Nirbhayas parents
-
నా కూతురి ఆత్మ శాంతించింది!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని, ఇప్పుడు భద్రంగా ఉన్నామని మహిళలు భావిస్తారని వ్యాఖ్యానించారు. శిక్ష అమలు ఇంతగా వాయిదా పడటానికి కారణమైన చట్టపరమైన లోపాలపై ఇకపై తాము పోరాటం చేస్తామన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని ఆశాదేవి వ్యాఖ్యానించగా, తమ కూతురికి న్యాయం జరిగిందని, ఇలాంటి అన్యాయానికి గురైన బాధితుల కోసం ఇకపై పోరు కొనసాగిస్తామని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ.. శిక్ష అమలును వాయిదా వేసేందుకు చేసే ఇలాంటి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు. ‘ఇప్పటికైనా మిగతా బాధితులకు సకాలంలో న్యాయం జరగాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరగాలి. ఆ దిశగా పోరాటం సాగిస్తాం’ అన్నారు. ఈ రోజు తన కూతురి ఆత్మ శాంతించిందని భావిస్తున్నానని భావోద్వేగంతో ఆశాదేవి వ్యాఖ్యానించారు. మా ఊరి ప్రజలు ఈ రోజే హోళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ శిక్ష తరువాతైనా.. తల్లిదండ్రులు మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తమ కుమారులకు నేర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘గురువారం రాత్రి సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఇంటికి వచ్చి నా కూతురు ఫొటోను హత్తుకుని, బేటీ.. నీకు న్యాయం జరిగింది’ అని విలపించానని ఆశాదేవి తెలిపారు. రాత్రంతా తామిద్దరికి కంటి మీద కునుకు లేదన్నారు. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోవాలని, ఈ రోజును ఏటా ‘నిర్భయ న్యాయ దివస్’గా జరుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశాదేవి ఇంటి వద్ద తెల్లవారు జామున గుమికూడిన ప్రజలు ఉరిశిక్ష అమలుపై ‘కౌంట్ డౌన్’ నిర్వహించారు. -
ఆ ఆరుగురి పాపమే !
న్యూఢిల్లీ: డిసెంబర్ 16, 2012.. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కదులుతున్న బస్సులో ఢిల్లీ మెడికో విద్యార్థిని నిర్భయపై జరిగిన దారుణం అత్యంత హేయమైనది. నిర్భయపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెని, ఆమె స్నేహితుడ్ని ఐరన్ రాడ్లతో రక్తాలు కారేలా చితకబాది కదులుతున్న బస్సులోంచే బయటపడేసిన అకృత్యమది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనతో యావత్ జాతి కదలిపోయింది. నిర్భయ దోషులకు తగిన శాస్తి జరిగే వరకు పోరాడతామని ఎలుగెత్తి చాటింది. నిర్భయ తల్లిదండ్రులు, రేపిస్టులపై జాతి యావత్తు చేసిన పోరాటం నలుగురి ఉరితీతతో ముగిసింది. ఈ నేరం చేసిన ఆరుగురి వివరాలేంటో చూద్దాం రామ్‌సింగ్, ప్రధాన నిందితుడు : నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన బస్సు డ్రైవరే రామ్ సింగ్. దక్షిణ ఢిల్లీలో రవిదాస్ కేంప్ మురికివాడల్లో నివాసం ఉండే అతనే ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఢిల్లీ పోలీసులు రామ్సింగ్ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. రామ్‌సింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అతని సోదరుడు ముఖేష్ సింగ్ సహా మిగిలిన అయిదుగురిని అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగానే రామ్ సింగ్ 2013, మార్చి 10న జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబితే, అతనిని హత్య చేశారంటూ అతని తల్లిదండ్రులు ఆరోపించారు. మైనర్: అత్యంత హేయమైన ఈ నేరంలో ఒక మైనర్ ప్రమేయం కూడా ఉంది. నిర్భయను క్రూరంగా హింసించింది ఈ మైనరే. అతనిని ఆనంద్‌విహార్ ప్రాంతంలో మర్నాడు ఉదయం నిర్బంధించిన పోలీసులు జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. నేర నిర్ధారణ కావడంతో మూడేళ్లు రిమాండ్ హోమ్‌కి తరలించారు. మైనర్ అయినందున అతని వివరాలేవీ బయటకు వెల్లడించలేదు. మూడేళ్ల నిర్బంధం తర్వాత 2015 డిసెంబర్లో అతనిని విడుదల చేశారు. ఉరిశిక్ష అమలు చేసింది ఈ నలుగురికే ముఖేష్ సింగ్, బస్సు క్లీనర్ తీహార్ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తమ్ముడే ముఖేష్ సింగ్ (32). దక్షిణ ఢిల్లీలోని మురికివాడల్లో సోదరుడితో కలిసి నివసించేవాడు. అత్యాచారం జరిగిన రాత్రి నిర్భయను, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలున్నాయి. నేరం జరిగాక ముఖేష్ సింగ్ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు అతనిని రాజస్తాన్‌లోని కరోలిలో అదుపులోనికి తీసుకున్నారు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు ఆమె ప్రతిఘటించలేదని బీబీసీ ఇండియా డాటర్ అనే డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ గుప్తా, పండ్ల వ్యాపారి పవన్ గుప్తా (25) పండ్ల వ్యాపారి. అతను కూడా రవిదాస్ మురికివాడల్లోనే నివాసం ఉంటాడు. డిసెంబర్ 16 మధ్యాహ్నం తప్పతాగాడు. ఆ తర్వాత అన్నం తిని మద్యం మత్తులోనే బయటకు వెళ్లాడు. నిర్భయ దుర్ఘటన జరిగినప్పుడు బస్సు దరిదాపుల్లో కూడా లేడని పవన్ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ పవన్ గుప్తా ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తే అతను నేరం జరిగిన సమయంలో బస్సులోనే ఉన్నాడని బయటపడింది. వినయ్ శర్మ, జిమ్ ట్రైనర్ వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిట్నెస్ ట్రైనర్. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలడు. పోలీసులు అతనిని జిమ్ బయటే అదుపులోనికి తీసుకున్నారు. నేరం జరిగిన సమయంలో తాను బస్సు దగ్గర లేనని, ఒక సంగీత కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లానని వినయ్ శర్మ పదే పదే చెప్పుకున్నాడు. 2016లో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కానీ జైలు అధికారులు అతనిని కాపాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జైలు గోడలకి తలని బాదుకొని గాయపరుచుకున్నాడు. అక్షయ్ ఠాకూర్, స్కూల్ డ్రాపవుట్ అక్షయ్ ఠాకూర్ (31) బీహార్ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్ డ్రాపవుట్ అయిన అక్షయ్ 2011లో బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన అయిదు రోజుల తర్వాత అక్షయ్‌ని బీహార్‌లో అతని స్వగ్రామం తాండ్వాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్ భార్య తన కుమారుడితో కలిసి బీహార్లోనే ఉంటోంది. ఉరితీతకు మూడు రోజుల ముందు అతను రెండోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అక్షయ్ ఉరి శిక్షకు ముందు తాను వితంతువుగా జీవితాంతం బతకనని, తనకి విడాకులు ఇప్పించాలని కోరుతూ అతని భార్య కోర్టుకెక్కింది. -
‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయకు రేపటిరోజున న్యాయం జరిగి తీరుతుందని ఆమె తల్లి ఆశాదేవి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో ఉరి శిక్ష ఖరారైన నలుగురు దోషులకు కోర్టు పలు అవకాశాలు ఇవ్వడాన్ని ఆమె ప్రస్తావించారు. దోషులు ఎన్నో సాకులతో తమ శిక్షను వాయిదా వేసుకునే ఎత్తుగడలు కోర్టుకు తెలిసివచ్చిందని ఇక శిక్ష నుంచి వారు తప్పించుకోలేరని అన్నారు. నిర్భయకు రేపటిరోజున న్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. నిర్భయ కేసులో తనకు విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ పవన్ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2012లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌నని, దిగువ కోర్టులు ఈ వాస్తవాన్ని విస్మరించాయని తన పిటిషన్లో పవన్ పేర్కొన్నారు. నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ను కావడంతో తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చాలని ఆయన కోరారు. అంతకుముందు ఇదే వాదనతో పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. 2012, డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో వైద్య విద్యార్ధినిపై హత్యాచార ఘటనలో ఉరి శిక్ష పడిన నలుగురు నిందితుల్లో పవన్ ఒకరు. నిర్భయ దోషులకు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి శిక్ష, ఈ నెల 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఖరారైన సంగతి తెలిసిందే. చదవండి : నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి -
సోనియా అంత మనసు లేదు
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్ ఇందిరా జైసింగ్ చేసిన సూచనపై ‘నిర్భయ’ తండ్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి సలహా ఇచ్చినందుకు జైసింగ్ సిగ్గుపడాలన్నారు.. తమకు సోనియా గాంధీ అంత పెద్ద మనసు లేదని వ్యాఖ్యానించారు. మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే జైసింగ్ శుక్రవారం ఒక ట్వీట్ చేస్తూ... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను క్షమించినట్టుగానే ఈ కేసు దోషులను నిర్భయ తల్లిదండ్రులు క్షమించాలని సూచించారు. ఒక తల్లిగా నిర్భయ తల్లిదండ్రుల బాధను తాను అర్థం చేసుకోగలనని, కాకపోతే మరణశిక్ష మాత్రం సరికాదని ఇందిరా జైసింగ్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజీవ్ హంతకురాలు నళినీ శ్రీహరన్‌కు న్యాయస్థానం మరణ శిక్ష విధించగా.. సోనియాగాంధీ జోక్యం చేసుకుని ఆమెను క్షమించినట్లు ప్రకటించారు. ఆ తరువాత ఆమెకు పడ్డ మరణశిక్ష కాస్తా యావజ్జీవ కారాగార శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటిపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. ఇందిరా జైసింగ్ సూచనను తోసిపుచ్చారు. మహిళగా ఉంటూ అలాంటి సలహా ఇచ్చినందుకు ఆమె నిర్భయ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏడేళ్లుగా మేము ఈ కేసుపై పోరాడుతున్నాం. మేము రాజకీయ నాయకులము కాము. సామాన్యులము. మా హృదయాలు సోనియా గాంధీ అంత విశాలం కాదు’’ అని స్పష్టం చేశారు. ఇందిరా జైసింగ్ చేస్తున్న వ్యాఖ్యల వంటివే దేశంలో అత్యాచారాలు పెరిగిపోయేందుకు కారణమని అన్నారు. నిర్భయ తల్లి కూడా తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. సామూహిక అత్యాచారం వంటి క్రిమినల్ కేసుల్లో పడే శిక్షపై దోషులను క్షమించమని బాధితుల కుటుంబ సభ్యులు చెప్పడంతో ఏమీ మారిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘‘న్యాయ వ్యవస్థ పరంగా చూస్తూ బాధితురాలి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనే విషయానికి విలువ లేదు. న్యాయస్థానాలు చట్టం ప్రకారమే నడుచుకుంటాయి. పైగా సోనియాగాంధీ మాదిరిగా నిర్భయ దోషులను క్షమించాలన్న ఇందిరా జైసింగ్ సలహాను నిర్భయ తల్లిదండ్రులు తోసిపుచ్చుతున్నారు’’ అని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ తెలిపారు. అయితే రాష్ట్రపతికి పెట్టుకునే క్షమాభిక్ష పిటిషన్లలో ఇలాంటి (బాధితురాలి కుటుంబం క్షమించింది) విషయాలను ప్రస్తావించవచ్చునని మరో న్యాయవాది వికాస్ సింగ్ చెప్పారు. -
ఆ రాక్షస చర్యపై సమీక్షా?
న్యూఢిల్లీ: తన కూతురిని రాక్షసంగా చెరిచి హత్య చేసిన వారికి విధించిన తీర్పును సమీక్షించరాదంటూ నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్ 2017లో కోర్టు విధించిన ఉరిశిక్షను సమీక్షించాలని కోరుతూ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లి శుక్రవారం ఓ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్‌పై విచారించే రోజున, అంటే ఈ నెల 17వ తేదీనే ఈ పిటిషన్‌పైనా వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తన కూతురిపై అత్యాచారం జరిగిన డిసెంబరు 16వ తేదీనే దోషులకు శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి మీడియా ఎదుట డిమాండ్ చేశారు. తన కూతురుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇలా ఉండగా.. నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై 18న విచారణ చేపడతామని అడిషనల్ సెషన్స్ జడ్జి స్పష్టం చేశారు. ఉరి అమలుకు సిద్ధం: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలుకు చెందిన తలారి... తీహార్ జైలులో ఉరిశిక్షను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు తలారి కోసం ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ జల్లాడ్ (55)... ఉరి అమలుకు సిద్ధమన్నాడు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తాం: కేజ్రీవాల్ మహిళల పట్ల ఎలాంటి అనుచిత చర్యలకు దిగబోమంటూ విద్యార్థుల చేత పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడాలని దేశమంతా కోరుకుంటోందని తెలిపారు. -
‘నిర్భయ’ దోషుల కేసును మరో జడ్జికి అప్పగించండి
న్యూఢిల్లీ: మరో న్యాయమూర్తికి తమ కేసును బదిలీ చేయాలంటూ అత్యాచార బాధితురాలైన నిర్భయ తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అలాగే, అత్యాచారానికి పాల్పడిన దోషుల ఉరిశిక్షను త్వరగా అమలు చేసేలా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై 25న విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. నిర్భయ కేసును విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కావడంతో, ఈ కేసు పదేపదే వాయిదా పడుతోందని నిర్భయ తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లైంగిక వేధింపుల కేసులను త్వరితగతిన విచారించేందుకు పటియాలా హౌజ్‌కోర్టులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కోర్టు న్యాయమూర్తి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. -
‘2 నెలలకొకసారి ప్రియాంక మా ఇంటికొస్తుంది’
న్యూఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితులైన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికి.. సమాజ సేవను మాత్రం వదల లేదు ప్రియాంక గాంధీ. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్ ప్రాంతానికి చెందిన ఆశిష్ అనే బుద్ధిమాంద్యం ఉన్న బాలుని వైద్యానికి సాయం చేస్తున్నారు ప్రియాంక. ఈ విషయం గురించి ఆశిష్ తండ్రి మాట్లాడుతూ.. ‘ప్రియాంక గాంధీ గత నాలుగేళ్లుగా మా కుమారుని చికిత్సకు సాయం చేస్తున్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రియాంక మా ఇంటికి వచ్చి ఆశిష్‌ను పరమార్శించి.. కాసేపు ముచ్చటించి వెళ్తారు. రాహుల్ గాంధీ కూడా మాకు ఎంతో సాయం చేశారు’ అని చెప్పుకొచ్చారు ఆశిష్ తండ్రి. ప్రియాంక గాంధీలానే రాహుల్ గాంధీ కూడా నిర్భయ సోదరునికి సాయం చేస్తున్నారు. 2012, డిసెంబరులో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అనంతరం రాహుల్ గాంధీ నిర్భయ కుటుంబానికి అండగా నిలిచాడు. ఈ విషయం గురించి నిర్భయ తండ్రి మాట్లాడుతూ.. ‘కష్ట సమయంలో రాహుల్ గాంధీ మా కుటంబాన్ని చాలా ఆదుకున్నారు. మా కుమారుడు కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం ప్రైవేట్ ఏయిర్‌లైన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాయ్‌బరేలీలోని స్వతంత్ర సంస్థ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీలో నా కుమారుడు పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని రాహుల్ గాంధీ చేశారు’ అంటే చెప్పుకొచ్చారు. -
'వాడ్ని బయటకు వదలొద్దు'
న్యూఢిల్లీ: తమ కూతురిపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన బాల నేరస్థుడిని విడిచి పెట్టొద్దని నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని(ఎన్ హెచ్ఆర్సీ) ఆశ్రయించారు. అతడి వల్ల సమాజానికి ముప్పు పొంచేవుందని పేర్కొన్నారు. డిసెంబర్ 15న అతడు జైలు నుంచి విడుదలకానున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్ఆర్సీలో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. 'నిర్భయ కేసులో దోషిగా తేలిన బాల నేరస్థుడిని జైలు నుంచి విడుదల కాకుండా చూడాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ ఇచ్చారు. అతడి వల్ల సమాజంలో సామాన్య ప్రజల ప్రాణాలకు, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ నేరాలు చేసే ప్రవృత్తి అతడిలో అధిక స్థాయిలో ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు' అని ఎన్ హెచ్ఆర్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించింది. కాగా, ఇదే విషయంపై నిర్భయ తల్లిదండ్రులు అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞాపన పత్రం సమర్పించారు.