ఆ బాల నేరస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? | Juvenile in 2012 Delhi gang rape case working as a cook | Sakshi
Sakshi News home page

ఆ బాల నేరస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Published Sat, May 6 2017 8:46 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

ఆ బాల నేరస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

ఆ బాల నేరస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది.. నలుగురు దోషులకూ మరణ శిక్ష కూడా ఖరారైంది. అయితే ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు దోషుల్లో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా మరొకరు మాత్రం బాల నేరస్తుడు కావడంతో.. మూడేళ్ల పాటు బోస్టన్ స్కూల్లో ఉన్న తర్వాత విడుదల చేసేశారు. ఇప్పుడు ఈ తీర్పుతో ఏమాత్రం సంబంధం లేకుండా స్వేచ్ఛా ప్రపంచంలో తిరుగుతున్న ఆ బాల నేరస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ఇప్పుడు కొత్త జీవితంలో సెటిలైపోయాడు. అతడికి ఇప్పుడు 23 ఏళ్ల వయసు. తన సొంత ప్రాంతానికి దూరంగా.. దక్షిణాదిన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియకుండా ఒక ధాబాలో వంటవాడిగా పని చేసుకుంటున్నాడు. సర్వసాధారణంగా ఈ తీర్పు రాగానే మరోసారి టీవీ చానళ్ల కళ్లన్నీ అతడిమీదే పడతాయి కాబట్టి, అతడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ చెప్పడం లేదు. చివరకు అతడు పనిచేసే ధాబా యజమానికి కూడా అతడు ఫలానా అని తెలియదు. ఆ బాల నేరస్తుడి పునరావాసం బాధ్యతలు చూస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుసు తప్ప.. వేరెవ్వరికీ అతడెవరో కూడా తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. జైలు నుంచి విడుదలైన ఏడాది తర్వాత అతడిని దక్షిణాదిన ఒక ధాబాలో వంటవాడిగా చేర్చినట్లు మాత్రం తెలిపారు.

2015 డిసెంబర్ 20వ తేదీన అతడు విడుదలయ్యాడు. కొన్నాళ్ల పాటు ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద ఉన్నాడు. ఆ తర్వాత వంటవాడిగా వచ్చేశాడు. ఢిల్లీకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి నుంచి 11 ఏళ్ల వయసులో అతడు పారిపోయి వచ్చేశాడు. అతడి తల్లి, తండ్రి ఇద్దరూ అనారోగ్యంతో మంచం పట్టగా, మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులను అతడి అక్క మాత్రమే పోషిస్తుంది. అతడు ఢిల్లీ వచ్చిన తర్వాత నిర్భయ కేసులో మరో నిందితుడైన రామ్‌సింగ్‌ పంచన చేరాడు. అతడి దగ్గర బస్సు క్లీనర్‌ పనిలో కుదురుకున్నాడు. బోస్టన్ స్కూల్లో ఉన్నప్పుడు అతడు చాలా క్రమశిక్షణతో ఉండేవాడని అంటున్నారు. అక్కడినుంచి బయటకు వచ్చిన తర్వాత భక్తిమార్గంలోకి వెళ్లిపోయాడు. గెడ్డం పెంచుకుని రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడు. మొదట్లో అతడిని ఒంటరిగా ఉంచేవారు. కానీ తర్వాత హైకోర్టు పేలుడు కేసు నిందితుడితో కలిసి ఒక డార్మిటరీలో ఉంచారు. వంట అంటే అతడికి చాలా ఇష్టం. దాంతో అక్కడ సిబ్బంది చేసే వంటల్లో కూడా సాయం చేసేవాడు. తరచు మిగిలిన వాళ్లు కూడా అతడి వంటల కోసం అడిగేవారట. బయటకు వచ్చిన తర్వాత కూడా అందుకే వంట పనిలో కుదురుకున్నాడు. అయితే, పాత నేరచరిత్ర దృష్ట్యా ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రం అతడి మీద ఓ కన్నేసి ఉంచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement