సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.
వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
Comments
Please login to add a commentAdd a comment