మా ప్రాంతంలో కంపెనీలు వద్దు
అక్రమ కేసులను ఎత్తేసి మావాళ్లను వదిలేయాలి... ఎన్‌హెచ్‌ఆర్సీకి లగచర్ల బాధితుల గోడు
లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ
దుద్యాల్: తమ ప్రాణాలు తీసినా సరే భూములు మాత్రం కంపెనీల కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండా ప్రజలు తేల్చి చెప్పారు. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) అధికారులు ఈ మూడు గ్రామాల్లో పర్యటించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ లా ముఖేశ్, ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌సింగ్, యతి ప్రకాశ్‌శర్మ బాధిత కుటుంబాలను కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు పోలీసులు తమపట్ల అమానుషంగా వ్యవహరించారని గిరిజన మహిళలు గోడు వెళ్లబోసుకొన్నారు.
రోటిబండతండాకు చెందిన సోనీబాయి, కిష్టబాయి, జ్యోతి, ప్రమీల, వాల్మీబాయి, జార్పుల రూప్‌సింగ్ నాయక్, సీత తదితరులను అధికారులు ప్రశ్నించారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, చివరికి ప్రాణాలు తీసినా భూములు మాత్రం ఇవ్వబోమని ఈ సందర్భంగా బాధితులు తేల్చి చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగేందుకు తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ప్రభుత్వ లీగల్ ఎయిడ్ ద్వారా ఉచితంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఈ పర్యటనపై అధికారులు నివేదిక సిద్ధంచేసి కమిషన్‌కు అందజేయనున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన జరగగా.. బాధిత గిరిజనులు 18న ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఎన్‌హెచ్‌ఆర్సీ అడిగిన ప్రశ్నలివే..
ప్రశ్న: దాడి జరిగిన రాత్రి మీ మీ ఇళ్లలో ఎం జరిగింది?
జవాబు: కరెంట్ తీసి పోలీసులు ఇళ్లలోకి దూరి మగవారిని తీసుకెళ్లారు, ఆడవారిని బెదిరించారు. అడ్డుపడితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు.
ప్రశ్న: పోలీసులు మిమ్మల్ని కొట్టారా?
జవాబు: కొట్టారు, అసభ్యకరంగా తిట్టారు సార్.
ప్రశ్న: మీ డిమాండ్స్ ఏమిటి?
జవాబు: మా ప్రాంతంలో కంపెనీలు వద్దు. మేము భూములు ఇవ్వం. మా జోలికి రావొద్దు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేసి మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలి.
కమిషన్ చేసిన సూచనలు..
ఎఫ్‌ఐఆర్‌లో పేరున్నవారు లొంగిపోతే 14 రోజులు రిమాండ్‌కు పంపి, బెయిల్ ఇస్తారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేనివారు ముందస్తు బెయి ల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ వేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం జైలులో ఉన్నవారికి కూడా బెయిల్ రాదు. భూములు, కేసుల వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటా యి. గ్రామాల్లోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మీ జోలికి రారు.
నా కొడుకుకు సంబంధం లేదు
నా కొడుకు బాష్యానాయక్‌కు దాడితో ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజంతా మేకలు కాసేందుకు వెళ్లాడని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. అర్ధరాత్రి వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టారు. – సోనీబాయి, బాధితురాలు
బతిమాలినా వదిలిపెట్టలేదు
నా భర్త ప్రవీణ్ పాల ఆటో నడుపుతాడు. ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపు తట్టారు. మేము భయపడి తీయకపోవడంతో కాళ్లతో బలంగా తలుపులు తన్నేసి లోపలికి వచ్చారు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి చూశారు. నాకు డెలివరీ సమయం ఉందని బతిమాలినా వినకుండా నా భర్తను లాక్కెళ్లారు. పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. – జ్యోతి, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment