని ఇంటి వద్ద దిగబెట్టడానికి తిరస్కరిస్తే ఫిర్యాదు చేయవచ్చు అని ప్రభుత్వం చెబుతోంది. అదే ధైర్యంతో ఓ రోజు రాత్రి నేను ఆటోలో ఎక్కి కూర్చున్నాను. డ్రైవర్ మాత్రం మర్యాదగా దిగమంటూ హెచ్చరించాడు. నేను ఫిర్యాదు చేస్తానని బెదిరించాను. వెంటనే స్వరం మార్చిన డ్రైవర్.. మేడమ్... సరిపడా ఇంధనం లేదు. కాబట్టి నేను ఎక్కడికీ రాలేను అని చెప్పాడు. అతడు అబద్ధం ఆడుతున్నాడని తెలుసు. కానీ ఏం చేయగలం. ఆరోజు చీకట్లో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది’ అని తన అనుభవం పంచుకున్నారు. మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేనంతకాలం ఇటువంటి ఘటన కొనసాగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.
మాలో ఆశలు చిగురించాయి. కానీ..
ఘటన జరిగి ఏడేళ్లు అయిన సందర్భంగా నిర్భయ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. దోషులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ... ‘ఘటన జరిగి ఏడేళ్లు అవుతుంది. దోషులను శిక్షించేందుకు ఇంకెంత కాలం ఆగాలి? న్యాయం కోసం ఎన్నేళ్లు ఎదురుచూడాలి? నిర్భయ ఘటనలో ఆ నలుగురు దోషులను ఉరి తీసిన నాడే మాకు న్యాయం జరిగినట్లు. నిజానికి కొద్ది రోజులుగా దేశంలో జరుగుతోన్న ఘటనలు మాలో ఆశలు రేకెత్తించాయి. హైదరాబాద్‌లో ‘దిశ’ఘటనలో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులను సత్వరంగా శిక్షించినందుకు ప్రజలు ఆనందించారు. అందరి కేసుల్లోనూ ఇదే మాదిరి సత్వర న్యాయం జరగాలి. మా కూతురిలా ఎంతో మంది నిర్భయలు బలైపోతున్నారు. వారి తరఫున కూడా మేం పోరాడుతూనే ఉంటాం’అని స్పష్టం చేశారు.
అదే విధంగా న్యాయం కోసం చేస్తున్న పోరాటం తమకెన్నో విషయాలను నేర్పిందని వారు వ్యాఖ్యానించారు. విచారణ ముసుగులో ఉన్న లొసుగులేంటే తెలిసేలా చేయడంతో పాటుగా.. వాటిని ఎలా అధిగమించాలో నేర్పిందని పేర్కొన్నారు. ఇలాంటి కేసులను విచారించేందుకు నిర్ణీత గడువు విధించాలి అని అభిప్రాయపడ్డారు. ‘ట్రయల్ కోర్టుల్లో విచారణకు చాలా సమయం పడుతుందనే విషయం అంగీకరించాల్సిందే. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టులు విచారణలో జాప్యం చేయడం తగదు. ఎందుకంటే కింది కోర్టులు ఇచ్చిన తీర్పును హైకోర్టు, సుప్రీంకోర్టులు పరిశీలిస్తాయి. దీనికి ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టులు 15 రోజుల్లోనే విచారణను పూర్తి చేయాలి’అని విఙ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment