న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం రాజధానిలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీ పరిధిలో ఉన్న మునిర్కకు వెళ్లేందుకు బస్సు ఎక్కిన నిర్భయపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. చిత్ర హింసలు పెట్టి.. ఆమెను, స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ఆ తర్వాత ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించి విఫలమై... వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అయితే దేశ రాజధానిలో ఈ ఘటన జరగడం, మీడియా కూడా ఈ విషయంలో త్వరగా స్పందించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
అనేక పరిణామాల అనంతరం వారిని దోషులుగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఆనాటి నుంచి నేటి దాకా నిర్భయ కేసులో బాధితురాలి తల్లిదండ్రులకు ఎంతో మంది అండగా నిలిస్తే.. దోషులకు మాత్రం ఒకే ఒక వ్యక్తి పూర్తి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన కేవలం న్యాయవాదిగా తన కర్తవ్యాన్ని నెరవేరిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు.. కానీ ఆయన అలా చేయలేదు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని, మహిళల వస్త్రధారణ ఇతరత్రా విషయాలపై నోరు పారేసుకున్నారు. చట్టంలోని లొసుగులను అనేక విధాలుగా ఉపయోగించుకున్నారు. ఆఖరికి శుక్రవారం దోషులకు ఉరిశిక్ష అమలైన నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. (నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడ?!)
ఆయన పేరు అజయ్ ప్రకాశ్ సింగ్(42). లక్నో యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. 1997 నుంచి సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. చాన్నాళ్లుగా అక్కడ పనిచేస్తున్నా ఆయనకు అంతగా గుర్తింపు లేదు.. గానీ నిర్భయ దోషుల తరఫున(మొదట అక్షయ్ ఠాకూర్.. తర్వాత పవన్ గుప్తా) వకాల్తా పుచ్చుకోగానే ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. తన క్లైంట్లను నిర్దోషులుగా నిరూపించేందుకు... బాధితురాలిని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ అమ్మాయి అంతరాత్రి పూట అబ్బాయితో బయటకు ఎందుకు వెళ్లిందో నేను అడగకూడదా? వాళ్లిద్దరూ కలిసి రాఖీ పండుగ జరుపుకోవడానికి అన్నాచెల్లెళ్లలా కలిసి బయటకు వెళ్లారో నాకు తెలియదు. అయితే వాళ్లు స్నేహితులు అని నాకు తెలుసు. ఈరోజుల్లో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ సంస్కృతిని మనం పొగడాల్సిందే. కానీ నేను అటువంటి ఇంటి నుంచి రాలేదు. ఒకవేళ నా కూతురు లేదా సోదరి ఇలా పెళ్లికి ముందే చెడు తిరుగుళ్లు తిరిగి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని, ఎవరైనా తనను ఏమైనా చేయవచ్చనే అవకాశం ఇస్తే.. నేను తనను వెంటనే మా ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లేవాడిని. అక్కడే కుటుంబం అందరి ముందూ పెట్రోల్ పోసి తగులబెట్టేవాడిని’’ అని కుల, లింగ వివక్షతో కూడిన అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. (అర్ధరాత్రి నిర్భయ ఎక్కడుందో తెలుసా)
ఇక ఈ కేసును అంగీకరించడం గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘తీహార్ జైలులో ఉన్న అక్షయ్‌ని కలవడానికి అతడి భార్య బిహార్‌లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీకి వచ్చింది. అప్పుడే తనకు ఎవరో నా నెంబర్ ఇచ్చారు. దీంతో ఆమె మా ఇంటికి వచ్చి మా అమ్మను కలిసింది. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి.. మా అమ్మ గంభీరంగా ఉంది. ఈ అమ్మాయికి నువ్వు న్యాయం చేయాల్సిందే అని పట్టుబట్టింది. నిజానికి మా అమ్మానాన్న ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. వాళ్లు ఎక్కువగా టీవీ చూడరు. అందుకే ఈ జంతర్‌మంతర్, రామ్‌లీలా నిరసనలు, మామ్‌బత్తీ, ధూప్ బత్తీ, అగర్‌బత్తీ ర్యాలీల గురించి వారికి అంతగా తెలియదు’’ అంటూ నిర్భయకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన వారిని కించపరుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిందితులను దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో సహనం కోల్పోయి ఏకంగా న్యాయమూర్తి ముందే అసహనం వెళ్లగక్కారు. ‘‘మీరు నిజాన్ని పట్టించుకోరు. అబద్ధాల్నే నమ్ముతారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నాయకులు, ప్రజాగ్రహం ఒత్తిడికి తలొగ్గారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి)
ఏపీ సింగ్ వ్యవహారశైలిని నిరసిస్తూ.. ఈ కేసు నుంచి తప్పుకోవాలని యువత ర్యాలీలు నిర్వహించిన సమయంలో కేవలం అక్షయ్ తరఫునే కాకుండా పవన్ గుప్తా తరఫున కూడా తానే వాదిస్తానంటూ ముందడుగు వేశారు. తర్వాత వినయ్ తరఫున కూడా వకాల్తా పుచ్చుకున్నారు. ఈ క్రమంలో చట్టపరంగా దోషులకు ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. సామాన్యులకు అంతుపట్టని విధంగా వరుస పిటిషన్లతో ఎప్పటికప్పుడు శిక్ష అమలును వాయిదా వేస్తూ వచ్చారు. ఆఖరికి న్యాయవాదిగా తాను ఓడిపోవడంతో మరోసారి బాధితురాలు, ఆమె తల్లి వ్యక్తిత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. దోషుల తల్లుల గర్భశోకం గురించి మాట్లాడారు. బాధితురాలి తల్లి వైపు మాత్రమే ఉంటారా.. మిగత తల్లుల బాధ మీకు పట్టదా అని సమాజాన్ని నిలదీశారు. అయితే అదే సమయంలో నిర్భయ తల్లి కడుపుకోత గురించి మాత్రం ఆలోచించలేకపోయారు. ఎందుకంటే ఆమె ఓ మహిళ, ఓ అత్యాచార బాధితురాలి తల్లి కావడం వల్లే ఆయన అలా మాట్లాడారు. న్యాయవాదిగా దోషులను సమర్థించినా వ్యక్తిగతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయారు. దోషి ఒక ఆడపిల్ల అయి ఉంటే ఆయన వైఖరి వేరేలా ఉండేదేమో? వెంటనే ఉరితీయాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగేవారేమో?.. అన్నట్టు ఆయన కూడా ఓ ఆడపిల్లకు తండ్రే!(ఉరి ఖాయం.. ఇక నా కూతురి ఆత్మకు శాంతి!)
ఖేదం.. మోదం
సుదీర్ఘ న్యాయపోరాటంలో నిర్భయ తల్లిదండ్రులు న్యాయ వ్యవస్థ, జడ్జీలు, మీడియా, మహిళా సంఘాల అండతో ముందుకు సాగి విజయం సాధిస్తే.. దోషుల తల్లిదండ్రులు మాత్రం ఏపీ సింగ్‌నే నమ్ముకున్నారు. ఓ దేవుడిలా ఆయనను పూజించారు. ఆయన మాటలు వారిపై ఎంతో ప్రభావం చూపాయనడానికి.. దోషి పవన్ గుప్తా తండ్రి వ్యాఖ్యలే నిదర్శనం. ఫిబ్రవరి 1 దోషులను ఉరితీసేందుకు రంగం సిద్ధమైన సమయంలోకొడుకును చూసేందుకు జైలుకు రావాలని ఆయనకు పిలుపువచ్చిన సమయంలో.. ‘‘నా కొడుకు ఇదే ఆఖరి రోజని అధికారులు చెప్పారు. వాడిని చూసిపొమ్మన్నారు. కానీ నేను పవన్‌ను కలవలేదు. ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు. కోర్టు మా మాటనే నమ్ముతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఆఖరికి తన కొడుకును శాశ్వతంగా పోగొట్టుకుని ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు.(నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్ కానీ ఉరి తర్వాత!)
Comments
Please login to add a commentAdd a comment