ఢిల్లీ మహిళా కమిషన్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో బాలనేరస్తుడి విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. చట్ట ప్రకారం అతడిని మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిర్బంధించే అవకాశం లేదని ఉన్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆందోళన కారుల అభిప్రాయాల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, చట్టానికి విరుద్ధంగా ఏమీ చేయలేమని పేర్కొంది. ఈ వ్యవహారంలో కేంద్ర వైఖరిని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. కాగా బాల నేరస్తుడి విడుదలను సవాల్ చేస్తూ ఢిల్లీ మహిళ కమిషన్ ...సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో... మహిళా సంఘాలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయంపై జ్యోతిసింగ్ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరుగుతుందని తనకు తెలుసని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ స్పందన ఇంతకంటే గొప్పగా ఉంటుందని తాను ఆశించలేదన్నారు. అటు ఇది దేశానికి జరిగిన పెద్ద ద్రోహమని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి అభిప్రాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో బాలనేరస్తుడి (జువైనల్)గా ఉన్న నిందితుడు ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. ఆందోళన కారుల తీవ్ర నిరసనల నేపథ్యంలో అతడిని రహస్య ప్రదేశానికి తరలించారు. 2012లో అత్యంత కిరాతకంగా విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన అతణ్ని విడుదల చేయొద్దని, కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఊపందుకున్న విషయం విదితమే.
నిర్భయపై జరిగిన అమానుష హింసలో జువైనల్ పాత్ర కూడా ఉందని, మైనర్ అనే పేరుతో క్షమించరాదని, నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా కమిషన్ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖతోపాటు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు.