రాజమండ్రి దళిత యువకుడిని హింసించిన కేసులో డీజీపీకి, కలెక్టర్‌కు నోటీసులు
పారిశుద్ద్యం లోపించిందని పోస్టు పెట్టిన సాగర్‌ను హింసించిన పోలీసులు
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానాకూ ఫిర్యాదు
స్పందించి డీజీపీ, తూర్పు గోదావరి కలెక్టర్‌కు హెచ్‌ఆర్‌సీ నోటీసులు
సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ చేయించాలని ఆదేశం
నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ
పారిశుద్ధ్యంపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలని కలెక్టర్‌కు మరో నోటీసు
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో దళిత యువకుణ్ణి అకారణంగా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి హింసించిన కేసులో డీజీపీతోపాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ అమానవీయమైన ఘటనపై ఆ ప్రాంతంతో లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. ఆ అధికారి నాలుగు వారాల్లోగా నిష్పాక్షికంగా విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది.
వరద సమయంలో తమ కాలనీలో సమస్యపై పులిసాగర్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీంతో విద్యావంతుడైన ఆ దళిత యువకుడిని దారుణంగా వేధించి, పోలీస్ స్టేషన్ లాకప్‌లో అర్ధ్ధనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ల ముందు నిలబెట్టారు. చంపేస్తానని ఇన్‌స్పెక్టర్ బాజీలాల్ బెదిరించాడు. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీలు పిల్లి గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని, బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని పులి సాగర్‌కు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి కమిషన్ ఈ నోటీసులిచ్చిoది. పులి కృపానంద సాగర్ అనే దళిత యువకుడిపై అక్కడి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కులవివక్ష చూపించడంతోపాటు కస్టోడియల్ హింసకు గురి చేశారని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థానిక బ్రెత్రెన్ చర్చి వద్ద నీరు నిలిచిపోయిందని ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు హింసించారని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించినందుకు ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఐ బాజీలాల్ అతన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచి అవమానించడంతోపాటు అత్యంత అమానవీయంగా చొక్కా విప్పి కొట్టారని, కులం పేరుతో అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో తెలిపారు. లాకప్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ ఎదుట ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని గంటలపాటు నిలబెట్టారని తెలిపారు.
ఆ తర్వాత అతన్ని ఒక బండరాయికి కట్టి గోదావరిలో పడేశారని పేర్కొన్నారు. ఈ దారుణ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఊచల మధ్య ఒక మహిళా పోలీసు దగ్గర నిలబడి ఉన్న దృశ్యాలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను కూడా ఆయన ఫిర్యాదుకు జత చేశారు. దీని ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీకి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఆన్‌లైన్‌లో నోటీసులిచ్చిoది.
ఈ అమానవీయ ఘటనపై రాజమండ్రికి సంబంధం లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 4 వారాల్లోగా నిష్పాక్షికంగా నివేదిక తమకు పంపాలని స్పష్టం చేసింది. బాధితుడు లేవనెత్తిన సమస్యలు, పారిశుద్ధ్య లోపంపై జిల్లా కలెక్టర్ ఏం చర్య తీసుకున్నారో తెలపాలంటూ మరో నోటీసు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment