'నేరం గెలిచింది.. మమ్మల్ని పాతాళానికి తొక్కారు'
న్యూఢిల్లీ: తమ విషయంలో నేరమే గెలిచిందని ఢిల్లీలో లైంగిక దాడికి గురై ప్రాణాలుకోల్పోయిన నిర్భయ(జ్యోతిసింగ్) తల్లి ఆశాదేవీ అన్నారు. తమ మూడు సంవత్సరాల పోరాటం వృధా అయిందని, శూన్యంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) ఆదివారం బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు.
అతడిని తన సొంతప్రాంతం ఉత్తరప్రదేశ్కు పంపించకుండా ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు అప్పగించారు. అతడి విడుదల సందర్భంగా నిరసన తెలుపుతున్న నిర్భయ(జ్యోతిసింగ్) తల్లిదండ్రులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తన తీరు, దేశ న్యాయవ్యవస్థపట్ల వారు తీవ్రంగా కలత చెందారు. మిగిలిన నలుగురు నేరస్తులను కూడా విడిచిపెడతారా అని ప్రశ్నించారు. తమ మూడేళ్ల పోరాటం శూన్యంగా మిగిలిందంటూ కంటతడిపెట్టారు. ఈ న్యాయవ్యవస్థ తమ కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసిందని అన్నారు. బాల నేరస్తుల చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఇంకా ఎన్ని అత్యాచారాలు, హత్యలు జరగాలి అని కూడా ఆమె ప్రశ్నించారు.