శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి | Nirbhaya Mother Remembers Her Daughter And Situation In Hospital | Sakshi
Sakshi News home page

నాకు చావంటే భయం లేదు... నేను ఎప్పుడో చచ్చిపోయాను!

Published Fri, Mar 6 2020 11:03 AM | Last Updated on Fri, Mar 6 2020 2:33 PM

Nirbhaya Mother Remembers Her Daughter And Situation In Hospital - Sakshi

న్యూఢిల్లీ: ‘‘నాకు చావు అంటే భయం లేదు. నా కూతురిపై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దోషులకు వెంటనే శిక్ష అమలు చేయడం వల్ల తన కూతురు లాంటి ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడే సాహసం ఇకముందు ఎవరూ చేయలేరని పేర్కొన్నారు. ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం, పలు సార్లు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేలు, అనేక పిటిషన్ల అనంతరం నిర్భయ దోషులు ముఖేష్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఆశాదేవి.. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. డిసెంబరు 16, 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేసుకున్నారు. తన కూతురిపై జరిగిన అత్యాచార కాండ, హత్య, దోషులకు శిక్ష వేయించడానికి తాము చేసిన పోరాటం గురించి పంచుకున్నారు. మానవ హక్కుల పేరిట దోషులను రక్షిస్తున్నారంటూ విమర్శించారు. మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడితే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.(నిర్భయ దోషులను ఎప్పుడో చంపేశారు)

తన జాడ తెలియలేదు.. శరీరమంతా రక్తం
‘‘ఆరోజు ఆదివారం. దాదాపు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నిర్భయ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రెండు- మూడు గంటల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి ఎనిమిది అవుతున్నా తన నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో తనకు పలుమార్లు ఫోన్‌ చేశాం. కానీ కాల్‌ కట్‌ అయ్యింది. వెంటనే నేను, నా కొడుకు బస్టాండ్‌కు వెళ్లి తనకోసం వెతికాం. అయినా తన జాడ తెలియరాలేదు. దాదాపు రాత్రి 10 గంటలకు అనుకుంటా. నిర్భయ వాళ్ల నాన్న ఇంటి వచ్చారు. ఆయన కూడా తనకోసం వెదకడం ఆరంభించారు. పదకొండు గంటల వరకు మేం బయటే నిల్చుని ఉన్నాం. తనకోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రి నుంచి కాల్‌ వచ్చింది. మా ఆయన ఫోన్‌ ఎత్తగానే.. నిర్భయ ఆస్పత్రిలో ఉందని.. తనకు గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే మేం అక్కడికి చేరుకున్నాం. ఆలోగా తనను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను చూడగానే నిర్భయ ఏడ్వడం మొదలుపెట్టింది. (తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని)

తన శరీరమంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నాకు ఒక్కసారిగా ఏం అర్థంకాలేదు. నేర తీవ్రతను కూడా అంచనా వేయలేకపోయాం. అప్పుడే తన మీద ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. తన పెదాలు చీరుకుపోయి ఉన్నాయి. తన తల మీద చర్మం అంతా ఊడిపోయింది. ఒంటి నిండా కోతలు, గాయాలు, వాటి నుంచి కారుతున్న రక్తం. కొన్నిచోట్ల మాంసం కూడా బయటకు వచ్చింది. తన పరిస్థితి చూసి డాక్టర్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తనను ఎలా బతికించాలో వారికి అంతుపట్టలేదు. ఇరవై ఏళ్ల కెరీర్‌లో తాను ఎంతో మందిని బతికించాను గానీ.... ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఓ సీనియర్‌ డాక్టర్‌ మాకు చెప్పారు. అంటే నా కూతురి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయినా మాలో ఆశ చావలేదు. తనకు స్పృహ వస్తుందని ఎంతగానో ఎదురుచూశాం. ఆశించినట్టే తను కళ్లు తెరిచింది. తనకు నయం అవుతుందని భావించాం. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తను బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. తనకు స్పృహ వచ్చిన వెంటనే మంచినీళ్లు కావాలని అడిగింది. కానీ డాక్టర్లు అందుకు నిరాకరించారు. చెంచాడు నీళ్లు తాగేందుకు కూడా తన శరీరంలో ఏ వ్యవస్థ సహకరించదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నా కూతురు దాదాపు 10- 20 రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. కానీ ఈ ప్రపంచం నుంచి ఒక్క చుక్క మంచినీరు కూడా తీసుకోలేకపోయింది’’అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఆశాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.(‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’)

తన న్యాయం పోరాటం గురించి చెబుతూ... ‘‘ గడిచిన ఏడు- ఎనిమిదేళ్ల కాలంలో మేం ఎక్కని కోర్టు మెట్టులేదు. మొదట జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు.. అనంతరం సుప్రీంకోర్టు ఇలా అన్నిచోట్లకు వెళ్లాం. సర్వోన్నత న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే మాకు న్యాయం జరిగినట్లేనని భావించాం. దోషుల రివ్యూ పిటిషన్‌ను 2018లో కోర్టు తిరస్కరించగానే సంతోషపడ్డాం. అప్పటి నుంచి నేటి దాకా ప్రతీ విచారణకు నేను హాజరవుతూనే ఉన్నాను. నా కుటుంబాన్ని వదిలేసి మరీ కోర్టుల చుట్టూ తిరిగాను. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. (లాయర్‌ను తొలగించా.. టైం కావాలి: నిర్భయ దోషి)

అయితే నా కూతురి పట్ల అత్యంత హేయంగా వ్యవహరించిన ఆ మృగాళ్లు తమ లాయర్‌ను అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తారని నేను అస్సలు ఊహించలేదు. వాళ్లను నేరస్థులుగా చిత్రీకరించామని వాళ్లకు వాళ్లు చెప్పుకోవచ్చు. వాళ్ల తీరు నన్నెంతగానో బాధ పెట్టి ఉండవచ్చు. వాళ్ల ఎత్తుగడల వల్ల... నా కూతురి మీద అత్యాచారం జరిగిందని నేను పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈ అయినా నేను పోరాటం ఆపలేదు. ఎందుకంటే ఇలాంటి అకృత్యాలు కేవలం నా కూతురి ఘటనతోనే ఆగిపోలేదు. ఆగిపోవు కూడా. వాళ్ల ఉరిశిక్ష వాయిదా పడటం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇలాంటి దోషుల వల్లే న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయి.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్‌ వద్ద ఇంకా..)

మానవ హక్కుల పేరిట వ్యాపారం..
ఇక ఎప్పుడైతే దోషుల మెడకు ఉరి బిగుసుకుపోతుందని వాళ్ల కుటుంబాలకు, లాయర్‌కు తెలుస్తుందో.. అప్పుడే వాళ్లు పేదవాళ్లు అనే సంగతి గుర్తుకువస్తుంది. ఇంకో విషయం.. ప్రపంచ మానవ హక్కుల సంస్థ.. ఇలాంటి నేరస్థుల హక్కుల గురించి మాట్లాడుతుంది. వాళ్లకు మద్దతుగా నిలుస్తుంది. పెద్ద పెద్ద ఆర్టికల్స్‌ రాసి పేరు సంపాదించుకుంటుంది. మానవ హక్కుల పేరిట పెద్ద వ్యాపారమే చేస్తోంది’’అని ఆశాదేవి విమర్శించారు. ఒకవేళ ఇలాంటి నేరగాళ్లు బెయిలు మీద బయటకు వస్తే.. బాధితులను, బాధితుల కుటుంబాలను చంపడానికైనా సిద్ధపడతారు. తగులబెట్టేందుకు కూడా వెనుకాడరు. మన కూతుళ్లు సురక్షితంగా ఉండాలంటే.. ఇలాంటి మృగాళ్లను ఉరితీయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు.(దోషుల లాయర్‌ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement