'వాడ్ని బయటకు వదలొద్దు'
న్యూఢిల్లీ: తమ కూతురిపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన బాల నేరస్థుడిని విడిచి పెట్టొద్దని నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని(ఎన్ హెచ్ఆర్సీ) ఆశ్రయించారు. అతడి వల్ల సమాజానికి ముప్పు పొంచేవుందని పేర్కొన్నారు. డిసెంబర్ 15న అతడు జైలు నుంచి విడుదలకానున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్ఆర్సీలో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.
'నిర్భయ కేసులో దోషిగా తేలిన బాల నేరస్థుడిని జైలు నుంచి విడుదల కాకుండా చూడాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ ఇచ్చారు. అతడి వల్ల సమాజంలో సామాన్య ప్రజల ప్రాణాలకు, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ నేరాలు చేసే ప్రవృత్తి అతడిలో అధిక స్థాయిలో ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు' అని ఎన్ హెచ్ఆర్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించింది. కాగా, ఇదే విషయంపై నిర్భయ తల్లిదండ్రులు అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞాపన పత్రం సమర్పించారు.