Tamil folk singer
-
'భయపడను.. రాయడం మానను'
చెన్నై: తాను పాటలు రాయడం, పాడటం ఆపే ప్రసక్తి లేదని ప్రముఖ తమిళ జానపద కళాకారుడు కోవన్ స్పష్టం చేశాడు. తాను వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తూ పాటలు రాస్తున్నాను.. పాడుతున్నానే తప్ప ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చేసే చర్య కాదని అన్నారు. తమిళనాడు సీఎం జయలలితపై అభ్యంతరకర పాటలు రాసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినందుకు రాజద్రోహం కేసులో కోవన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమిళనాట మద్యనిషేధ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మక్కల్ కలై ఇలక్కియ కళగం సంస్థకు చెందిన కోవన్.. ఇందుకోసం రాసిన పాటలో జయతోపాటు డీఎంకే అధినేత కరుణానిధిపైనా కొన్ని పదాలతో పాటలు పాడి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. దీంతో కోవన్‌పై పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు. దీనిపట్ల జయలలిత ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేశారు. జాతీయ భద్రతా చట్టం అమలుకు స్టే విధిస్తూ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరింత కస్టడీ పొడిగింపు కోసం బుధవారం కోర్టు తీసుకొచ్చిన సందర్భంగా కోవన్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను జయలలిత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాసిన పాటలోని కొన్ని చరణాలు పాడి వినిపించారు. తన పాటల ద్వారా తమిళనాడు సమాజం ఎంత ప్రభావానికి గురవుతుందో, మద్యం నిషేధానికి ఎంత దోహదపడుతుందో మొత్తం తమిళ సమాజానికి తెలుసని, అందుకే పోలీసులకు భయపడి తాను పాటలు రాయడం ఆపేది లేదని స్పష్టం చేశారు. -
కోవన్కు ఊరట
చెన్నై : జానపద కళాకారుడు కోవన్కు హైకోర్టులో ఊరట లభించింది. జాతీయ భద్రతా చట్టం అమలుకు స్టే విధిస్తూ మంగళవారం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోవన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. కోవన్ ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు తదుపరి కన్నయ్యన్ రాందాసుపై గురి పెట్టారు. రాష్ట్రంలో మద్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా జానపద కళాకారుడు కోవన్ పాడిన పాటలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు జాతీయ భద్రతా చట్టం ప్రయోగించే పనిలో పడ్డారు. పుళల్ జైల్లో ఉన్న కోవన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మద్యానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమం రాజుకుంది. దీనిపై ఉక్కుపాదం మోపే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవన్‌పై నమోదు చేస్తున్న జాతీయ భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తనయుడు చారువాహన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తన పాటలో కోవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, మద్యానికి వ్యతిరేకంగా ఇక్కడ సాగుతున్న వ్యవహారాన్ని ఎత్తి చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని అన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఎలాంటి ఆరోపణలూ చేయలేదన్న విషయాన్ని పరిగణించాలని తన పిటిషన్లో చారువాహన్ సూచించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి సుందరేషన్ నేతత్వంలోని బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ కోవన్‌పై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేశారు. కోవన్ను విడుదల చేయాలంటూ రాష్ర్టంలో పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుచ్చిలో జరిగిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కోవన్ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి తమ గురిని కన్నయ్యన్ రాందాసు మీద పెట్టారు. కోవన్ పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేసిన మక్కల్ కలై ఇయక్కంకు చెందిన కన్నయ్యన్పై క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నయ్యన్ అజ్ఞాతంలోకి వెళ్లారు.