![Neighbours of Nirbhaya family cheer hanging of convicts - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/21/Untitled-11.jpg.webp?itok=_DJ7t2Vi)
ఉరి అనంతరం చిరునవ్వులు చిందిస్తున్న నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని, ఇప్పుడు భద్రంగా ఉన్నామని మహిళలు భావిస్తారని వ్యాఖ్యానించారు. శిక్ష అమలు ఇంతగా వాయిదా పడటానికి కారణమైన చట్టపరమైన లోపాలపై ఇకపై తాము పోరాటం చేస్తామన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని ఆశాదేవి వ్యాఖ్యానించగా, తమ కూతురికి న్యాయం జరిగిందని, ఇలాంటి అన్యాయానికి గురైన బాధితుల కోసం ఇకపై పోరు కొనసాగిస్తామని బద్రీనాథ్ పేర్కొన్నారు.
ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ.. శిక్ష అమలును వాయిదా వేసేందుకు చేసే ఇలాంటి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు. ‘ఇప్పటికైనా మిగతా బాధితులకు సకాలంలో న్యాయం జరగాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరగాలి. ఆ దిశగా పోరాటం సాగిస్తాం’ అన్నారు. ఈ రోజు తన కూతురి ఆత్మ శాంతించిందని భావిస్తున్నానని భావోద్వేగంతో ఆశాదేవి వ్యాఖ్యానించారు. మా ఊరి ప్రజలు ఈ రోజే హోళి పండుగ జరుపుకుంటారన్నారు.
ఈ శిక్ష తరువాతైనా.. తల్లిదండ్రులు మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తమ కుమారులకు నేర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘గురువారం రాత్రి సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఇంటికి వచ్చి నా కూతురు ఫొటోను హత్తుకుని, బేటీ.. నీకు న్యాయం జరిగింది’ అని విలపించానని ఆశాదేవి తెలిపారు. రాత్రంతా తామిద్దరికి కంటి మీద కునుకు లేదన్నారు. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోవాలని, ఈ రోజును ఏటా ‘నిర్భయ న్యాయ దివస్’గా జరుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశాదేవి ఇంటి వద్ద తెల్లవారు జామున గుమికూడిన ప్రజలు ఉరిశిక్ష అమలుపై ‘కౌంట్ డౌన్’ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment