'భయపడను.. రాయడం మానను'
చెన్నై: తాను పాటలు రాయడం, పాడటం ఆపే ప్రసక్తి లేదని ప్రముఖ తమిళ జానపద కళాకారుడు కోవన్ స్పష్టం చేశాడు. తాను వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తూ పాటలు రాస్తున్నాను.. పాడుతున్నానే తప్ప ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చేసే చర్య కాదని అన్నారు. తమిళనాడు సీఎం జయలలితపై అభ్యంతరకర పాటలు రాసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినందుకు రాజద్రోహం కేసులో కోవన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమిళనాట మద్యనిషేధ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మక్కల్ కలై ఇలక్కియ కళగం సంస్థకు చెందిన కోవన్.. ఇందుకోసం రాసిన పాటలో జయతోపాటు డీఎంకే అధినేత కరుణానిధిపైనా కొన్ని పదాలతో పాటలు పాడి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు.
దీంతో కోవన్‌పై పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు. దీనిపట్ల జయలలిత ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేశారు. జాతీయ భద్రతా చట్టం అమలుకు స్టే విధిస్తూ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరింత కస్టడీ పొడిగింపు కోసం బుధవారం కోర్టు తీసుకొచ్చిన సందర్భంగా కోవన్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను జయలలిత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాసిన పాటలోని కొన్ని చరణాలు పాడి వినిపించారు. తన పాటల ద్వారా తమిళనాడు సమాజం ఎంత ప్రభావానికి గురవుతుందో, మద్యం నిషేధానికి ఎంత దోహదపడుతుందో మొత్తం తమిళ సమాజానికి తెలుసని, అందుకే పోలీసులకు భయపడి తాను పాటలు రాయడం ఆపేది లేదని స్పష్టం చేశారు.