కోవన్‌కు ఊరట | kovan release on bail | Sakshi
Sakshi News home page

కోవన్‌కు ఊరట

Published Wed, Nov 4 2015 8:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

kovan release on bail

చెన్నై : జానపద కళాకారుడు కోవన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. జాతీయ భద్రతా చట్టం అమలుకు స్టే విధిస్తూ మంగళవారం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోవన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. కోవన్ ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు తదుపరి కన్నయ్యన్ రాందాసుపై గురి పెట్టారు. రాష్ట్రంలో మద్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా జానపద కళాకారుడు కోవన్ పాడిన పాటలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు జాతీయ భద్రతా చట్టం ప్రయోగించే పనిలో పడ్డారు. పుళల్ జైల్లో ఉన్న కోవన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మద్యానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమం రాజుకుంది.
 
దీనిపై ఉక్కుపాదం మోపే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవన్‌పై నమోదు చేస్తున్న జాతీయ భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తనయుడు చారువాహన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తన పాటలో కోవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, మద్యానికి వ్యతిరేకంగా ఇక్కడ సాగుతున్న వ్యవహారాన్ని ఎత్తి చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని అన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదన్న విషయాన్ని పరిగణించాలని తన పిటిషన్‌లో చారువాహన్ సూచించారు.
 
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి సుందరేషన్ నేతత్వంలోని బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ కోవన్‌పై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు. కోవన్‌ను విడుదల చేయాలంటూ రాష్ర్టంలో పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి.

తిరుచ్చిలో జరిగిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కోవన్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి తమ గురిని కన్నయ్యన్ రాందాసు మీద పెట్టారు. కోవన్ పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేసిన మక్కల్ కలై ఇయక్కంకు చెందిన కన్నయ్యన్‌పై క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నయ్యన్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement