సాక్షి, న్యూఢిల్లీ : తనపై లైంగిక దాడి జరిగిందని నిర్భయ అత్యాచార, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై ముఖేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం ముందు ముఖేష్ సింగ్ సంచలన విషయాలను వెల్లడించాడు. తీహార్ జైల్లో తననై లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న సహ దోషి అక్షయ్ సింగ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని న్యాయస్థానంలో పేర్కొన్నాడు.
తీహార్ జైలు అధికారుల సహకారంతోనే ఈ ఘటన జరిగిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చాడు. రాష్ట్రపతికి పెట్టిన క్షమాభిక్ష పిటిషన్‌లో ఈ విషయాలు వెల్లడించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని వాపోయాడు. ఈ మేరకు ముఖేష్ సింగ్ తరఫున న్యాయవాది అంజనా ప్రకాశ్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. బుధవారం దీనిపై తుది తీర్పును వెల్లడించనుంది. (ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి)
కాగా ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలలోపు నలుగురు దోషులను ఉరితీయాలని న్యాయస్థానం ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం ఇప్పటికే తోసిపుచ్చింది. చివరి ప్రయత్నంగా దోషి ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌కు కూడా ఆయన తిరస్కరించారు.
దీంతో దోషులను ఉరి తీసేందుకు తీహార్‌జైలు అధికారులు మరోసారి ట్రయల్స్ నిర్వహించారు. అయితే ఫిబ్రవరి 1న దోషులను ఉరితీస్తారా? లేదా అనేదానిపై తీవ్ర ఉత్కఠ నెలకొంది. తాజా పరిణామాలపై నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే దోషులు ఇలా నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment