ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’ | CJI is office to come under RTI | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’

Published Thu, Nov 14 2019 2:25 AM | Last Updated on Thu, Nov 14 2019 8:55 AM

CJI is office to come under RTI - Sakshi

సమాచార హక్కు చట్టం... ఇకపై ఈ చట్టం పరిధిలోకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌  కార్యాలయం కూడా వచ్చింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలనీ, పారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది.  సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది.

న్యూఢిల్లీ: సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం విస్తృతిని మరింత పరిపూర్ణం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ (సీజేఐ) కార్యాలయం సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు జడ్జీల   రాజ్యాంగ ధర్మాసనం 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సంపూర్ణంగా సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కేంద్ర పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ అధికారి దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలని, పారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా సమాచార హక్కు చట్టాన్ని నిఘా సాధనంగా వాడకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే గోప్యత హక్కు ప్రాధాన్యత కలిగినదని, సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇవ్వాలని నిర్ణయించేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కిచెప్పింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించగలదని స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఇతర సభ్యులుగా ఉన్నారు.

హైకోర్టులో ప్రశాంత్‌ భూషణ్‌ వినిపించిన వాదనేమిటి?  
జడ్జీల  నియామకాలు అంతుచిక్కని రహస్యంగా ఉన్నాయి. వాటిలో పారదర్శకత అవసరం ఉన్నదని ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ హైకోర్టులో వాదించారు. జడ్జీలు మరో ప్రపంచంలో జీవిస్తున్నారా? అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ ప్రజల నిఘాకు మినహాయింపు కాదని, అతీతం అంతకన్నా కాదని ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారమివ్వడాన్ని వ్యతిరేకించడం ‘దురదృష్టకరం. బాధాకరం’ అని అన్నారు.

ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది?
చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూ జనవరి 10, 2010లో ఢిల్లీ హైకోర్టు ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూ ర్తి హక్కు కాదనీ, న్యాయమూర్తి బాధ్యత’అని అభివర్ణించింది. 2010లో నాటి ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఏపీ షా, జస్టిస్‌ విక్రమ్‌జిత్‌ సేన్, ఎస్‌.మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం 88 పేజీల తీర్పుని వెలువరించింది. చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయాన్ని సమాచర హక్కు చట్టం పరిధిలోకి తేవడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న సుప్రీంకోర్టు వాదనను నాడు ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పునిచ్చిన జస్టిస్‌ సేన్‌ రిటైరవగా, జస్టిస్‌ మురళీధర్‌ ప్రస్తుతం హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిగా ఉన్నారు.

సూత్రధారి ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్‌
సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలనే వాదన తొలుత తీసుకొచ్చింది ఆర్టీఐ కార్యకర్త సుభాష్‌ చంద్ర అగర్వాల్‌. జడ్జీల  ఆస్తుల సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ అగర్వాల్‌ 2007లో సుప్రీంకోర్టుకి అప్పీల్‌ చేశారు.

జడ్జీల నియామకాల్లో కొలీజియం, కేంద్రం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారం ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది. దీంతో అగర్వాల్‌ కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ)ని ఆశ్రయించారు. సీఐసీ అగర్వాల్‌కు అనుకూలంగా స్పందించింది. సీఐసీ ఉత్తర్వుల్ని ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టు సవాల్‌ చేయడంతో 2010లో సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకొస్తుందని ఢిల్లీహైకోర్టు తీర్పుచెప్పగా దీన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది.

సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు చేర్చాలి
► రాజ్యవ్యవస్థ మనుగడకు అవసరమైన అన్ని విభాగాల పనితీరు విషయంలో అత్యంత పారదర్శకతను ప్రదర్శించే సుప్రీంకోర్టు తన సొంత విషయాన్ని సైతం అదే కోణంలో చూడాలి.  
► న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత అవసరం ఉంది.
► కొలీజియంలోని న్యాయమూర్తుల అభిప్రాయాలకు విలువనిస్తున్నారా? లేదా? తెలుసుకోవాల్సిన బా«ధ్యత ప్రజలకు ఉంటుంది.  
► సీఐసీ ఉత్తర్వుల అనంతరం సమాచారాన్ని వెల్లడించడంలో సుప్రీం కోర్టు సందేహించాల్సిన అవసరం ఏమిటి?  
► సీఐసీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు తన సొంత కోర్టులోనే సవాల్‌ చేయడం వల్ల అనుమానానికి తావుంటుంది. అందుకే ఈ కారణాలన్నింటి రీత్యా భారత అత్యున్నత న్యాయ స్థానం సాధారణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు సీజేఐ కార్యాలయాన్ని సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోనికి తేవాల్సిన అవసరం ఉన్నదని ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్‌ని సమర్థిస్తున్న వారి వాదన.


ఎప్పుడేం జరిగిందంటే..?
► నవంబర్‌ 11, 2007: జడ్జీల ఆస్తుల సమాచారాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టుకెళ్లిన అగర్వాల్‌
► నవంబర్‌ 30: సమాచారమిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
► డిసెంబర్‌ 8: కోర్టులో తొలి అప్పీల్‌ దాఖలు
► జనవరి 12, 2008: కొట్టివేసిన కోర్టు
► మార్చి 5: సీఐసీని సంప్రదించిన అగర్వాల్‌
► జనవరి 6, 2009: సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న సీఐసీ
► జనవరి 17: సీఐసీ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసిన సుప్రీంకోర్టు
► ఫిబ్రవరి 26: తమ న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వ్యక్తిగత సమాచారం కనుక ఆర్టీఐ పరిధిలోకి రావన్న సుప్రీంకోర్టు
► మార్చి 17: తమ జడ్జీలు ఆస్తుల సమాచారాన్ని వెల్లడించేందుకు విముఖత చూపడం లేదనీ, అయితే అందుకు పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదనీ, అయితే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్య.  
► మే 4: సుప్రీంకోర్టు అప్పీల్‌పై ఆర్డర్‌ని రిజర్వులో ఉంచిన హైకోర్టు.
► సెప్టెంబర్‌ 2: సీఐసీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌.
► అక్టోబర్‌ 5: దీన్ని సవాల్‌ చేసిన సుప్రీంకోర్టు.
► అక్టోబర్‌ 7: ముగ్గురు జడ్జీలతో హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు  
► 2010 జనవరి 10: ఆర్టీఐ పరిధిలోనికి సీజేఐ ఆఫీస్‌ వస్తుందని హైకోర్టు తీర్పు
► నవంబర్‌ 26: తీర్పుపై సుప్రీంలో సవాల్‌చేసిన సుప్రీంకోర్టు ఎస్‌జీ, సీపీఐఓ
► ఏప్రిల్‌ 4, 2019:  తీర్పుని రిజర్వులో ఉంచిన «సుప్రీంకోర్టు
► నవంబర్‌ 13, 2019: ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement