
న్యూఢిల్లీ: తన కూతురిని రాక్షసంగా చెరిచి హత్య చేసిన వారికి విధించిన తీర్పును సమీక్షించరాదంటూ నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్ 2017లో కోర్టు విధించిన ఉరిశిక్షను సమీక్షించాలని కోరుతూ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లి శుక్రవారం ఓ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్‌పై విచారించే రోజున, అంటే ఈ నెల 17వ తేదీనే ఈ పిటిషన్‌పైనా వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తన కూతురిపై అత్యాచారం జరిగిన డిసెంబరు 16వ తేదీనే దోషులకు శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి మీడియా ఎదుట డిమాండ్ చేశారు. తన కూతురుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇలా ఉండగా.. నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై 18న విచారణ చేపడతామని అడిషనల్ సెషన్స్ జడ్జి స్పష్టం చేశారు.
ఉరి అమలుకు సిద్ధం: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలుకు చెందిన తలారి... తీహార్ జైలులో ఉరిశిక్షను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు తలారి కోసం ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ జల్లాడ్ (55)... ఉరి అమలుకు సిద్ధమన్నాడు.
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తాం: కేజ్రీవాల్
మహిళల పట్ల ఎలాంటి అనుచిత చర్యలకు దిగబోమంటూ విద్యార్థుల చేత పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడాలని దేశమంతా కోరుకుంటోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment